ఇంకా ఉంది

Special story to telugu sequel movies - Sakshi

సీక్వెల్స్‌

రాజు–ఇంద్రజ... హిట్‌ జోడీ.అభిరామ్‌.. సూపర్‌ స్టైల్‌.అర్జున్‌ ప్రసాద్‌... మంచి లీడర్‌.బంగార్రాజు.. అమ్మాయిల కలల రాజు... సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ క్యారెక్టర్లు పదే పదే చూడాలనిపించే విధంగా ఉంటాయి. అందుకే ‘సీక్వెల్స్‌’ వస్తే బాగుండని ప్రేక్షకులు అనుకుంటారు. ఆ పాత్రల మీదమమకారం నటించినవాళ్లకూ ఉంటుంది. సినిమా తీసినవాళ్లకూ ఉంటుంది. అలా బోలెడంత క్రేజ్‌ తెచ్చుకున్న కొన్నిచిత్రాల సీక్వెల్స్‌ ‘ఆన్‌ సెట్స్‌’లో ఉంటే.. కొన్ని ప్లానింగ్‌లో ఉన్నాయి. అన్నీ కుదిరితే మళ్లీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లోరాజు–ఇంద్రజ, ‘మన్మథుడు’లో అభిరామ్,  ‘లీడర్‌’లో అర్జున్‌ ప్రసాద్, ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో బంగార్రాజు మళ్లీ మనకు కనిపిస్తారు. అయిపోలేదు.. ‘ఇంకా ఉంది’ అని ‘సెకండ్‌ పార్ట్‌’ పనుల్లో  ఉన్న సీక్వెల్స్‌ గురించి తెలుసుకుందాం.

ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతోంది. ఫ్రంట్‌ నుంచి హారర్‌లు, బ్యాక్‌ నుంచి థ్రిల్లర్‌లు, లెఫ్ట్‌ నుంచి యాక్షన్‌లు, రైట్‌ నుంచి బయోపిక్‌లు దుమ్ము రేపుతున్నాయి. ప్రేక్షకుణ్ణి ఆకర్షించి వాళ్ల జేబులోని డబ్బును టికెట్‌ తెగడానికి ఆకర్షించేలా ఏమేమి చేయవచ్చో అవన్నీ చేయడానికి రెడీ అయిపోతున్నారు దర్శక–నిర్మాతలు. అన్నీ ఊపు మీద ఉన్నప్పుడు సీక్వెల్స్‌ను కూడా తెచ్చి పాత కీర్తిని క్యాష్‌ చేసుకోవచ్చు కదా అనే ఆలోచనతో కొన్ని ప్రాజెక్ట్స్‌ రంగం మీదకు వచ్చాయి. ఆల్‌మోస్ట్‌ అరడజను సినిమాలు ఆ విధంగా ముందుకు పోనున్నాయి. అవేమిటి? ఎంటర్‌ నొక్కి చూద్దాం పదండి.

మానవా మళ్లీ రావా?
‘మానవా... ఇది ఏమి విచిత్ర వాహనం. కడు విచిత్రంగా ఉంది’ అని శ్రీదేవి అంటే, ‘ఇప్పుడు ఆ పని మీదే పిచ్చాసుపత్రికి వెళ్తున్నాం’ అని చిరంజీవి అన్న డైలాగ్‌కి నవ్వకుండా ఉండలేం. పైకి తింగరబుచ్చి అని పిలిచినా ఫైనల్‌గా జగదేక సుందరితో ప్రేమలో పడిపోతాడు హీరో. చిరంజీవి, శ్రీదేవి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సి.అశ్వినీదత్‌ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సూపర్‌ డూపర్‌ హిట్‌.ఈ సినిమా రిలీజ్‌ రోజు (9 మే 1990) వరుణుడు వర్షం కరిపిస్తే బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులు కనకవర్షం కురిపించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాలనే ఆలోచన ఉన్నట్లు అశ్వినీదత్‌ తన మనసులోని మాటను బయటపెట్టారు. మరి.. సీక్వెల్‌ తీస్తే ఫ్యాన్స్‌ అందరూ రామ్‌చరణ్‌ నటించాలని కోరుకుంటారు కదా. శ్రీదేవిలా నటించడానికి ఆమె కుమార్తె జాన్వి ఉండనే ఉంది. ఈ కాంబినేషన్‌తో సినిమా చేస్తే సీక్వెల్‌ ఓ రేంజ్‌లో ఉండొచ్చు. సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్స్‌కు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ జంట సెట్‌ అవ్వకపోయినా వేరే ఎవరు చేసినా కూడా బాగానే ఉంటుంది. మరి.. అశ్వినీదత్‌ ఈ ప్రాజెక్ట్‌ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చూడాలి.

