తాజా జువ్వలు

Special story on tollywood new heroines - Sakshi

టపాకాయల్లో తారాజువ్వల్ది స్పెషల్‌ ఎఫెక్ట్‌.నేల టికెట్‌ కొంటే ఎలా చూస్తాం.. తలంతా పైకెత్తి..అలా.. వెండితెరపై సినిమా చూసినట్లేఆకాశంలోకి ఎగురుతున్న తారాజువ్వని చూడ్డం!తిథుల ప్రకారం ఇవాళ దీపావళి.అతిథుల ప్రకారం మాత్రంఈ ఏడాదంతా తెలుగు ప్రేక్షకులకు దీపావళే!రష్మిక, కియారా, పాయల్, నభా.. నిధి..తాజా జువ్వల్లా వచ్చి తారాజువ్వల్లా వెలిగారు.వీళ్లింకా ఎంతెంత పైకి ఎగరబోతున్నారన్నది స్టోరీ. హ్యాపీ దీపావళి. హ్యాపీయస్ట్‌ తారావళి.

స్క్రీన్‌ మీద హీరో అనే సీమ టపాకాయ్‌ పక్కన తళుకు తళుక్కున మెరిసే తారలు, దీపాలు వెలిగించే సితారలు లేకపోతే వెలుగు లేకుండా వెలితిగా ఉంటుంది. ఈ ఏడాది తెలుగు తెరకు చాలామంది హీరోయిన్లు పరిచయమయ్యారు. అందులో కొందరు మాత్రం తారా జువ్వలై నేరుగా యువత గుండెల్లోకి దూసుకెళ్లారు. గుండె గదుల నిండా భూచక్రాల్లా గిర్రున రౌండ్లు కొట్టారు. అభినయమనే ఆటమ్‌బాంబ్‌కి అందమనే పచ్చ తాడు చుట్టుకొని స్క్రీన్‌పై మెరుపులు మెరిపించిన ఈ తాజా జువ్వల కాంతుల్ని వీక్షించండి.

మేడమ్‌.. డమ్‌.. డమ్‌
కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి దిగుమతి అయిన రష్మికా మండన్నా వరుసగా థౌంజడ్‌వాలాలా మోత మోగిస్తూనే ఉన్నారు. నాగశౌర్య ‘ఛలో’తో పరిచయమైన ఈ భామ ఫస్ట్‌ సినిమాకే హిట్‌ ట్రాక్‌ ఎక్కారు. ఆ తర్వాత యూత్‌ అంతా విజయ్‌ దేవరకొండ చుట్టూ తిరుగుతుంటే అంతటి మనిషినే ‘మేడమ్‌ మేడమ్‌..’ అంటూ తన వెనుక తిప్పించుకున్నారు. ‘గీత గోవిందం’లో ఈ జంట చేసిన సందడి గుర్తుండే ఉంటుంది. దాని తర్వాత నాగార్జున, నాని మల్టీస్టారర్‌ ‘దేవదాస్‌’లో పోలీస్‌ ఆఫీసర్‌ పూజాగా తుపాకీ తిప్పారు. ఇలా పరిచయమైన ఏడాదిలోనే మూడు భారీ ఔటులను డమ్‌ డమ్‌ని పేల్చారు. ప్రస్తుతం నితిన్‌తో ఓ సినిమా, విజయ్‌ దేవరకొండతో మరో సినిమా ఓకే చేశారు రష్మిక. ఈ ఏడాది భారీగా యువత హృదయాలను గింగిరాలు తిప్పిన వాళ్ల లిస్ట్‌లో ఫస్ట్‌ ఉన్నారీ భామ. 

