పాటల పల్లకీకి కొత్త బోయీలు

Telugu Young Singers Story On Occasion Of World Music Day  - Sakshi

తెలుగు సినీరంగంలో పాటల పల్లకిని మోస్తన్న బోయీలు ఎందరెందరో!
అలనాటి బోయీలలో ఎందరో మహానుభావులు!
పాటల పల్లకిని భుజానికందుకున్నారు నవతరం బోయీలు!
వారి అనుభవాలూ అనుభూతులూ మీకోసం... జూన్‌ 21 ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా...

ఏ ఆర్‌ రెహ్మాన్‌  రియల్‌హీరో
నేను పుట్టింది చెన్నైలో. నాకు సంవత్సరం వయసు ఉన్నప్పుడే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకి వెళ్లిపోయాము. మా అమ్మ గారి నాన్న కర్ణాటక సంగీత విద్వాంసులు. ఇంట్లో సంగీత వారసత్వముంది. ఆ విద్య మా అమ్మకు వారసత్వంగా వచ్చింది. అమెరికాలో అమ్మ ‘శ్రీ లలిత గాన విద్యాలయ’ పేరుతో కర్ణాటక సంగీత పాఠశాల పెట్టారు. నేను, అక్క మేమిద్దరమే ఆ స్కూల్లో ఫస్ట్‌ స్టూడెంట్స్‌. నాకు మూడేళ్ల వయస్సు వచ్చే సరికే సభల్లో, కచేరీల్లో పాడటానికి అమ్మ స్టేజ్‌ ఎక్కించేది. అలా చాలా అవకాశాలు అమ్మ ద్వారా వచ్చాయి. నాకు పదమూడేళ్లు వచ్చే వరకు రోజూ ఉదయం రెండు గంటలు సాధన చేయటం, స్కూల్‌కి వెళ్లటం, మళ్లీ స్కూల్‌ నుంచి రాగానే సాధన చేయటం ఇదే నా పని. ఏ ఆర్‌ రెహమాన్‌గారు అమెరికా వచ్చినçప్పుడు అందరిలాగానే నేను కూడా లైన్లో నిల్చొని ఆయన కోసం ఎదురు చూశాను. అప్పుడు ఎంతో కష్టపడి ఆయన మెయిల్‌ ఐడీ సంపాదించాను. ఆ తర్వాత నేను పాడిన పాటలను ఆయనకు పంపించాను. అవన్నీ చూసిన రెహమాన్‌గారు ఓ ఆర్నెల్ల తర్వాత మెయిల్‌లో ‘నీ వాయిస్‌ చాలా వెరైటీగా ఉంది. అవకాశం వస్తే కలిసి పనిచేద్డాం’ అన్నారు. అన్నట్టుగానే ఓ రోజు కాల్‌ చేసి స్కైప్‌లోకి రమ్మన్నారు. సరే అని వచ్చాను.  ఆయన నాతో ఇలా పాడు అలా పాడు అని చెప్తూ ఉంటే ఓ నాలుగు గంటల పాటు పాడాను. రెహ్మాన్‌ సార్‌ ఓ నెల తర్వాత ఫోన్‌చేసి ‘మీ వాయిస్‌ మణిరత్నంగారికి నచ్చింది’ అని చెప్పారు.

‘అవునా! చాలా థ్యాంక్స్‌. రికార్డింగ్‌ ఎప్పుడు?’ అని అడిగాను. ‘అదేంటి ఆ రోజు నువ్వు స్కైప్‌లో పాడావు కదా’ అన్నారు. ఒక్కసారిగా ఆశ్చర్య పోవటం నా వంతు అయ్యింది. అలా నాకు మొదటి సినిమా పాట పాడే అవకాశం రెహ్మన్‌ సార్‌ వల్ల వచ్చింది . ఆయన నా లైఫ్‌లో రియల్‌ హీరో. ఇక తెలుగు పాటల విషయానికొస్తే 2017లో కోన వెంకట్‌గారు ఓ పాట పాడాలి అని చెప్పారు. నాని హీరోగా నటించిన ‘నిన్నుకోరి’ చిత్రంలోని ‘అడిగా అడిగా...’ అనే పాటతో తెలుగుకు పరిచయం అయ్యాను. ఆ తర్వాత పరశురాం గారు ఓ పాట పాడించారు. ఆ పాటే విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతగోవిందం’ చిత్రంలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...చాల్లే.. ఇది చాల్లే...’ పాటతో నా లైఫ్‌ టర్న్‌ తీసుకుంది. తెలుగువారే కాకుండా భారతదేశం మొత్తం ఈ పాట మార్మోగిపోయింది. అమెరికాలో కూడా ఈ పాట పాడకుండా నా షో ఉండదంటే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్‌ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. కొత్తగా పాడాలనే ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్‌ చెయ్యాలి. రోజూ సంగీతానికి సంబంధించిన ఏ విషయంలోనైనా ఎదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఉదాహరణకి గమనిస్తే బాలు గారు గత 50 ఏళ్లుగా పాడుతూనే ఉన్నారు. ఆయన ఈ ప్లానెట్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. ఆయన టాలెంట్‌కి ఈ ప్లానెట్‌ సరిపోదు. వరల్డ్‌ మ్యూజిక్‌ డే సందర్భంగా అందరూ చక్కగా పాడుతూనే ఉండాలి అన్నారు. 

