సహకారం కావాలంటే 'మా' సభ్యత్వం తీసుకోవాలి

We need to take our 'maa' membership - Sakshi

‘‘ఈ నెల 30వ తేదీ వరకూ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌ చేపడతాం. లక్షల్లో పారితోషికం తీసుకునేవాళ్లంతా మెంబర్‌షిప్‌ తీసుకోవాలి. లేకపోతే ‘మా’ నుంచి ఎలాంటి సహకారం అందదు. ఇది హెచ్చరిక కాదు. విన్నపం మాత్రమే’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. ‘మా’ ఏర్పాటై 25వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ వేడుకలను  నిర్వహించడానికి ‘మా’ రంగం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘మా’ సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మోహన్‌బాబు వంటి పెద్దలు మెంబర్స్‌గా ఉండటానికి అంగీకరించారు.

నాగార్జునగారు తమ స్టూడియోలను ఉచితంగా వినియోగించుకోమన్నారు. దర్శకుడు ఎస్‌.వి. కృష్టారెడ్డిగారు చైర్మన్‌గా ఓల్డేజ్‌ హోమ్‌ ఏర్పాటు చేస్తున్నాం. ‘మా’ అధ్యక్ష పదవిలో ఎవరున్నా ఐదేళ్లు ఓల్డేజ్‌ హోమ్‌ బాధ్యతల్ని ఆయనే నిర్వర్తిస్తారు’’ అని చెప్పారు. నటుడు మురళీమోహన్‌ మాట్లాడుతూ– ‘‘25 సంవత్సరాల క్రితం ఓ ఛారిటీ క్రికెట్‌ కోసం నేను, చిరంజీవిగారు వైజాగ్‌ వెళ్లాం. మనకంటూ ఒక అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకుంటే మంచిదని తీసుకున్న నిర్ణయం నుంచి పుట్టిందే ‘మా’’ అన్నారు. ‘మా’ సహాయ నిధికి నటి సూర్యప్రభ రూ. 25, 000 అందించారు. ఇటీవల చనిపోయిన ప్రొడక్షన్‌ చీఫ్‌ చిరంజీవి కుటుంబానికి తెలుగు టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఆధ్వర్యంలో రూ.5 లక్షలు అందించారు. ‘మా’ వైస్‌ ప్రెసిడెంట్‌ బెనర్జీ, జాయింట్‌ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, ఎస్‌.వి. కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top