రాకింగ్‌ యారా
బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి దిగుమతి అయిన కియారా అద్వాని ఏకంగా రాకెట్‌ అయ్యారు. వరుసగా పెద్ద పెద్ద స్టార్స్‌తో జత కడుతూ, నాన్‌స్టాప్‌ వెలుగులు చిమ్ముతున్నారు. ‘భరత్‌ అనే నేను’ సినిమా పూర్తికాక ముందే రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో జోడీ కట్టడానికి రెడీ అయ్యారు కియారా. ప్రస్తుతం అల్లు అర్జున్‌– త్రివిక్రమ్‌ సినిమాలో కూడా కియారా పేరునే పరిశీలిస్తున్నారని సమాచారం. ఇలా ఈ ఏడాది కేవలం టాప్‌ స్టార్స్‌తోనే జోడీ కట్టిన కియారా కాస్తా.. లక్కీయారా అయ్యారు.

గ్లామరస్‌ బాంబ్‌
‘ఆర్‌ఎక్స్‌100’ బండి బాక్సాఫీస్‌ దగ్గర ఎంత సౌండ్‌ చేసిందో అందరికీ తెలిసిందే. హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ విపరీతమైన గ్లామరస్‌ డోస్‌తో ఏసీ థియేటర్లలో కూడా వేడిని పెంచేలా చేశారు. సినిమాలో పాయల్‌ చేసిన ఈ పాత్ర చాలా రిస్క్‌తో కూడుకున్నది. దాన్ని కూడా అవలీలగా లాగేశారు పాయల్‌. స్టార్టింగ్‌ నుంచి ప్రేమించిన ప్రేక్షకుల గుండెలను క్లైమాక్స్‌లో గాయాల్‌ చేశారు పాయల్‌.  క్యారెక్టర్‌ నెగటివ్‌ షేడ్‌ అయినప్పటికీ నటనపరంగా విజృంభించడంతో పాయల్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాల వెల్లువ వచ్చినా సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. నెక్ట్స్‌ రవితేజ చేయబోయే ‘డిస్కో రాజా’ చిత్రంలో ఓ హీరోయిన్‌గా ఎంపికయ్యారామె.  తమిళంలో కూడా ఉదయనిధి స్టాలిన్‌తో ‘ఏంజిల్‌’ సినిమా చేస్తున్నారు పాయల్‌. 

అబ్బబ్బా.. నభా
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు నభా నటేశ్‌.  అభినయంతో, అందంతో అటు ప్రేక్షకులను ఇటు కొత్త సినిమా అవకాశాలను దోచుకుంటున్నారు నభా నటేశ్‌. పందిపిల్ల బంటితో రవిబాబు తెరకెక్కించిన ‘అదుగో’ నభా ఫస్ట్‌ చిత్రం. కానీ సుధీర్‌బాబుతో చేసిన ‘నన్ను దోచుకుందువటే’ ముందు రిలీజ్‌ అయింది. అందులో సాఫ్ట్‌వేర్‌ సిరిగా సాఫ్ట్‌గా ప్రేక్షకుల హృదయాలను ఆకట్టేసుకున్నారు. కుర్రకారైతే ‘అబ్బబ్బా.. నభా’ అనకుండా ఉండలేకపోయారు. రవితేజ తదుపరి చిత్రం ‘డిస్కో రాజా’లో ఓ హీరోయిన్‌గా యాక్ట్‌ చేయనున్నారు నభా. అలాగే గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలోనూ నభానే హీరోయిన్‌.

నిన్ను ఫస్టుసారి చూసినది..
‘మున్నా మైఖెల్‌’ అనే చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్‌ ‘సవ్యసాచి’ ద్వారా తెలుగుకు పరిచయమయ్యారు. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేశారు. ‘సవ్యసాచి’లో హీరోయిన్‌గా మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమాలో ‘నిన్ను రోడ్డు మీద చూసినది’ రీమిక్స్‌ సాంగ్‌ని మార్చి పాడుకుంటున్నారు కుర్రకారు. ‘నిధీ.. నిన్ను ఫస్టుసారి చూసినది లగాయితు’ అంటున్నారు. అంతలా ఆమె అందానికి ఫిదా అయ్యారు. ప్రస్తుతం అఖిల్‌ సినిమాతో బిజీగా ఉన్న ఈ భామ సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం. 
ఇన్‌పుట్స్‌: గౌతమ్‌ మల్లాది 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top