దగా... భలే కిక్‌
‘‘దగా.. దగా.. దగా.. కుట్ర, మోసం...’ ఈ పాట ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంలోనిది. ఈ పాట ప్రేక్షకుల్లో ఎంత సంచలనం సృష్టించిందో రెండు రాష్ట్రాల్లోని తెలుగువారందరికీ తెలుసు. అసలు ఈ పాట ఎలా పుట్టింది? ఆ పాట వెనక జరిగిన విశేషాలేంటి? చిత్ర సంగీతదర్శకుడు, ‘దగా.. దగా..’ పాట పాడిన కళ్యాణీ మాలిక్‌ మాట్లాడుతూ– ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రానికి మొదట నేను సంగీత దర్శకుడిని అని లిరిక్‌ రైటర్‌ సిరాశ్రీ చెబితే నమ్మలేదు. కారణం నాకు రామ్‌గోపాల్‌ వర్మ గారు అసలు పరిచయం లేదు. ఇండస్ట్రీలో ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేయాలంటే ఎంతో కొంత పరిచయం అవసరం. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాలో ఫస్ట్‌ రికార్డ్‌ చేసిన పాట ‘దగా..’. సాంగ్‌. ‘దగా’ అన్న ఒక్క మాటను పట్టుకొని ఆ పాట ట్యూన్‌ను రెడీ చేశాను. ముందుగా నాకు ఆర్జీవీ (రామ్‌గోపాల్‌ వర్మ)గారు ఆ పాటలో కోపం, కసి, పగ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడిన వేరియేషన్స్‌ ఉండాలన్నారు. పాట వినగానే ఆడియన్స్‌ గుండెల్లోకి వెళ్లిపోవాలి అని చెప్పారు. సాంగ్‌ రెడీ అవ్వగానే రఫ్‌గా నేను ఒక వెర్షన్‌ పాడి ఆయనకు పంపాను. ఆయన చిన్న పిల్లాడిలా సంబరపడిపోయి ఈ పాటను ఎవరితో పాడిస్తున్నారు? అని అడిగారు. నేను కొన్ని పేర్లు చెప్పాను. ఎవరూ అవసరం లేదు.. అదే ఇంటెన్సిటీతో ఈ పాటను మీరే పాడండి అన్నారు. నేనా! అని ఆశ్చర్యానికి లోనయ్యాను. సరే అనుకొని రెండు వెర్షన్స్‌లో పాడి వినిపించాను.

