మిన్నంటిన స్వాతంత్య్ర సంబరాలు | 67th Independence Day Celebrations in Nationwide | Sakshi
Sakshi News home page

మిన్నంటిన స్వాతంత్య్ర సంబరాలు

Aug 16 2013 5:10 AM | Updated on Oct 22 2018 9:16 PM

భారత 67వ స్వాతంత్య్ర దినం పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. విదేశాల్లోని భారతీయులు సైతం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.

న్యూఢిల్లీ: భారత 67వ స్వాతంత్య్ర దినం పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. విదేశాల్లోని భారతీయులు సైతం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అస్సాం, మణిపూర్‌లలో బాంబు పేలుళ్లు మినహా దేశవ్యాప్తంగా వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. తీవ్రవాదులు హింసకు స్వస్తి పలకాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా భారత్ పాకిస్థాన్‌తో చర్చలు పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చే శారు.
 
 దేశంలోని మిగతా రాష్ట్రాల ప్రజలకు భిన్నంగా జమ్మూకాశ్మీర్ వాసులను చూస్తున్న తీరు కారణంగానే ఇక్కడి ప్రజలు తాము ప్రత్యేకమనే భావనకు లోనవుతున్నారని చెప్పారు. మణిపూర్‌లో గురువారం ఉదయం రాజధాని ఇంఫాల్‌లో రెండు శక్తిమంతమైన బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మొయిరాంఖోమ్ పెట్రోల్ పంప్ ప్రాంతంలో ప్రధాన వేడుకకు కేవలం 400 మీటర్ల దూరంలో సీఎం ఇబోబి సింగ్ అక్కడ ఉండగానే మొదటి పేలుడు సంభవించింది. అయితే ఎవరూ గాయపడలేదు. అస్సాంలోని బోంగైగాంవ్‌లో చర్చల వ్యతిరేక నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ పేలుళ్లకు పాల్పడింది. కోక్రాఝర్‌లో జరిగిన పేలుడులో ఒకరు గాయపడ్డారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, త్రిపుర పలు ఇతర రాష్ట్రాల్లో కూడా వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో పతాకావిష్కరణ విషయమై ఓ బీజేపీ ఎమ్మెల్యే, మునిసిపల్ చైర్మన్ మధ్య తలెత్తిన వివాదం ముష్టిఘాతాలకు దారితీసింది. చైనా, పాకిస్థాన్, బ్రిటన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇజ్రాయెల్, రష్యా, మయన్మార్, సింగపూర్, ఇండోనేసియా, మలేషియా, ఫిలిప్పీన్స్, కాంబోడియా, వియత్నాం, జపాన్‌లోనూ వేడుకలు జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement