ఆ ఇద్దరి ప్రైవేట్‌ లైఫ్‌లోకి తొంగి చూడాలనుంది!

ఆ ఇద్దరి ప్రైవేట్‌ లైఫ్‌లోకి తొంగి చూడాలనుంది! - Sakshi


‘‘సినిమాల్లోని పాత్రల్లా రియల్‌ లైఫ్‌లో ఉండడం కుదరదు. అందుకే, ‘బిగ్‌ బాస్‌’ షోలో నాలానే ఉండాలనుకుంటున్నా. ఇంట్లో ఎలా ఉంటానో... షోలో అలాగే ఉండాలనుకుంటున్నా. ఈ షో నాలోని ఫన్‌ సైడ్‌ను బయటకు తీసుకొస్తుందని ఆశిస్తున్నా. నాకు ఇన్‌స్పిరేషన్‌ తాతగారు (సీనియర్‌ ఎన్టీఆర్‌). ఆయనెప్పుడూ షోను హోస్ట్‌ చేయలేదు. సో, ఈ షోను నా స్టైల్‌లో హోస్ట్‌ చేస్తా’’ అన్నారు ఎన్టీఆర్‌. ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్న ‘బిగ్‌ బాస్‌ తెలుగు’ టీవీ రియాలిటీ షో ఈ నెల 16నుంచి ‘స్టార్‌మా’లో ప్రసారం కానుంది.



ఎన్టీఆర్‌ మీడియాతో ముచ్చటిస్తూ– ‘‘నాకు సవాళ్లంటే ఇష్టం. హోస్ట్‌గా ఎలా బిహేవ్‌ చేయాలి? ఎలా మాట్లాడాలి? ఎలా నటించాలి? అనే వాటిపై అవగాహన లేదు. అందుకే స్టార్‌మా వాళ్లు ‘బిగ్‌బాస్‌’ను హోస్ట్‌ చేయమనగానే ఓకే చెప్పేశా. నాకు నేను సవాల్‌ విసురుకోవడం అంటే ఇష్టం. ‘బిగ్‌ బాస్‌’ను హోస్ట్‌ చేయడం మరో సవాల్‌. మన తెలుగు ప్రేక్షకుల సెన్సిబిలిటీస్‌కి అనుగుణంగా సరదాగా ఉంటుందీ షో. మండే టు ఫ్రైడే... షోలోని కంటెస్టెంట్స్‌ ఎపిసోడ్స్, వీకెండ్‌ (శని–ఆది) నా (హోస్ట్‌) ఎపిసోడ్స్‌ ఉంటాయి’’ అన్నారు. మీరీ షోకి భారీ పారితోషికం తీసుకున్నారట? అని ప్రశ్నించగా ‘‘నా పెళ్లాం బిడ్డలను చూసుకోవడానికి కావల్సినంత.. అంతే. మీరెంత అనుకుంటున్నారో? అంత లేదని మాత్రం చెప్పగలను’’ అన్నారు.



ఛాన్స్‌ వస్తే ఎవరి ప్రైవేట్‌ లైఫ్‌ గురించి తెలుసుకోవాలనుంది? అనడిగితే.. ‘‘మా ఆవిడ–అబ్బాయి’’ అన్నారు. ఇంకా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ– ‘‘మొన్నటివరకు నాన్న కోసం పుట్టావా? అమ్మ కోసమా? అని మా అబ్బాయిని (అభయ్‌రామ్‌) అడిగితే ‘నాన్న కోసమే’ అనేవాడు. ఈ మధ్య ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు షూటింగ్‌ ఉంటోంది. మా వాడికి కొత్తగా స్కూల్‌ మొదలైంది. ఏడింటికి నేను షూటింగ్‌కి వెళ్లే టైమ్‌కి వాడు నిద్ర లేవట్లేదు. తిరిగొచ్చేసరికి పడుకుంటున్నాడు. ఈ ప్రోగ్రామ్‌కి వచ్చే ముందు ‘నాన్నా’ అంటూ దగ్గరికొస్తే... ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘నీకు నాన్నంటే ఇష్టమా? అమ్మ అంటేనా?’ అనడిగితే... ‘అమ్మ’ అనేశాడు. ఇది మనకు తెలియకుండా ఎలా జరిగింది? (నవ్వులు). అందుకే నేను షూటింగుకు వెళ్లిన తర్వాత ప్రణతి (ఎన్టీఆర్‌ వైఫ్‌) అబ్బాయికి ఏం చెప్తుందనేది తెలుసుకోవాలనుకుంటున్నా.



పిల్లాణ్ణి తన సైడ్‌కి తిప్పేసుకుంటోంది. వాళ్లిద్దరి ప్రైవేట్‌ లైఫ్‌లోకి తొంగి చూడాలనుంది’’ అన్నారు. మీ తాతగారి బయోపిక్‌ మీద అభిప్రాయం? అని ఎన్టీఆర్‌ను అడగ్గా... ‘‘రామారావుగారు ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదని నా నమ్మకం. ఆయన తెలుగు ప్రజల ఆస్తి. ఆయన్ను మనం ఎలా చూపించాలనుకుంటున్నామో.. ఏం చేద్దామనుకుంటున్నామో... అది పూర్తిగా తెలుగు వాళ్ల ఆస్తి. తెలుగు ప్రజలందరూ కలసి తీసుకున్న నిర్ణయమైతే అసలు... (సరే అన్నట్టు సైగ చేశారు)’’ చెప్పారు. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బయోపిక్‌లో వివాదాలు కూడా చూపిస్తానంటున్నారని ప్రస్తావించగా... ‘‘అది (సినిమా) వచ్చే వరకూ ఆగుదాం. నాక్కూడా ఐడియా లేదు’’ అన్నారు. మీ బాబాయ్‌ బాలకృష్ణ కూడా బయోపిక్‌ మీద వర్క్‌ చేస్తున్నారని చెప్పగా... ‘‘బాబాయ్‌ చేస్తే బ్రహ్మాండం కదా’’ అన్నారు. బయోపిక్‌లో నటించే విషయమై ఏమీ ఆలోచించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top