మొదటి వెర్షన్‌ ఆయనకు నచ్చలేదు, రాముగారు చిన్నపిల్లాడిలాంటి వాడు, నచ్చితే ఎంత బాగా ఉంది అని చెప్తారో, నచ్చకపోతే అంతే నిర్మొహమాటంగా బాగాలేదు అని మొహం మీదే చెప్పేస్తారు. మొదటిసారి పాడిన పాట విని నచ్చలేదు అని మెసేజ్‌ పెట్టారు. సరే.. అనుకొని ఇంకో వెర్షన్‌ పాడి మెసేజ్‌ పెట్టాను. శభాష్‌ అంటూ ఆనందంతో గంతులేసినంత పనిచేశారాయన. హమ్మయ్య అనుకున్నాను. ఆ సినిమా జరుగుతున్నప్పుడు అందరూ అనుకున్నట్లుగానే నాకు ఓ సందేహం ఉండేది. రాముగారు సినిమా తీస్తున్నారా లేక మాటలు చెప్తున్నారా అనుకునేవాణ్ని. నా సందేశాలకు బ్రేక్‌ వేస్తూ సినిమాలో 11 పాటలు ఉంటే నేను పాడిన పాటను మొదట రిలీజ్‌ చేశారు. ఆ పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆయన ఆ పాటను వైస్రాయ్‌ సంఘటన తర్వాత వాడుకుంటారు అనుకున్నాను. కానీ ఆయన చాలా తెలివిగా సినిమా అంతా వాడుకున్నారు. ఆ పాట విడుదలైన కొన్ని రోజులకు తారక్‌ (ఎన్టీఆర్‌) కలిసి పాట చాలా బాగా చేశారు అని అప్రిషియేట్‌ చేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన మెచ్చుకోవటం నా పనికి దక్కిన గౌరవంగా భావించాను. ఓ రోజు నేను, రాజమౌళి, ప్రభాస్‌ అందరం కలిసి చిన్న పార్టీలో ఉన్నప్పుడు తారక్‌తో జరిగిన సంభాషణ ఇది.

ఆయనకు నేను చేసిన సినిమాల్లో ‘ఆంధ్రుడు’ సాంగ్స్‌ అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలోని అన్ని సాంగ్స్‌ను ట్యూన్‌ లేకపోయినా అలవోకగా పాడతారు తారక్‌. ఆ సంగతలా ఉంచితే.. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చేసినప్పుడు నేను గమనించిన విషయం ఏమిటంటే పని చేసినవారికి ఆర్జీవీ డబ్బులు సరిగా ఇవ్వరని, పాటలు చేసేటప్పుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ను ఆయన ఒళ్లో కూర్చోపెట్టుకొని పాటలు ట్యూన్‌ చేయిస్తాడని చాలామంది చెప్పారు. ఆయన నాతో మీరు చాలా ఫ్రీడమ్‌ తీసుకొని కథకు తగ్గట్లుగా మంచి ట్యూన్స్‌ ఇవ్వమని మాత్రమే అడిగారు. ఆయన గురించి బయట విన్నవన్నీ అబద్ధం అని చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను. ఈ సినిమాలోని ఐదు పాటలను సింగర్స్‌లో టాప్‌ సింగరైన యస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితో పాడించారు. డబ్బు కోసం నేను ఏ విధంగానూ  ఇబ్బంది పడలేదు. అప్పుడు నేను అనుకున్నాను ఏ మనిషి గురించైనా ఒక అంచనాకు వచ్చే ముందు వాళ్ల మాటలు వీళ్ల మాటలు వినకూడదు అని. మనకు మనంగా చూసి అభిప్రాయానికి రావాలి. మొత్తానికి నేను ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా రానంత తృప్తి ఈ సినిమా ద్వారా, ఈ పాట ద్వారా పచ్చింది. సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా కోసం నేను రాముగారితో, ఆ టీమ్‌తో పని చేసిన ఆరు నెలల టైమ్‌ నా కెరీర్‌లో బెస్ట్‌ టైమ్‌. ఈ సంవత్సరం వరల్డ్‌ మ్యూజిక్‌ డేకు నాకొచ్చిన కిక్‌ మాటల్లో చెప్పలేనిది’’ అన్నారు.

