బ్యాక్‌ బస్టర్‌!

Tollywood Heros New Movies In 2019 - Sakshi

లైఫ్‌లో వెనక్కి వెళ్లలేం.ఇవాళ బతకగలం. రేపటికి అడుగులు వేయగలం.వెనక్కి వెళ్లగలిగితే లైఫ్‌ని ఎంత మార్చుకోవచ్చో!మనకు ఆ చాన్స్‌ లేకపోయినా సినిమాకు ఆ చాన్స్‌ ఉంది.కాలచక్రాన్ని గిర్రు గిర్రున తిప్పుకుని ఏ టైమ్‌లోకైనా కథను తీసుకెళ్లగలుగుతుంది.అలా టైమ్‌ మిషన్‌లో వెనక్కి వెళ్లిన  సినిమా కథలు రేపు రాబోతున్నాయి.అంటే.. రేపటికి బ్యాక్‌కి పోవడమే బ్యాక్‌ బస్టర్‌!

28 ఏళ్లు వెనక్కి
తెల్లమీసం నల్లబడటానికి పది నిమిషాలు చాలు. జస్ట్‌ మేకప్‌తో కవర్‌ చేసేయొచ్చు. నల్లమీసం తెల్లబడాలన్నా అంతే. ఇంతకీ నలుపు, తెలుపు మీసం గురించి ఎందుకూ అంటే.. ‘నల్ల (మంచి) హీరో’ రజనీకాంత్‌ ‘పేట’లో రెండు రకాల లుక్స్‌లో కనిపించబోతున్నారు. 30ఏళ్ల యువకుడు, 40 నుంచి 45 ఏళ్ల మధ్యవయస్కుడి పాత్రలను ఇందులో చేశారాయన. అవును.. కథ ప్రకారం ‘పేట’ సినిమాలో రజనీకాంత్‌కు ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంది. ఆ ఎపిసోడ్‌ ఆడియన్స్‌ని డైరెక్ట్‌గా వెనక్కి తీసుకెళుతుంది.  ఏకంగా 1990లోకి తీసుకెళ్లి మళ్లీ 2018కి తీసుకువస్తుంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటించారు.

చరిత్ర కాలం
తెలుగు గడ్డపై బ్రిటీషర్ల గుండెల్లో భయాన్ని పరుగులు పెట్టించి ప్రజల్లో స్వాతంత్య్రకాంక్ష అనే విత్తును నాటిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా 1847 నేపథ్యంలో సాగుతుంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. చరిత్ర తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. దాంతో పాటు ఆ కాలానికి వెళ్లడం కూడా బాగుంటుంది. ఇప్పటికే నరసింహారెడ్డిగా చిరంజీవి ఎలా కనిపించబోతున్నారో చూసేశాం. ఇక నరసింహారెడ్డి కాలానికి వెళ్లాలంటే ఈ వేసవికి వరకూ ఆగాలి. 

యూరప్‌ లవ్‌స్టోరీ
ఇటీవల ప్రభాస్‌ యూరప్‌లో ఓ  కొత్త లవ్‌స్టోరీని స్టార్ట్‌ చేశారు. ఆగండీ. అది వెండితెరపైనే. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం 1970 నేపథ్యంలో సాగనుంది. ఇందులో పూజా హేగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ యూరప్‌లో జరుగుతుంది. మేరీ జాన్‌ అంటూ తన కొత్త వెండితెర ప్రేమకథను చూసేందుకు ప్రేక్షకులు దాదాపు 30ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందేనని అంటున్నారు ప్రభాస్‌ అండ్‌ టీమ్‌. ఇందుకోసం టీమ్‌ ఆల్రెడీ నాటికాలం కార్లు, పడవలను తయారు చేస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

 వెనక్కిపోదాం రాజా
టైమ్‌ మిషన్‌ అక్కర్లేదు. నా సినిమా థియేటర్లో పడినప్పుడు టిక్కెట్‌ చించుకుని థియేటర్స్‌లో కూర్చొంటే చాలు పాతికేళ్లు వెనక్కిపోతారు అంటున్నారు రవితేజ. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్‌ వీఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘డిస్కో రాజా’ (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 1990 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని సమాచారం. ఇందులో తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారట రవితేజ. షూటింగ్‌ త్వరలో స్టార్ట్‌ కానుంది.

చల్నేదో స్కూటర్‌
బైక్‌లను, కార్లను నాగచైతన్య ఎంత స్పీడ్‌గా డ్రైవ్‌ చేస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి నాగచైతన్య ఇప్పుడు పాతకాలం నాటి స్కూటర్‌లో ‘మజిలీ’ సినిమా కోసం విశాఖపట్నం వీధుల్లో విహరిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దుతున్న ఈ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తున్నారు. 1985 నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందట. ఏప్రిల్‌లో థియేటర్స్‌కి వస్తుంది.

అనగనగా ఓ క్రైమ్‌
‘పీఎస్వీ గరుడవేగ’ అంటూ లేటెస్ట్‌ టెక్నాలజీతో హిట్‌ అందుకున్న రాజశేఖర్‌ ఇప్పుడు ఓల్డ్‌ టెక్నాలజీకి వెళుతున్నారు. 35 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయారు. 1983లో జరిగిన ఓ క్రైమ్‌ను ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నారు. ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగా రూపొందుతోన్న ‘కల్కి’  1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఇందులో అదాశర్శ, నందితా శ్వేత, స్కార్లెట్‌ విల్సన్‌ కథానాయికలు. 


