ముందుగా ప్రపోజ్ చేసిందెవరంటే..
మా ప్రేమను ముందుగా ప్రపోజ్ చేసిందెవరన్న ప్రశ్నకు నటి జ్యోతిక ఏం బదులిచ్చి ఉంటారో ఊహించగలరా? సూర్య, జ్యోతికలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఈ అన్యోన్య సినీ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివాహం తరువాత నటనకు చిన్న విరామం ఇచ్చిన జ్యోతిక 36 వయదినిలే చిత్రంతో మళ్లీ రీఎంట్రీ అయిన విషయం తెలిసిందే. హీరోయిన్ సెంట్రిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకాదరణను పొందడంతో తాజాగా జ్యోతిక మగళీర్ మట్టుం చిత్రంతో తెరపైకి వచ్చారు. ఈ చిత్రం విజయబాట పట్టడంతో ఖుషీగా ఉన్న జ్యోతిక ఇటీవల ఫేస్‌బుక్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. వాటిలో కొన్ని చూద్దాం.
ప్రశ్న: మీ అభిమాన నటుడు సూర్యనేనా?
జ: విజయ్‌సేతుపతి. (త్వరలో మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌సేతుపతితో కలిసి నటించనున్నారన్నది గమనార్హం)
ప్రశ్న: మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం రావడం గురించి?
జ: మొదట ఈ విషయం గురించి కార్తీనే నాకు చెప్పారు. మణిరత్నం దర్శకత్వంలో నటించే విషయం గురించి మద్రాస్ టాకీస్ సంస్థ నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు. అంతే నేను చాలా ఎగ్జైట్‌గా ఫీలయ్యాను. అంతే కాదు మరో ఆలోచన లేకుండా మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాను.
ప్ర: అజిత్‌తో నటించిన అనుభవం గురించి?
జ: నా కెరీర్ ప్రారంభంలో అజిత్‌తో కలిసి కొన్ని చిత్రాల్లో నటించాను. ఆయన చాలా వండర్‌పుల్ పర్సన్. అంతే కాదు చాలా జెంటిల్‌మెన్ కూడా. మేము కలిసి నటిస్తున్న సమయంలోనే అజిత్, శాలినిల మధ్య ప్రేమ చిగురించింది.
ప్ర: మగళీర్‌మట్టుం చిత్రంలో అతిథి పాత్రలో నటుడు మాధవన్ మెరిశారు. మేము సూర్యను ఊహించుకున్నాం. సూర్య మీరు మళ్లీ కలిసి నటిస్తారా?
జ: నిజం చెప్పాలంటే మేమిద్దం కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అందుకు తగ్గ కథే లభించలేదు. అలాంటి ఎగ్జైటింగ్ కథ అమరితే సూర్య నేను కలిసి కచ్చితంగా నటిస్తాం.
ప్ర: మీ ఇద్దరి మధ్య ప్రేమను ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు?
జ: నిజం చెప్పాలంటే ఆ విషయం గురించి మా ఇద్దరికీ గుర్తు లేదు. పెళ్లికి ముందు చాలా కాలంగా మా మధ్య రిలేషన్‌షిప్ ఉంది. అయితే సూర్య మాత్రం ముందుగా నేనే ప్రపోజ్ చేశానని చెబుతారు.