వై నాట్‌.. బాధ్యతగా ఉంటే విజయమే
పీవీయన్‌యస్‌ రోహిత్‌ అనే పేరు రెండేళ్ల కింద భారతదేశం అంతా మార్మోగిపోయింది. 2017లో ‘ఇండియన్‌ ఐడల్‌’లో రన్నరప్‌గా నిలిచిన తెలుగువాడిగా అందరికీ తెలుసు. 2018లో నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా నటించిన ‘సవ్యసాచి’ చిత్రం కోసం రోహిత్‌ ‘వై నాట్‌...’ అంటూ గొంతువిప్పారు. ఆ పాట ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ పాట గురించి రోహిత్‌ మాట్లాడుతూ– ‘‘యం.యం. కీరవాణిగారు ఆ చిత్రానికి మ్యూజిక్‌ అందించారు. ఆ పాట కోసం కీరవాణిగారు రెండు మూడు ట్యూన్స్‌ను రెడీ చేశారు. ఆయన ఆ ట్యూన్‌ను వాళ్ల టీమ్‌ అందరికీ పంపారు. టీమ్‌లోని అందరూ ఈ ట్యూన్‌కి కనెక్ట్‌ అయ్యారు. అప్పుడు ‘వై నాట్‌..’ సాంగ్‌ను సినిమాలోని సన్నివేశాలకు కనెక్ట్‌ చేశారు. సింగర్‌గా నాకు మంచి పేరు వచ్చింది. కొత్తగా పాటలు పాడుతూ పైకి రావాలనే వాళ్ల కోసం వరల్డ్‌ మ్యూజిక్‌ డే సందర్భంగా నేను చెప్పేదేంటంటే మనం ఒక పాట పాడుతున్నాం అంటే ఆ పాటకు ఎన్ని క్లిక్కులు వస్తాయి అనేది ఆలోచించకూడదు. ఒక పాటకి విలువ ఇంత అని చెప్పలేం. దాన్ని కొలవడానికి ఏ మెషిన్‌ లేదు. మ్యూజిక్‌ను ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. దానికోసం కష్టపడుతూ, ప్యాషనేట్‌గా ఉండాలి. అదో నిరంతర ప్రక్రియ. పాట ఎలాంటిదైనా చాలా బాధ్యతగా ఉండాలి. అప్పుడే అది ప్రేక్షకుల దగ్గరికి పరిపూర్ణంగా వెళుతుంది అని నేను నమ్ముతాను. నేను ఇప్పుడు హిందీలో, తెలుగులో పెద్ద హీరోలకు పాటలు పాడుతున్నాను. కానీ వాటి వివరాలు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నందుకు సారీ. కారణం నేను ఇండియన్‌ ఐడల్‌ వాళ్లకి మూడేళ్లు అగ్రిమెంట్‌లో ఉన్నాను. దేవుడి దయవల్ల భవిష్యతులో చాలా మంచి పాటలు పాడతాను. నాకు ఎన్నో పాటలు పాడే అవకాశం ఇచ్చిన, ఇస్తున్న సంగీత దర్శకులకు ఈ వర ల్డ్‌ మ్యూజిక్‌ డే సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

వారూ వీరూ... అభినందిస్తే ఆనందమే
‘‘సంగీతమంటే ఒక టైప్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌. మనకు ప్రతి ఎమోషన్‌ చాలా ఇంపార్టెంట్‌. సంగీతం ద్వారా ఆ ఎమోషన్స్‌ను సులువుగా వ్యక్తపరచవచ్చు. సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయి అంటారు. నిజంగా వాటిని కదిలించకపోయినా నా గొంతుతో ప్రేక్షకుల హృదయాల్ని కదిలించాలన్నది నా ముఖ్య ఉద్దేశం. కళాకారుడి ముఖ్య ఉద్దేశం కూడా అదే’’ అని సింగర్‌ అనురాగ్‌ కులకర్ణి తెలిపారు. గత ఏడాది ‘ఆర్‌ఎక్స్‌ 100’లో పిల్లా రా..., ఆశా పాశం, వారూ వీరు వంటి సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ ఆయన ఖాతాలో ఉన్నాయి. సింగర్‌గా తన ప్రయాణం గురించి అనురాగ్‌ కులకర్ణి చెబుతూ–  ‘‘ప్రస్తుతం జర్నీ చాలా బావుంది. ఒక సింగర్‌కు వర్సెటాలిటీ చూపించడానికి మించిన అదృష్టం ఉండదు. గత  కొన్ని నెలల్లోనే ‘ఆర్‌ఎక్స్‌ 100’లో ‘పిల్లా రా..’, ‘కేరాఫ్‌ కంచరపాలెం’లో ‘ఆశా పాశం’ ఫిలాసఫికల్‌గా ఉంటుంది. ‘దేవదాస్‌’లో ‘వారూ వీరు’ పెప్పీ నంబర్‌. వీటన్నింటినీ ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేయడం సంతోషం. ఈ పాటలన్నీ పాడటాన్ని చాలా బాగా ఎంజాయ్‌ చేశాను. ఒక పాట పాడేప్పుడు హిట్‌ అవుతుందా? లేదా? అనేది మనం ఊహించలేం. నిజంగా ఊహించలేం. నా వరకైతే ఇప్పటి వరకూ ఎంతమంది ఏయే పాటలు బాగా వింటున్నారన్న సంగతి కూడా తెలియదు.