మన్మథుడు తిరిగొస్తాడా!
నాగార్జున కెరీర్‌లో ‘మన్మథుడు’ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. ‘అందమైన భామలు...’ అంటూ నాగ్‌ వేసిన స్టైలిష్‌ స్టెప్స్‌ని మరచిపోలేం. అందులో సోనాలీ బింద్రేతో ప్యారిస్‌ ట్రిప్‌ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్‌లో బ్రహ్మానందం కామెడీ ఇవాళ్టికి కూడా ఇంటింటిలో టీవీ ద్వారా పండుతూనే ఉంది. నవ్వులు పూయిస్తూనే ఉంది. ఇటీవల ‘మన్మథుడు 2’ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించినట్లు స్వయంగా నాగార్జునే చెప్పారు.ప్రస్తుతం నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసమే ‘మన్మథుడు 2’ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేసి ఉంటారన్నది కొందరి ఊహ. ఇదే నిజమైతే ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్‌ రెడీ అవుతున్నట్లేగా. అలాగే రెండేళ్ల క్రితం సంక్రాంతికి రిలీజైన నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కూడా మంచి హిట్‌ అయ్యింది. ఇందులో నాగార్జున చేసిన బంగార్రాజు క్యారెక్టర్‌కు జనం క్లాప్స్‌ కొట్టారు. దీంతో బంగార్రాజు టైటిల్‌తోనే ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్‌ తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నిజమేనని, ఈ సినిమాను ఓ సిరీస్‌లా కొనసాగించాలనే ఆలోచన ఉందని నాగార్జున తనయుడు నాగచైతన్య రీసెంట్‌గా ఓ సందర్భంలో  చెప్పారు. ఇక నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’ థియేటర్స్‌లో  ఉన్న సంగతి తెలిసిందే.  ‘దేవదాస్‌’కు సీక్వెల్‌ చేద్దామా నాని?’ అని ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాగార్జునే అన్నారు. నిప్పు లేకుండా పొగ రాదుగా. అంటే నిజంగానే ‘దేవదాస్‌’ టీమ్‌ సీక్వెల్‌ను ఆలోచిస్తుందా? ఏమో.. కొంత కాలం వేచి చూస్తే కానీ తెలియదు.

