సినిమా పరిశ్రమ బతకాలి

Telugu Film Industry Representatives Meet With CM KCR  - Sakshi

– తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను దశలవారీగా పునరుద్ధరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు, కోవిడ్‌ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ చర్యలను పాటించాల్సి ఉంటుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సినిమా షూటింగ్‌లు ఎలా నిర్వహించాలనే విషయంలో విధి విధానాలను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శుక్రవారం సినిమా రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు.

సినిమా షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సినిమా షూటింగ్‌లు, థియేటర్లను రీ ఓపెన్‌ చేసేందుకు అనుమతులు ఇవ్వాలన్న సినీ ప్రముఖుల విజ్ఞప్తికి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలమంది జీవిస్తున్నందున పోస్ట్‌ ప్రొడక్షన్, షూటింగ్‌ నిర్వహణ, థియేటర్స్‌లో సినిమా ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఇండోర్‌లో తక్కువమందితో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను మొదట ప్రారంభించుకోవాలని సీఎం చెప్పారు.

తర్వాతి దశలో జూన్‌ నెలలో సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని చెప్పారు. సినిమా షూటింగ్‌లను వీలైనంత తక్కువమందితో చేయాలని చెప్పారు. షూటింగ్స్‌లో ఎంతమంది పాల్గొనాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగప్రముఖులను సీఎం కోరారు. ఆ తర్వాత కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులు ఇస్తుందని సీఎం వెల్లడించారు.

కొద్ది రోజులు షూటింగ్‌లు జరిపాక పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి సినిమా థియేటర్లను రీ ఓపెన్‌ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌లతో పాటు నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు డి. సురేష్‌బాబు, సి. కల్యాణ్, అల్లు అరవింద్, ‘దిల్‌’రాజు, దామోదర ప్రసాద్, కిరణ్, దర్శకులు రాజమౌళి, ఎన్‌. శంకర్, మెహర్‌ రమేష్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, రాధాకృష్ణ, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు (శుక్రవారం) సినిమా, టీవీ, డిజిటల్‌ మీడియాకి సంబంధించిన సమస్యలను విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌గారు అన్నారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే రూపొందించి, అందరికీ మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు. సమస్యలను విని, భరోసా ఇచ్చిన సీఎంగారికి పరిశ్రమలోని యావన్మంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.             

– చిరంజీవి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top