దాని మీద ప్రత్యేకించి ఎఫర్ట్‌ కూడా పెట్టను. ఎవరైనా చెప్పినప్పుడు ఓహో ఇది హిట్‌ అయిందా? దీనికి బాగా రీచ్‌ ఉందా? అనుకుంటాను. ఈ పాట బాగా రీచ్‌ అవుతుంది అనుకున్నవి అవ్వలేదు. ఈ ట్యూన్‌ని వింటారా? వినరా? అని సందేహించిన వాటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సో..  ఏ సాంగ్‌ అయినా ఒకటే యాటిట్యూడ్‌తో అప్రోచ్‌ అవుతాను. నేను  కొంచెం ఓల్డ్‌ స్కూల్‌ టైప్‌.  సోషల్‌ మీడియాను అంత సీరియస్‌గా తీసుకునే టైప్‌ కాదు. జెన్యూన్‌ రెస్పాన్స్‌ కోరుకుంటాను. సోషల్‌ మీడియాలో ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపిస్తారు. అందుకే వాటిని పెద్దగా పట్టించుకోను. మన పని మనం బాగా చేశామా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రత్యేకంగా ఈ సంగీత దర్శకుడికి పాడాలని ఎప్పుడూ అనుకోలేదు. మనం ఒక మ్యూజిక్‌ డైరెక్టర్‌కు పాడాలని కోరుకోవడం కంటే.. మన టాలెంట్‌ను బాగా ఇంప్రూవ్‌ చేసుకుంటూ వెళ్తే వాళ్లే మనల్ని అప్రోచ్‌ అవుతారు అనే పద్ధతిని ఫాలో అవుతాను. అందుకే మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అందర్నీ ఒకేలా గౌరవిస్తాను.  

‘పిల్లా రా..’ అప్పుడు చైతన్య భరద్వాజ్‌ కొత్త సంగీతదర్శకుడు. అప్పటికి మణిశర్మగారికి పాడుతూ ఉన్నాను. అందరికీ ఒకేలా కష్టపడతాను. ఇంకా నా గొంతులో ట్యాప్‌ చేయని ఏరియాలు చాలా ఉన్నాయి. వాటిని ఎక్స్‌ప్లోర్‌ చేయాలనుకుంటున్నాను. అలాగే నా పాట నలుగుర్నీ నయం చేయగలగాలి. పూర్వం కులాసా వాతావరణం ఉండేది. ప్రస్తుతం అంతా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ఈ స్ట్రెస్‌ఫుల్‌ లైఫ్‌లో మ్యూజిక్‌ మాత్రమే ఒక ఫ్రెండ్‌గా మనల్ని గైడ్‌ చేస్తుంది. సంగీతం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన సొసైటీని నిర్మించుకోగలం. అది తయారవడానికి నా గొంతు ఉపయోగపడుతుందంటే చాలా సంతోషం. చాలా డిప్రెస్డ్‌గా ఉన్నప్పుడు ఫలానా పాట మా మైండ్‌ని ఫ్రెష్‌గా చేసింది అని ఎవరైనా చెబితే చాలా సంతోషిస్తాను. పాట బావుంది అని చెప్పడం కంటే కూడా మీ పాట వల్ల మేం ప్రభావితం అయ్యాం అని చెబుతున్నప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఆర్టిస్ట్‌కి అదే నిజమైన ఆనందం’’ అన్నారు. 

రెడ్డమ్మ తల్లీ... ఓ ఊహించని మలుపు
‘రెడ్డమ్మ తల్లీ’... ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని హిట్‌ సాంగ్స్‌లో ఇదొకటి. ఈ పాటను మోహనా బోగరాజు పాడారు. ‘‘ఇది నా జీవితంలో మరచిపోలేని పాట’’ అని మోహనా భోగరాజు చెబుతూ – ‘‘రెడ్డమ్మ తల్లి...’ పాట పాడిన తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పటివరకు 90 పాటలు పైనే పాడాను. కానీ, ఈ పాట మాత్రం నా జీవితానికి ఊహించని మలుపు. ఈ పాట నా దగ్గరికి ఎలా వచ్చిందో చెప్తాను. నేను యాక్చువల్‌గా ‘అరవింద సమేత’ చిత్రానికి రీ–రికార్డింగ్‌కి పాడటానికి వెళ్లాను. పాడి వచ్చేశాను. సినిమా రిలీజయ్యే కొద్దిరోజుల ముందు ఓ పెద్ద వయసున్న ఆడమనిషి గొంతు అయితే ఈ పాటకు న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారట. అప్పుడు సింగర్‌ శ్రీకృష్ణ అన్న ‘ఇటువంటి సాంగ్‌ మోహన పాడుతుంది పిలవమంటారా తమన్‌గారు’ అని అడిగారట. సరే అనుకొని రికార్డింగ్‌కి పిలిచారు. నేను వెళ్లి పాడి వచ్చేశాను. సినిమా రిలీజ్‌ తర్వాత ఆ పాటకు వచ్చిన రెస్పాన్స్‌ చూసి నేను నమ్మలేకపోయాను.