అర్జున్‌ కల
కల కంటే సరిపోదు. దాన్ని సాకారం చేసుకుంటేనే అసలు మజా ఉంటుంది. అయితే నిజం చేయడం అంత సులువు కాదు. ఎంతో పట్టుదల కావాలి. అర్జున్‌ అలాంటివాడే. గొప్ప క్రికెటర్‌ కావాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పాత క్రికెట్‌ కిట్టు దుమ్ము దులిపాడు. 36 ఏళ్ల వయసులో బ్యాట్‌ పట్టుకుని బరిలోకి దిగాడు. ఇది నాని నటిస్తున్న ‘జెర్సీ’ సినిమా స్టోరీ లైన్‌. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1995 నేపథ్యంలో సాగనుందట. క్రికెటర్‌ అర్జున్‌ పాత్రలో నాని నటిస్తున్నారు. రీసెంట్‌గా లుక్‌ని కూడా విడుదల చేశారు. శ్రద్ధాశ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

కొత్త డాన్‌.. పాత గన్‌
ఎన్ని లేటెస్ట్‌ వెపన్స్‌ అందుబాటులో ఉన్నా 1980నాటి రివాల్వర్‌తోనే కాలుస్తా అంటున్నారు శర్వానంద్‌. సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా కోసం. అవును.. ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందట. ఇందులో డ్యూయెల్‌ రోల్‌ చేస్తున్న శర్వానంద్‌ ఒక పాత్రలో డాన్‌గా కనిపిస్తారు. సిల్వర్‌ స్క్రీన్‌పై తొలిసారి డాన్‌గా, కొత్త లుక్‌లో కనిపించనున్న శర్వానంద్‌ పాత గన్ను పట్టారు.  


 సమరం.. ప్రణయం
1945.... అంటే ఇండియాకి స్వాతంత్య్రం రావడానికి రెండు సంవత్సరాల ముందు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలైనా వదులుకోవడానికి సిద్ధమైన ఓ సైనికుడు ప్రేమలో పడితే? అతని మనసులో ఎలాంటి యుద్ధం జరుగుతుందనే అంశాల ఆధారంగా ‘1945’ అనే సినిమా రూపొందుతోంది. రానా ఇందులో హీరోగా నటిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకు ‘మడైతిరందు’ అనే టైటిల్‌ పెట్టారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఆడియన్స్‌ థియేటర్స్‌లోకి వెళితే దాదాపు 70 ఏళ్లు వెనక్కిపోయినట్లే. సౌత్‌ ఆర్‌ నార్త్‌ బయోపిక్స్‌ ఏవైనా ఆయా వ్యక్తుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతాయి కాబట్టి ఆ జీవితాల ఆధారంగా ఆడియన్స్‌ ఆయా కాలాలను సందర్శించాల్సిందే. మహేశ్‌బాబు తాజా చిత్రం ‘మహర్షి’. ఇందులో ఆయన ఓ స్టూడెంట్‌గా, బిలియనీర్‌గా కనిపించనున్నారు.

ఆల్రెడీ ఈ రెండు లుక్స్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. స్టూడెంట్‌గా మహేశ్‌ నటించిన సన్నివేశాలు ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో వస్తాయి. మరి.. బిలియనీర్‌గా 2018లో కనిపించిన మహేశ్‌ స్టూడెంట్‌ పాత్ర కోసం కనీసం ఏడెనిమిదేళ్లయినా వెనక్కి వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. మాహిష్మతి రాజ్యం లో ఐదేళ్లు గడిపిన తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను స్టార్ట్‌ చేశారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకలుగా నటిస్తున్న ఈ సినిమా 1920 నేపథ్యంలో ఉంటుందని టాక్‌. ఈ టాక్‌లే నిజాలైతే ప్రేక్షకులు దాదాపు 100 ఏళ్లు గడియారాన్ని వెనక్కి తిప్పాల్సిందే. అన్నట్లు రామ్‌చరణ్‌ని ఆల్రెడీ ‘మగధీర’లో రాజమౌళి 400 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘యమదొంగ’లో ఎన్టీఆర్‌ని ఏకంగా యమలోకానికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇద్దరినీ వందేళ్లు వెనక్కి తీసుకెళుతున్నారన్న మాట.

మహేశ్‌బాబు తాజా చిత్రం ‘మహర్షి’. ఇందులో ఆయన ఓ స్టూడెంట్‌గా, బిలియనీర్‌గా కనిపించనున్నారు. ఆల్రెడీ ఈ రెండు లుక్స్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. స్టూడెంట్‌గా మహేశ్‌ నటించిన సన్నివేశాలు ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో వస్తాయి. మరి.. బిలియనీర్‌గా 2018లో కనిపించిన మహేశ్‌ స్టూడెంట్‌ పాత్ర కోసం కనీసం ఏడెనిమిదేళ్లయినా వెనక్కి వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. 


మాహిష్మతి రాజ్యం లో ఐదేళ్లు గడిపిన తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను స్టార్ట్‌ చేశారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకలుగా నటిస్తున్న ఈ సినిమా 1920 నేపథ్యంలో ఉంటుందని టాక్‌. ఈ టాక్‌లే నిజాలైతే ప్రేక్షకులు దాదాపు 100 ఏళ్లు గడియారాన్ని వెనక్కి తిప్పాల్సిందే. అన్నట్లు రామ్‌చరణ్‌ని ఆల్రెడీ ‘మగధీర’లో రాజమౌళి 400 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘యమదొంగ’లో ఎన్టీఆర్‌ని ఏకంగా యమలోకానికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇద్దరినీ వందేళ్లు వెనక్కి తీసుకెళుతున్నారన్న మాట. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top