వన్స్‌ మోర్‌

weekly  report on movies - Sakshi

కొన్ని కాంబినేషన్లను మళ్లీ చూడాలనిపిస్తుంది అదొక మ్యాజిక్‌.  ఆ కాంబినేషన్లు వచ్చినప్పుడు కొంతమందికి నూనూగు మీసాలు కూడా వచ్చి ఉండవు.  ఈ కాంబినేషన్లు మళ్లీ వస్తున్నప్పుడు  కొందరికి జుట్టు  నెరిసిపోయి ఉంటుంది. ఏది ఏమైనా ఈ కాంబినేషన్లు వన్స్‌మోర్‌ అంటుంటే.. అందరి కళ్లు మెరిసిపోతున్నాయి.

చైన్‌ పోయె... గన్‌ వచ్చె!
సిల్వర్‌ స్క్రీన్‌పై సైకిల్‌ చైన్‌ గిర్రున తిరిగి హీరో నాగార్జున చేతికొచ్చింది.. అంతే... బాక్సాఫీస్‌ గల్లాపెట్టె ఘల్లున మోగింది. అప్పట్లో సైకిల్‌ చైన్‌ ట్రెండ్‌ అయ్యింది. సినిమా ట్రెండ్‌సెట్టర్‌ అయింది. యస్‌.. ఇదంతా 29ఏళ్ల క్రితం నాగార్జున హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమా గురించే. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో ‘అంతం, గోవిందా గోవిందా’ సినిమాలు వచ్చాయి. మళ్లీ ఈ కాంబినేషన్‌ సెట్‌ కావడానికి ఆల్మోస్ట్‌ 24ఏళ్ల టైమ్‌ పట్టింది.  రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరో గా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి ఫస్ట్‌ మూవీ ‘శివ’ రేంజ్‌లో ఈ రీ–యూనియన్‌ మూవీ ట్రెండ్‌ సెట్‌ చేస్తుందనే అంచనాలున్నాయి.నాగార్జున పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు.

ఈసారి అమెరికా నవ్వులు
‘వెంకీ’గా రవితేజ ట్రైన్‌లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ మాటకొస్తే ముంబైలోనే దుబాయ్‌కి వెళ్లిన ‘దుబాయ్‌ శీను’ తక్కువేం కాదు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడానికి. ఈ రెండు సినిమాలకు ముందు, కెరీర్‌ స్టార్టింగ్‌లో ‘నీ కోసం’ అంటూ లవ్‌స్టోరీలో రవితేజ మెస్మరైజ్‌ చేసిన విషయాన్ని మరచిపోలేం. నీ కోసం, వెంకీ, దుబాయ్‌ శీను.. ఈ మూడు సినిమాలు శ్రీను వైట్ల  దర్శకత్వంలోనే రూపొందాయి. పదేళ్ల తర్వాత మళ్లీ  ప్రేక్షకులకు కితకితలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు శ్రీనువైట్ల, రవితేజ. ఈసారి.. వైజాగ్‌ కాదు. దుబాయ్‌ కాదు. అమెరికా బ్యాక్‌డ్రాప్‌. త్వరలో ఈ చిత్రం స్టార్ట్‌ కాబోతోంది.

మళ్లీ దిల్‌ కలిసింది
రామునికి పట్టాభిషేకం 14ఏళ్ల వనవాసం తర్వాత జరిగింది. కానీ çసహవాసంగా ఉంటూనే నిర్మాత ‘దిల్‌’ రాజు, హీరో నితిన్‌ల కాంబినేషన్‌లోని ‘శ్రీనివాస కల్యాణానికి’ 14ఏళ్ల టైమ్‌ పట్టింది. ‘శతమానం భవతి’ ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ‘దిల్‌’రాజు నిర్మాణంలో రూపొందనున్న సినిమా ‘శ్రీనివాస కల్యాణం’. నితిన్‌ రెండో సినిమా ‘దిల్‌’ని డిస్ట్రిబ్యూట్‌ చేసింది ‘దిల్‌’ రాజు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో రాజు పేరు ముందు ‘దిల్‌’ చేరింది. 14 ఏళ్లుగా ఆ పేరు అలా సెటిలైపోయింది. ఆ సంగతలా ఉంచితే.. ‘దిల్‌’ రాజు, అల్లు అర్జున్‌ రీ–యూనియన్‌ గురించి గుర్తు చేయాలి. అల్లు అర్జున్‌తో ‘ఆర్య’, ‘పరుగు’ వంటి సూపర్‌ హిట్స్‌ తీసిన ‘దిల్‌’ రాజు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బన్నీతో ‘డీజే’ తీశారు. 

మళ్లీ మళ్లీ పాడాలి
27 ఏళ్లు పట్టింది వారిద్దరి స్వరాలు కలిసి మరో మధుర గానాన్ని ఆలపించడానికి. ఆ ఇద్దరూ యస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజే ఏసుదాస్‌. ఏమ్‌ఏ. నిషాద్‌ దర్శకత్వంలో జయప్రద, రేవతి, పశుపతి, అర్చన ముఖ్య తారలుగా తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ‘కినార్‌’లోని  ‘అయ్యా సామి’ అనే పాటను ఈ ఇద్దరూ కలిసి పాడారు. ఆల్మోస్ట్‌ 27ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దళపతి’లో ‘సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి..’ అనే పాట కోసం వీరి స్వరాలు ఏకమైయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ పాట పాడటం విశేషం. మరోసారి మాత్రం ఇంత గ్యాప్‌ రాకుండా వీరు మళ్లీ మళ్లీ పాడాలని అభిమానులు కోరుకుంటున్నారు.   