ఓ మై గాడ్‌.. నేను పాడిన పాటేనా ఇది అనుకున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే గతంలో నేను తమన్‌ గారి దగ్గర కొన్ని సినిమాలకు పాడాను. అప్పుడు కూడా నా దగ్గర ఇలాంటి గొంతు ఉంది అని ఆయన అనుకోలేదు, నాకు తెలియదు. అప్పటివరకు నేను అలాంటి పాట పాడగలనని నాకూ తెలియదు. ఇదే నా మొదటి పాట. నాకు ఆయన మ్యూజిక్‌  అంటే చాలా ఇష్టం. ఆయనతో పాటు ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ గారు, హీరో తారక్‌గారు వీళ్లందరికీ నేను వ్యక్తిగతంగా పెద్ద ఫ్యాన్‌ని. వాళ్లందరూ నేను పాడిన పాటను పొగుడుతూ ఉంటే ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. ఆ రోజు నేను పాడుతుంటే అక్కడ టీమ్‌ అందరూ ఉన్నారు. నేను అభిమానించే తమన్‌ గారు వెరీగుడ్, వెల్‌డన్‌ అని, చాలా బాగా పాడావమ్మా అని త్రివిక్రమ్‌ గారు అన్నారు. అక్కడ రచయిత పెంచల్‌దాస్‌ గారు కూడా ఉన్నారు. పాటలో ఓ చోట దువ్వెన అని పాడాను. పెంచల్‌దాస్‌ గారు దువెయన అని పాడమన్నారు. సరే అని పాడేశాను. నాకు జీవితంలో ఇంత మంచి అవకాశం వచ్చినందుకు ఈ వరల్డ్‌ మ్యూజిక్‌ డే సందర్భంగా తమన్‌ గారికి, నా నిజమైన అన్నయ్య శ్రీకృష్ణకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 

అల్లుడు చూడే... పాపులరే
‘‘కొన్నిసార్లు మనకు ఎవరో అవకాశం ఇస్తారు అని ఎదురుచూసే కంటే మనమే అవకాశం కల్పించుకోవాలి. అందుకే ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ పాడటం మొదలు పెట్టాను. తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి’’ అని మంగ్లీ అన్నారు. గత ఏడాది విడుదలైన ‘శైలాజారెడ్డి అల్లుడు’ సినిమాలో ‘శైలజారెడ్డి అల్లుడు చూడే...’ పాట ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను పాడింది మంగ్లీ. రేలారే రేలా, బతుకమ్మ పండగ మీద ప్రైవేట్‌ పాటల ద్వారా పాపులర్‌ అయ్యారు మంగ్లీ. ‘నీదీ నాదీ ఒకే కథ, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ, శైలజా రెడ్డి అల్లుడు, వేర్‌ఈజ్‌ ద వెంకటలక్ష్మీ. లచ్చి’ వంటి సినిమాల్లో ఇప్పటి వరకూ పాడారామె. ‘శైలాజారెడ్డి అల్లుడు చూడే..’ పాట పాపులర్‌ అవడం గురించి మంగ్లీ మాట్లాడుతూ – ‘‘ముందుగా ఇంత మంచి గొంతునిచ్చిన మా అమ్మానాన్నలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కొన్నిసార్లు ట్యూన్‌ వినగానే ఆ పాట ఎక్కడి వరకూ పోతుందో ఊహించగలం.