సీయం భరత్‌ పాలన
‘వర్షం పడితే సరే.. పడకపోతే ఏం చేస్తావ్‌?’ అని మహేశ్‌బాబు అడిగితే.. ‘భగవంతుడి మీద భారం వేసి పైకి చూడటమే. లేకపోతే రెండు చుక్కులు తాగి ఆయన దగ్గరకు పోవడమే’ అని రైతు నోటి నుంచి వచ్చిన మాటలు హార్ట్‌ టచింగ్‌గా ఉంటాయి. ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలో ఎడిట్‌ అయిన సీన్‌ ఇది. ఆ తర్వాత ఈ క్లిప్‌ను రిలీజ్‌ చేశారు. అలాగే ఈ సినిమాలో ఓ హోలీ ఫైట్‌ కూడా మిస్సయ్యింది. ఇలాంటి ఎన్నో సీన్స్‌ అలాగే ఉండిపోయాయి. ఈ సినిమా నిడివి దాదాపు నాలుగున్నర గంటలు వచ్చిందట. అందుకే ‘భరత్‌ అనే నేను’ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందా? అంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ‘ఎస్‌’ అని అనలేదు కానీ.. ‘నో’ అని మాత్రం చెప్పలేదు. పైగా చూడాలి? అన్నారు. అంతేనా ఈ ‘భరత్‌ అనే నేను’ సినిమాను రెండు పార్ట్స్‌గా రిలీజ్‌ చేయాలనుకున్నామని మూవీ ప్రమోషన్‌ టైమ్‌లో  చిత్రబృందం పేర్కొంది. ఆల్రెడీ కొంత ఫుటేజ్‌ ఉండనే ఉంది. ఎలాగూ సినిమా కూడా బంపర్‌హిట్‌ అయ్యింది. కాస్త లేట్‌ అయినా ఈ సినిమా సీక్వెల్‌ను ప్రేక్షకులు ఆశించవచ్చు. అదే జరిగితే సీయం భరత్‌ చంద్ర వెండితెర పాలనను మళ్లీ చూడొచ్చు.

లీడర్‌ రావాలి!
పొలిటికల్‌ థ్రిల్లర్‌ జానర్‌ అంటే హీరో రానాకు ఫేవరెట్‌ అని చెప్పవచ్చు. ఆ మాటకు వస్తే ఆయన ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిందే ‘లీడర్‌’ సినిమాతో. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పక్కర్లేదు. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్‌ అదిగో ఇదిగో అంటున్నారు. ఈ గ్యాప్‌లో రానా బోలెడన్ని సినిమాలు చేశారు. శేఖర్‌ కమ్ముల నిదానమే ప్రధానం అన్నట్లుగా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌ హిట్‌ ‘ఫిదా’ తర్వాత శేఖర్‌ కమ్ముల ఓ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఎప్పటికైనా ఆయన ‘లీడర్‌’ సీక్వెల్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

గాడిలో రెండో సుడిగాడు
దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు, హీరో ‘అల్లరి’ నరేశ్‌ కాంబినేషన్‌లో ఆరేళ్ల క్రితం వచ్చిన ‘సుడిగాడు’ చిత్రం కడుపుబ్బా నవ్వించింది. ఆ తర్వాత ‘సుడిగాడు 2’ తెరపైకి వచ్చింది. అంతెందుకు.. ఇటీవలే రిలీజైన ‘సిల్లీ ఫెలోస్‌’ సినిమాకు ‘సుడిగాడు 2’ టైటిల్‌ని పరిశీలించామని ‘అల్లరి’ నరేశ్‌ చెప్పారు. ‘సుడిగాడు 2’కి శ్రీకారం చుట్టే ఆలోచన ‘అల్లరి’ నరేశ్‌కి ఉందని తెలుస్తోంది. సీక్వెల్‌ కాబట్టి నవ్వుల డోస్‌ పెరిగే అవకాశం ఉంది. 

మళ్లీ నిఘా
ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన చిన్న చిత్రం ‘గూఢచారి’ కలెక్షన్స్‌ పరంగా పెద్ద చిత్రంగా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు శశికరణ్‌ తిక్క, హీరో అడవి శేష్‌ల ప్రతిభను అందరూ మెచ్చుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న నాగార్జున ‘గూఢచారి 2’కి ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు. సీక్వెల్‌ ఆలోచన ఉందని టీమ్‌ కూడా పేర్కొంది. సో.. గూఢచారి సీక్వెల్‌ ఆన్‌ ది వే అని చెప్పవచ్చు. 