రెండో భారతీయుడి ఎంట్రీకి 23 ఏళ్ల టైమ్‌!
మరో భారతీయుడు తెరపైకి రావడానికి 23 ఏళ్లు పట్టింది. 1996లో కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు’. ఈ సినిమా సీక్వెల్‌కు శ్రీకారం చూట్టారు దర్శకుడు శంకర్‌. రీసెంట్‌గా తైవాన్‌లో ‘ఇండియన్‌ 2’ బెలూన్‌ను ఎగురవేసి అఫీషియల్‌గా ఈ చిత్రాన్ని ఎనౌన్స్‌ చేశారు శంకర్‌. భారతీయుడు చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ చిత్రానికి సీక్వెల్‌ అంటే బోలెడంత క్రేజ్‌ నెలకొంది. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీయనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార పేరు వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలోని ఓ పోలీస్‌ క్యారెక్టర్‌ చేయమని అడగడం కోసం హిందీ హీరో అజయ్‌ దేవగన్‌ని అప్రోచ్‌ అయ్యారట దర్శకుడు శంకర్‌.

పదేళ్ల తర్వాత పాటలు
మూడేళ్ల తర్వాత కుదిరింది ‘మారి’ మూవీ సీక్వెల్‌. ధనుష్‌ హీరోగా బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయిక. ఈ ప్లేస్‌లోకి ఎవ్వరూ ఊహించని విధంగా యువన్‌ శంకర్‌ రాజా లైన్లోకి వచ్చారు. ఇక్కడ స్పెషల్‌ ఏంటంటే.. ఆల్మోస్ట్‌ పదేళ్ల తర్వాత ధనుష్‌ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు యువన్‌శంకర్‌ రాజా. 2008లో తెలుగులో వచ్చిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తమిళ రీమేక్‌ ‘యారడీ నీ మోహిని’ చిత్రానికి కలిసి వర్క్‌ చేశారు ధనుష్‌ అండ్‌ యువన్‌. 

మెగాఫోన్‌.. కీ–బోర్డ్‌కి మళ్లీ కుదిరింది
సంగీత సంచలనం ఏఆర్‌ రెహమాన్‌ చాలా బిజీ. అయినప్పటికీ మేనల్లుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ హీరోగా రూపొందుతోన్న ‘సర్వమ్‌ తాళ మయమ్‌’ చిత్రానికి రెహమాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరామేన్‌ రాజీవ్‌ మీనన్‌ దర్శకుడు. రాజీవ్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మిన్‌సార కనవు’, మలి చిత్రం ‘కండు కొండేన్‌ కండు కొండేన్‌’కి రెహమానే స్వరకర్త. 17 ఏళ్ల తర్వాత మళ్లీ రాజీవ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సర్వమ్‌ తాళ మయమ్‌’కి   రెహమానే పాటలు ఇస్తున్నారు. ఆ విధంగా మెగాఫోన్‌కి, కీ–బోర్డ్‌కీ మళ్లీ కుదిరింది. వీరితోపాటు మరికొందరి కాంబినేషన్లు కనువిందు చేయనున్నాయి.

‘చెలి’ గుర్తుందా? బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ. 17 ఏళ్ల క్రితం మాధవన్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వచ్చిన ఆ చిత్రం ఇప్పటి కుర్రకారుకీ నచ్చుతుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ గౌతమ్‌ మీనన్‌–మాధవన్‌ ఓ సినిమా చేయనున్నారని టాక్‌. 

తొమ్మిదేళ్ల క్రితం జై, లక్ష్మీరాయ్‌ ‘వామనన్‌’ అనే చిత్రంలో నటించారు. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ  ‘నీయా–2’ లో నటిస్తున్నారు. ఇందులో కేథరిన్, వరలక్ష్మీకూడా కథానాయికలుగా నటిస్తుండటం విశేషం. 

టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ రీ–యూనియన్‌ జరుగుతోంది. అప్పుడు అన్నదమ్ములు.. ఇప్పుడు తండ్రీకొడుకులు నలభై ఏళ్ల క్రితం ‘అమర్‌ ఆక్బర్‌ ఆంటోనీ’లో అన్నదమ్ములుగా ఉన్నవాళ్లు ఇరవైఏడేళ్ల తర్వాత తండ్రీ కొడుకులుగా తెరపైకి తిరిగొచ్చారు. అదేనండీ.. అమితాబ్‌ బచ్చన్, రిషీ కపూర్‌ గురించి చెబుతున్నాం. ‘ఓ మై గాడ్‌’ ఫేమ్‌ ఉమేశ్‌ శుక్లా దర్శకత్వంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘102 నాటౌట్‌’. దాదాపు 27ఏళ్ల తర్వాత అమితాబ్, రిషి కలిసి నటించిన చిత్రమిది. ఇందులో తండ్రిపాత్రలో అమితాబ్‌ నటించారు. కొడుకు పాత్రలో రిషీ కపూర్‌ నటించారు. ‘కూలీ, అజూబా’ వంటి చిత్రాల్లో కూడా వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ‘అజూబా’ వీరిద్దరూ కలిసి చివరి సారిగా నటించిన చిత్రం. 
– ముసిమి శివాంజనేయులు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top