పది జిల్లాల తెలంగాణ ఖాయం: పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి


సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో అన్ని అంశాలు చర్చించాక తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధినేత్రి సోనియా తనతో చెప్పారని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. అయితే ప్రత్యేక కోర్‌కమిటీ భేటీ ఎప్పుడనేదీ తనతో చెప్పలేదని, బహుశా ఈ వారంలోనే ఆ భేటీ నిర్వహించి మరో పది, పదిహేను రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. రాయల తెలంగాణకు ఆస్కారం లేదని, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్లుగా హైదరాబాద్ రాజధానితో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు ఖాయమని ఆయన సోనియాతో భేటీ అనంతరం పేర్కొన్నారు.



పాల్వాయి మంగళవారం పార్టీ అధినేత్రి సోనియాను ఆమె నివాసంలో కలిశారు. సుమారు అరగంట పాటు రాష్ట్రంలోని పరిస్థితులు, తెలంగాణ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటు చేస్తే ఉత్పన్నమయ్యే పలు రకాల సమస్యలపై సోనియా.. పాల్వాయి వివరణను తీసుకున్నారు. ముఖ్యంగా నదీ జలాల పంపిణీ, హైదరాబాద్ అంశం, తెలంగాణలోని సీమాంధ్రుల భద్రతపై పలు ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నదీ జలాల పరిష్కారానికి ఏంచేయొచ్చనే దానిపై పాల్వాయి ఓ నోట్‌ను, తెలంగాణ సత్వర ఏర్పాటు కోరుతూ ఓ మెమోరాండాన్ని సమర్పించినట్లు తెలిసింది.



సోనియాతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సోనియాతో సమావేశంలో తెలంగాణ ఏర్పడితే కలిగే లాభాలపై చర్చించాం. ఈ సందర్భంగా పలు అంశాలపై అమె ప్రశ్నలడిగారు. వాటన్నింటికీ నేను వివరణలు ఇచ్చా. ముఖ్యంగా నదీ జలాల పంపకంపై చర్చ జరిగింది. నీటి పంపకానికి సంబంధించి ట్రిబ్యునల్ ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చని చెప్పా’’ అని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ ఏర్పాటు దిశగా సానుకూల సంకేతాలు పంపినందుకు గాను ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు సంతోషంగా ఉన్నాయని సోనియా దృష్టికి తీసుకెళ్లి, వారందరి తరఫున ఆమెకు ధన్యావాదాలు తెలిపానని చెప్పారు. దీనిపై ఆమె స్పందిస్తూ ‘ఇప్పుడే ధన్యవాదాలు ఎందుకు, నిర్ణయం అయ్యాక చెప్పండి’ అని వ్యాఖ్యానించారని పాల్వాయి తెలిపారు. ‘సోనియాతో భేటీ తర్వాత తెలంగాణపై ఏర్పాటు ఖాయమనే మీరు అనుకుంటున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘తెలంగాణ ఏర్పాటు ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే నాతో సహా తెలంగాణ ప్రాంత నేతలంతా ఉత్సాహంగా ఉన్నాం. దానిలో అనుమానం అక్కర్లేదు’’ అని ఆయన బదులిచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top