ఎంతో మందికి నాట్యంపై మక్కువ పెంచిందీ సినిమా

ఎంతో మందికి నాట్యంపై మక్కువ పెంచిందీ సినిమా

‘స్వర్ణకమలం’ కు  25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు కె. విశ్వనాథ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ

 

నిజమైన కళ అంటే... కనులకు, చెవులకు ఆనందాన్నిచ్చేది కాదు. మనసును ఆహ్లాదపరిచేది. అలాంటి కళతో జనులను రంజింపజేసిన కళాకారుడు చరితార్థుడవుతాడు. కె.విశ్వనాథ్ ఆ కోవకు చెందిన వారే. పాశ్చాత్య పోకడల పెను తుఫాను తాకిడికి రెప రెప లాడుతున్న భారతీయ కళాజ్యోతిని తన సినిమాలతో ప్రజ్వలింపజేసిన మహోన్నతుడు విశ్వనాథ్. ఆయన సృజించిన ప్రతి చిత్రం.. నటరాజ పాదపద్మాలను స్పృశించిన స్వర్ణకమలమే.  ఆయన కెరీర్‌లో వచ్చిన మరపు రాని చిత్రాల్లో ‘స్వర్ణకమలం’ ఒకటి. ఆ సినిమా వచ్చి నేటికి పాతికేళ్లు. భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కేఎస్ రామారావు సమర్పణలో.. సీహెచ్‌వీ అప్పారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా గురించి చెప్పుకుంటే...  

 

కళ దైవదత్తం. జన్మ జన్మల పుణ్యం వల్లే అది ప్రాప్తిస్తుంది. ఆ నిజాన్ని గ్రహించలేని వేదాంతంవారి అమ్మాయి కథ ఇది. ‘సమాజం జెట్ వేగంతో వెళుతోంది. దాంతో పాటే మనమూ వెళ్లాలి. అంతేకానీ, సంప్రదాయ కళలనే శ్వాసిస్తూ... అదే మోక్షంగా భావిస్తూ కూపస్త మండూకాల్లా బతకడం ఎంత వరకు సమంజసం’ అని వాదిస్తుందీ పాత్ర. పాతికేళ్ల క్రితం విశ్వనాథ్ సృష్టించిన ఈ మీనాక్షి పాత్ర... నాటి అమ్మాయిలకే కాదు. నేటి అమ్మాయిలకూ రేపటి అమ్మాయిలకూ అద్దమే. ఆ పాత్రలో భానుప్రియ ఒదిగిన తీరు అనితరసాధ్యం. చిత్తశుద్దీ ఏకాగ్రతా తోడైతే.. ఏ కళైనా అజరామరం అవుతుందని ఆ పాత్ర తెలుసుకోవడమే ‘స్వర్ణకమలం’. 

 

రెండున్నర గంటల పాటు సాగే ఈ సినిమాలో ఒక్క నాట్యం గురించే కాదు.. సంస్కృతి, సంప్రదాయం, భక్తి, ప్రేమ, తిరుగుబాటు.. ఇలా ఎన్నో అంశాలను స్పృశించారు విశ్వనాథ్. హృదయాలను బరువెక్కించే భావోద్వేగం, ఆహ్లాదపరిచే హాస్యం ఈ సినిమాకు అలంకారాలు. వెంకటేష్, భానుప్రియ, సాక్షి రంగారావు, శ్రీలక్ష్మి, షణ్ముఖ శ్రీనివాస్, కేఎస్‌టీ సాయి... ఇలా ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు జీవం పోశారు. 

 

కొలువై ఉన్నాడే..., ఆకాశంలో ఆశల హరివిల్లు.., శివపూజకు చిగురించిన సిరి సిరి మువ్వ.., ఘల్లు ఘల్లు ఘల్లు మంటు.., అందెల రవమిది పదములదా... ఇలా ఇందులోని ప్రతి పాటా ఓ ఆణిముత్యం. ఇళయరాజా ఆల్బమ్స్‌లో ‘స్వర్ణకమలం’కి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే సిరివెన్నెల సాహిత్యం ఈ స్వరాలకు జీవాన్ని పోసింది. పాతికేళ్లే కాదు.. మరో నూరేళ్లయినా చెదిరిపోని అపురూప దృశ్యకావ్యమిది. ఈ సినిమా గురించి కె.విశ్వనాథ్‌తో జరిపిన ఇంటర్వ్యూ...

 

పాతికేళ్లయినా మీ ‘స్వర్ణకమలం’ చిత్రాన్ని ప్రేక్షకులు స్మరించుకుంటున్నారంటే కారణం?

సంప్రదాయ కళలపై ఇష్టంతో.. జనహృదయాలపై వాటిని ఉన్నతంగా నిలపాలనే ఉన్నతమైన ధ్యేయంతో సినిమాలు తీశాను. వాటిల్లో ఒకటే ‘స్వర్ణకమలం’. సంప్రదాయ కళలపై, వృత్తి విద్యలపై ప్రస్తుతం యువతరానికి నమ్మకం పోయింది. మనది కాని వాటిపైనే వారు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విధానం తప్పని ఈ సినిమాలో చెప్పాను.



ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సాహిత్యం ఈ చిత్రానికి రెండు కళ్లు. ఇందులో భానుప్రియ నటనకు, నాట్యాలకు మంచి పేరొచ్చింది. చివరిపాట తప్ప అన్ని పాటలకూ శేషు, ముక్కురాజు కొరియోగ్రఫీ ఇచ్చారు. చివరిపాట ‘అందెల రవమిది పదములదా..’ పాటకు మాత్రం సుప్రసిద్ధ హిందీ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణ చేశారు. ఎంతోమందికి నాట్యంపై మక్కువ పెంచిందీ సినిమా. మొన్నటివరకూ కథానాయికగా వెలిగిన లయకు నాట్యంపై ఇష్టం పెంచింది ఈ సినిమానే.

 

వెంకటేష్‌ని పెయింటర్‌గా చూపించాలని ఎందుకనిపించింది?

నా సినిమాలో హీరోలందరూ సాధ్యమైనంతవరకూ సాధారణమైన వ్యక్తులే అయ్యుంటారు. అలాగే ‘స్వర్ణకమలం’లో వెంకటేష్ పాత్రను తీర్చిదిద్దాను. చిత్రకారునిగా, కళాభిమానిగా ఆయన ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. ఈ పాత్రే కాదు. ఇందులోని ప్రతి పాత్రా సమాజంలో మనకు అప్పుడప్పుడు తారసపడేదే. 

 

వేదాంతం శేషేంద్రశర్మ పాత్రకు ఓ పెద్దాయనను పరిచయం చేశారు. ఆయన్నే ఎంచుకోవడానికి కారణం?

ఆయన నిజంగా కూడా నాట్యాచార్యుడే. వారి ప్రాపర్ ఏలూరు. పేరు నాక్కూడా గుర్తు లేదు. అయితే.. యాదృఛ్చికమైన విషయం ఏంటంటే.. సినిమాలో వేదికపై ఆయన ఎలా చనిపోతారో, నిజజీవితంలో కూడా వేదికపై సరిగ్గా అలానే చనిపోయారాయన. 

 

ఇందులో మీరు అప్పటికప్పుడు అనుకొని సృష్టించిన సన్నివేశం ఏదైనా ఉందా?

మధ్యాహ్నం అనుకొని, సాయంత్రం తీసిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అది సాక్షి రంగారావు, శ్రీలక్ష్మి కామెడీ ట్రాక్. వైజాగ్‌లో ఓ మధ్యతరగతి ఇంట్లో ఆ సన్నివేశాలు తీశాం. వారి కామెడీ ట్రాక్‌కి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో. 

 

దిగువ మధ్య తరగతి బ్రాహ్మణుల జీవితాలను అంత గొప్పగా ఎలా ఆవిష్కరించగలిగారు?

నేనూ అలాంటి కుటుంబం నుంచే వచ్చినవాణ్ణి. దర్శకునికి ముఖ్యంగా ఉండాల్సింది పరిశీలన. అందుకు తగ్గట్టే పాత్రధారుల్ని కూడా ఎంచుకోవడం జరిగింది. భానుప్రియ అక్క పాత్ర పోషించిన అమ్మాయిని ఓ టీవీ సీరియల్‌లో చూశాను. అలాగే ఇంటి ఓనర్ కొడుకు పాత్రను పోషించిన కుర్రాడు నిజంగా వయొలినిస్టే. ఇంటి ఓనర్‌గా కేఎస్‌టీ సాయి.. వీళ్లెవరూ అప్పుడు బిజీ ఆర్టిస్టులు కారు. కానీ ‘స్వర్ణకమలం’ కథలో నేను ఊహించిన పాత్రలు వారే. 

 

మళ్లీ ఎప్పుడు మెగా ఫోన్ పడతారు?

అడుగుతున్నారు. అన్నీ కుదరాలి కదా. 

 

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో చేశారు. నాగార్జున ఒక్కరే బ్యాలన్స్?

 తనూ ఆ మధ్య అడిగాడు. తగ్గ కథ దొరకాలిగా. మీ దర్శకత్వంలో ‘సాగరసంగమం’ లాంటి సినిమా చేయాలని ఉందని ఆ మధ్య ఎన్టీఆర్ కూడా అడిగాడు. ఇప్పుడున్న హీరోల్లో తనతో ఆ సినిమా చేయొచ్చు. గోవిందా కూడా హిందీలో నా దర్శకత్వంలోనే ‘సాగరసంగమం’ చేయాలని ప్రయత్నించాడు. కానీ ఇక్కడ అనుకున్నవన్నీ కుదరవ్. 

 

మీ ఆత్మకథను రాసుకోవచ్చు కదా?

 ఆత్మకథ రాసుకునేంత గొప్ప వ్యక్తిని నేను కాదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను కష్టాలు పడి ఈ స్థాయికి రాలేదు. మీరు అడిగారు కాబట్టి ఆలోచిస్తా.

 

 ‘స్వర్ణకమలం’ నా కెరీర్‌లో ప్రత్యేక చిత్రం. ఈ సినిమాకు ముందు యాక్షన్ చిత్రాలు, ప్రేమకథలు చేసేవాణ్ణి. కానీ ‘స్వర్ణకమలం’ చేశాక నా నటనలో పూర్తిగా మార్పొచ్చింది. ఇప్పుడు నన్నందరూ నేచురల్ ఆర్టిస్ట్ అంటున్నారంటే కారణం ‘స్వర్ణకమలం’ సినిమానే. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించడం ఓ గొప్ప అనుభవం. కాశ్మీర్, భువనేశ్వర్.. లాంటి ప్రదేశాల్లో చిత్రీకరించిన ఆ పాటలు ఇప్పటికీ మధురానుభూతులే.  

  - వెంకటేష్

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top