ఈ పాట బాగా పేలుతుంది అనుకున్నాం, అనుకున్నట్టుగానే బాగా పేలింది. రచయిత కాస్లర శ్యామ్‌ చెప్పగా, దర్శకుడు మారుతిగారు దగ్గరుండి ఈ పాటను పాడించుకున్నారు. గోపీ సుందర్‌ సంగీతంలో పాడటం అదృష్టం అని చాలా మంది నాతో చెప్పారు. నేను పాడిన సినిమా పాటల్లో నా ఫేవరెట్‌ పాట అంటే ‘నీది నాదీ ఒకే కథ’లో ‘జిమ్మేదారి కోయిల..’. అది ఎంత రీచ్‌ అయిందో తెలియదు కానీ నాకు పర్సనల్‌గా ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఆంధ్రా, రాయలసీమ ఆ ప్రాంతాల వైపు వెళ్లినప్పుడు రేలారే రేలా పాట పాడమని అడుగుతుంటారు. ‘ఓరి నాయనా అది ఆ ప్రాంతం పాట కదా?’ అని అనుకుంటాను. కళకు ప్రాంతాలతో సంబంధం ఉండదు. మనమే పేర్లు పెట్టి విభజిస్తుంటాం. ఓ మంచి పాటను ఏదీ ఆపలేదు. సంగీతానికి ఉన్న పవర్‌ అలాంటిది. వెంకటేశ్వరస్వామి అంతటి ఆయనే అన్నమయ్యను ఇంకా బతుకు అని వరాన్ని ప్రసాదించాడు. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఎంఎస్‌ సుబ్బలక్ష్మిగారి పాటలు, హిందీ పాటలు వింటుంటాను. సుబ్బలక్ష్మిగారి పాటలు విన్నప్పుడైతే కళ్లలో నీళ్లు వచ్చేస్తాయి. మణిశర్మ, కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్‌ వంటి వారి కంపోజిషన్‌లో పాడాలనుంది. ప్రస్తుతం ‘ఆకాశవాణి’ సినిమాలో ఓ పాట పాడాను. ‘స్వేచ్ఛ’ అనే సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాను’’ అని అన్నారు.

పిచ్చి పిచ్చిగా... కల నెరవేరెగా
‘‘క్లాసికల్‌ సాంగ్, ఐటమ్‌ నెంబర్, సోల్‌ఫుల్‌ సాంగ్‌ అనే తేడా లేకుండా ఏ పాటైనా పాడి శ్రోతలను అలరించగలను. అదే నా çప్లస్‌ పాయింట్‌’’ అంటున్నారు పరోమా దాస్‌గుప్తా.  హిందీలో పరోమా పాడిన పాటల్లో ‘ఓకే జాను’లో ‘కారా.. ఫంకారా’, ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’లో ‘కాఫీ పీతే పీతే’ కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మెహబూబా’ సినిమాలో ‘పిచ్చి పిచ్చిగా..’ అనే పాటతో పరోమా తన గొంతును తెలుగుకి పరిచయం చేశారు. ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో ‘రోల.. రోల..’ అనే సాంగ్‌తో శ్రోతలను మెప్పించారు. ఈ పాటల విశేషాల గురించి పరోమా దాస్‌గుప్తా మాట్లాడుతూ– ‘‘మెహబూబా’ సినిమాలో ‘పిచ్చి పిచ్చి..’గా సాంగ్‌ పాడటం అమేజింగ్‌ ఫీలింగ్‌. ఈ సినిమాకు సంగీత దర్శకుడైన సందీప్‌ చౌతాగారి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నతనం నుంచి ఆయన సంగీతాన్ని ఇష్టంగా వింటున్నాను. ఇక పూరి జగన్నాథ్‌  డైరెక్షన్‌లోని సినిమాకు పాట పాడటం అంటే ఏ సింగర్‌కైనా కల నిజమైనట్లే.