సమాధానం వచ్చే ఏడాది
నమ్మకానికి సైన్స్‌ను ముడిపెట్టి ఓ చిన్న పాయింట్‌ చుట్టూ అల్లిన సినిమా ‘కార్తికేయ’.  2014లో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నిఖిల్‌ హీరో.  ఈ సినిమా సీక్వెల్‌ వచ్చే ఏడాది మొదలు కానుంది. ఈ విషయాన్ని హీరో నిఖిలే స్వయంగా సోషల్‌ మీడియాలో చెప్పారు. ‘కార్తికేయ’ సినిమా కొన్ని ప్రశ్నలతో ముగుస్తుంది. సీక్వెల్‌లో సమాధానాలు దొరుకుతాయి.నిజానికి హాలీవుడ్, బాలీవుడ్‌లో ‘సీక్వెల్స్‌’ ఎక్కువ వస్తుంటాయి. టాలీవుడ్‌లో తక్కువ.  సీక్వెల్స్‌ అంటే ఓ సెపరేట్‌ క్రేజ్‌ ఉంటుంది. ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలంటే.. కథ బాగా కుదరాలి. స్క్రీప్‌ప్లే పకడ్బందీగా ఉండాలి. నటీనటులు కూడా పర్ఫెక్ట్‌గా సెట్‌ అవ్వాలి. అన్నీ కుదిరితే థియేటర్స్‌లో సీక్వెల్స్‌ కాసుల్‌ కురిపిస్తాయి.

ఆన్‌ ది వే
‘గీతాంజలి’ గుర్తుందా? నాగార్జున పాత ‘గీతాంజలి’ కాదు. ఇటీవల అంజలి చేసిన ‘గీతాంజలి’ గురించి చెబుతున్నాం. ఎందుకంటే..‘గీతాంజలి 2’గా అంజలి మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. అంటే... గీతాంజలి సీక్వెల్‌ అన్నమాట. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను చిత్రబృందం చేసింది. కోన వెంకట్‌ నిర్మిస్తున్నారు. అలాగే సుధీర్‌బాబు హీరోగా జేబీ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమ కథాచిత్రమ్‌’ ప్రేక్షకులను నవ్విస్తూ భయపెట్టింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. కాకపోతే క్యాస్టింగ్‌లో మార్పులు చేర్పులు వచ్చాయి. ఇందులో సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటిస్తున్నారు. హరికృష్ణ దర్శకుడు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో సిద్ధూ, నరేశ్, రష్మీ ముఖ్యతారలుగా వచ్చిన ‘గుంటూర్‌ టాకీస్‌’ చిత్రం ఆడియన్స్‌కు బాగా నచ్చింది. మంచి కలెక్షన్స్‌ కూడా వచ్చినట్లు ప్రవీణ్‌ సత్తారు పేర్కొన్నారు.అందుకేనేమో ఇప్పుడీ సినిమా సీక్వెల్‌ను స్టార్ట్‌ చేశారు. కాకపోతే ‘గుంటూర్‌ టాకీస్‌ 2’ చిత్రానికి రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’గా తొలిపార్ట్, దాని సీక్వెల్‌ ‘యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’గా విడుదల కానున్నాయి. పార్ట్‌ 1 వచ్చే జనవరి 9న విడుదల కానుంది.  అదే నెలలో అంటే జనవరి 24న సీక్వెల్‌ విడుదల కానుంది. ఇక కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’ సీక్వెల్‌ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌ను డైరెక్ట్‌ చేసిన శంకర్‌నే ఈ సినిమాకి కూడా దర్శకుడు. ఇన్ని విషయాలు మాట్లాడుకుని రజనీకాంత్‌ ‘ఎందరిన్‌’ (తెలుగులో ‘రోబో’) సీక్వెల్‌ ‘2.0’ గురించి చెప్పకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. నెక్ట్స్‌ థియేటర్స్‌లోకి రాబోయే సీక్వెల్‌ ఇదే. రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్య తారలుగా శంకర్‌ దర్శకత్వంలోనే రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌ 29న విడుదల కానుంది. 
ఇన్‌పుట్స్‌:  ముసిమి శివాంజనేయులు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top