వాటిని  అస్సలు  పట్టించుకోను

Taapsee Pannu Says She's Not A Star, But A Struggler - Sakshi

తమిళసినిమా: సినీరంగంలో వదంతుల ప్రచారం సర్వసాధారణం. అయితే నిప్పులేనిదే పొగ రాదన్న నానుడిని పక్కన పెడితే వదంతులకు కొందరు వెంటనే రియాక్ట్‌ అవుతారు. మరి కొందరు ఆవేదన చెందుతారు. ఇంకొందరు డోంట్‌కేర్‌ అంటుంటారు. ఈ మూడో కేటగిరీకి చెందిన నటి తాప్సీ. తమిళంలో ఆడుగళం చిత్రంతో కేరీర్‌ను ప్రారంభించిన ఈ ఢిల్లీ భామ, టాలీవుడ్‌కు ఝుమ్మంది నాదం చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఈ రెండు భాషల్లో పలు చిత్రాల్లో నటించినా ఎక్కడా మంచి స్థాయికి మాత్రం చేరుకోలేకపోయింది. అయితే హిందీలో మంచి అవకాశాలను రాబట్టుకుంటోంది. అక్కడ పింకూ, నామ్‌ షభానా వంటి చిత్రాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ చిత్రాల సక్సెస్‌లను తలకెక్కించుకున్న తాప్సీ టాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అక్కడి వారి ఆగ్రహానికి గురైంది.

ఆ తరువాత క్షమాపణలు చెప్పిందనుకోండీ. అదే విధంగా నటులతో ప్రేమాయణం అంటూ వదంతులను బాగానే ఎదుర్కొంటోంది. బాలీవుడ్‌ నిర్మాత చేతుల్లో చిక్కుకుందనే ప్రచారం జోరుగానే సాగుతోంది. అయితే అలాంటి ప్రచారాల గురించి తాను అస్సలు పట్టించుకోనని, వాటి కారణంగా ఏ నటుడికీ దూరం కానని బహిరంగంగానే చెప్పేస్తోంది. ఏమిటీ అమ్మడి ధైర్యం అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు దిల్‌ జూంగ్లీ, తడ్కా, ముల్క్, మణ్‌మర్శియాన్, సూర్మ చిత్రాలతో బిజీబిజీగా ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top