ఇంకా ఆయన సినిమాతో సింగర్‌గా నేను తెలుగు పరిశ్రమకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇటీవల తేజగారి దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో ‘రోల రోల’ అనే మరో పాట పాడాను. ఇది సర్‌ప్రైజింగ్‌గా జరిగింది. ఓ సందర్భంలో మా సిస్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ను కలిశారు. ఆ సందర్భంలో ఈ స్పెషల్‌ సాంగ్‌ డిస్కషన్‌ వచ్చింది. డిఫరెంట్‌ వాయిస్‌తో పాడించాలని ఆయన మా సిస్టర్‌తో అన్నారు. అలా నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ సాంగ్‌ను బాంబేలో రికార్డ్‌ చేశాం. ఈ సాంగ్‌ జర్నీ సూపర్‌ ఫీలింగ్‌ ఇచ్చింది. ఇప్పటివరకు తెలుగులో రెండు పాటలు మాత్రమే పాడాను. మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. బాంబేలో సింగర్‌గా బిజీగానే ఉన్నా. సౌత్‌లో నా వాయిస్‌ మరింత మందికి సంగీత దర్శకులకు రీచ్‌ అవుతుందన్న నమ్మకం ఉంది. అప్పుడు తప్పకుండా ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఆ సమయం దగ్గర్లోనే ఉందని నా నమ్మకం. మన దేశంలో బాలీవుడ్‌ అండ్‌ టాలీవుడ్‌ ఇండస్ట్రీలు చాలా పెద్దవి. నేను ముంబైలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ అవకాశాల పరంగా కొంచెం కంఫర్ట్‌గా ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. కానీ టాలీవుడ్‌లో ప్రతి కొత్త సింగర్‌కు మంచి వెల్‌కమ్‌ ఉంటుంది. బాలీవుడ్, టాలీవుడ్‌ అని కాదు. సింగింగ్‌ ఆర్టిస్టుగా పెద్ద పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. హిందుస్థానీ క్లాసికల్‌ మ్యూజిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది మా ఫ్యామిలీది. మా అమ్మగారు క్లాసికల్‌ సింగర్‌. వ్యక్తిగతంగా ఘజల్స్‌ అంటే నాకు చాలా ఇష్టం’’ అన్నారు.

డియో డియో కెరీర్‌ పీక్సయ్యో
రఘురాం మల్టీ టాలెంటెడ్‌. పాటలు పాడటమే కాదు.. రాస్తారు కూడా. అది మాత్రమే కాదు.. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కూడా మారారు. గత ఏడాది బాగా వినిపించిన పెప్పీ సాంగ్స్‌లో ‘డియో డియో డిసక డిసక...’ ఒకటి. రఘురాం మాట్లాడుతూ – ‘‘‘పీయస్వీ గరుడవేగ’ చిత్రంలో పాడిన ‘డియో డియో డిసక డిసక...’ ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. అలాగే ‘పేపర్‌బాయ్‌’ చిత్రంలోని ‘బొంబాయి పోతావ రాజా బొంబై పోతావా..’ పాటతో పాటు మరో రెండు పాటలు కూడా పాడాను. ఇవేకాకుండా గత ఏడాది నితిన్‌ హీరోగా నటించిన ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రంలోని మెలొడీ ‘అర్థం లేని అర్థాలెన్ని..’ పాట  రాశాను. శ్రీకాంత్‌ హీరోగా నటించిన ‘మల్లిగాడు మ్యారేజ్‌ బ్యూరో’తో పాటు ‘ప్రతిక్షణం’ చిత్రానికి కూడా మ్యూజిక్‌ అందించాను. ప్రస్తుతం నేను ‘కళాకారుడు’ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాను. ఇప్పటివరకు దాదాపు 70 సినిమా పాటల వరకు పాడాను. ఇప్పుడు వరల్డ్‌కప్‌ జరుగుతుండటంతో క్రికెట్‌కి సంబంధించిన ఓ ప్రైవేట్‌ వీడియో ఆల్బమ్‌ను సింగర్‌ లిప్సికతో కలిసి రూపొందించాను. ఆ పాటకు చాలా మంచి పేరొచ్చింది. నేను సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టటానికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లోని మ్యూజిక్‌ లవర్స్‌కి నా పాట గట్టిగా వినిపించాలి అని. సంగీత దర్శకుల్లో నాకు ఇళయరాజా గారు, ఏఆర్‌ రెహమాన్‌ గారు, గాయకుల్లో యస్పీబీ గారు, శంకర్‌ మహదేవన్‌గారు చాలా స్ఫూర్తి.  వరల్డ్‌ మ్యూజిక్‌ డే సందర్భంగా కొత్తగా సంగీతంలోకి వచ్చే వారికి నేను రెండు సలహాలు ఇస్తాను. ఏ జాబ్‌లో అయినా ప్రాక్టీస్‌కు సబ్‌స్టిట్యూట్‌ లేదు. ప్రాక్టీస్‌ ఎంత బాగా చేస్తే అంత బాగా పాటల ప్రపంచంలో ఉంటాం. అలాగే మ్యూజిక్‌ ఈజ్‌ నాట్‌ ఏ బిజినెస్, మ్యూజిక్‌ ఈజ్‌ ఏ ప్యాషన్‌ అనుకొని ఎవరైనా ఈ ఇండస్ట్రీలోకి రావాలని మనసారా కోరుకుంటున్నాను’’ అన్నారు.
సినిమా డెస్క్‌
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top