నెరిసే మెరిసే...

Special story to Mekovar from hero and heroine - Sakshi

మగవారికి చిరుబొజ్జ, నెరిసిన వెంట్రుక అందం అంటారు. అయితే హీరోలు సిక్స్‌ ప్యాక్, బ్లాక్‌ విగ్గుకే ఎస్‌ చెప్తుంటారు. పాత్రకు వయసొచ్చిందంటే తమకే వయసొచ్చేసిందని  ప్రేక్షకులు ఎక్కడనుకుంటారోనని సందేహం.

కాని కొందరు నటులు పాత్రను నమ్ముతారు.  తమను తాము నమ్ముతారు. నెరిసిన వెంట్రుకలున్న పాత్రలు వేసి మెరుస్తారు.  వాటితో సక్సెస్‌ కొట్టి తమ కెరీర్‌ ఆయుష్షు  పెంచుకుంటారు. 

మేకోవర్‌ అంటే ఆమిర్‌
ముందు సినిమాలో కనిపించినట్టుగా కొత్త సినిమాలో కనిపించడం ఆమిర్‌ ఖాన్‌కు పెద్దగా నచ్చదు. అందుకే గెటప్స్‌తో ప్రయోగాలు చేస్తుంటారు. మేకోవర్‌ అంటే ఆమిర్‌ అనే స్థాయిలో ‘గజిని, పీకే, దంగల్‌’ తదితర చిత్రాల్లో భిన్నంగా కనిపించారు ఆమిర్‌. ప్రస్తుతం మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. హాలీవుడ్‌ సూపర్‌హిట్‌ సినిమా ‘ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌గా ‘లాల్‌సింగ్‌ చద్దా’ అనే సినిమాలో నటించనున్నారు. లాల్‌ సింగ్‌ చద్దా అనే వ్యక్తి జీవిత కథగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కొంత పోర్షన్‌ వృద్ధుడిగా కనిపిస్తారు ఆమిర్‌. వచ్చే ఏడాది క్రిస్మస్‌కు ఈ సినిమా విడుదల కానుంది. 


ఓల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌ 
ప్రేమకథలు, ఇంటెన్స్‌ సబ్జెక్ట్స్‌తో శర్వానంద్‌ నటుడిగా నిరూపించుకున్నారు. ఇప్పుడు ఓ గ్యాంగ్‌స్టర్‌గా మన ముందుకు రాబోతున్నారు. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా ఓ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా తెరకెక్కింది. ఈ సినిమాలో శర్వానంద్‌ రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఒకటి యంగ్‌ లుక్‌ కాగా మరోటి ఓల్డ్‌ గెటప్‌. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. వయసుకు మించిన పాత్ర శర్వా చేయడం ఇది మొదటిసారేం కాదు. ఆల్రెడీ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో తన వయసుకు మించిన పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. 

గ్లామర్‌ డాల్స్‌ కాదు 
గ్లామర్‌ పాత్రలు చేస్తూ వచ్చిన తాప్సీ దాదాపు రెండేళ్ల క్రితం యూటర్న్‌ తీసుకున్నారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ సూపర్‌ హిట్స్‌ అందుకుంటున్నారు. ఎంచు కునే స్క్రిప్ట్స్‌ విభిన్నంగా ఉండాలనుకుంటారు మరో హీరోయిన్‌ భూమి ఫెడ్నేకర్‌. ఈ ఇద్దరూ కలసి ఓ రిస్క్‌ తీసుకున్నారు. తమ తదుపరి చిత్రం ‘సాంద్‌ కీ ఆంఖ్‌’లో 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలుగా కనిపించనున్నారు. 60 ఏళ్ల తర్వాత షూటర్స్‌గా తమ కెరీర్‌ను స్టార్ట్‌ చేసి కొన్ని వందల పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్‌ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అనురాగ్‌ కశ్యప్‌ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు తుషార్‌ హిరానందన్‌ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా దీపావళికి రిలీజ్‌ కానుంది.

ఇండియన్‌ తాత తిరిగొచ్చె
సినిమాలో ముసలి పాత్ర అంటే  చెవుల పైన జుత్తుకు తెల్లరంగు పూయడాలు, పాత ఫ్రేమ్‌ కళ్లద్దాలు పెట్టడం కాదని ‘భారతీయుడు’ సినిమా చూపించింది. ఈ సినిమాలో కమల్‌హాసన్, సుకన్యలకు వేసిన ఓల్డ్‌ గెటప్‌ అప్పటి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌. గుర్తుపట్టడానికే సమయం పట్టేంత అద్భుతమైన మేకప్‌ ఆ సినిమా కోసం వాడారు. ఇప్పుడు మరోసారి ఇండియన్‌ తాతను తిరిగి తీసుకొస్తున్నారు శంకర్‌. ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ మొదలుపెట్టారు. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ సేనాపతి పాత్రను చేస్తున్నారు. ఆ మధ్య ఆయన లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో  కాజల్‌ హీరోయిన్‌.

భారత్‌ జర్నీ 
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న ఖాన్‌ హీరోల్లో  కమర్షియల్‌ సక్సెస్‌ల పరంగా సల్మాన్‌ ఖాన్‌ నంబర్‌ వన్‌. సినిమా సినిమాకు వందల కోట్ల కలెక్షన్‌ ఖాయం. కానీ వాటన్నింటినీ పరీక్షిస్తే సల్మాన్‌ మేకోవర్‌లో పెద్ద మార్పేం లేదు. అయితే లేటెస్ట్‌గా వస్తున్న ‘భారత్‌’లో మాత్రం 18 ఏళ్ల యువకుడి నుంచి 71 ఏళ్ల వృద్ధుడిగా విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారాయన. ఇందులో సల్మాన్‌ చేసిన 71 ఏళ్ల పాత్ర ఓ హైలైట్‌ అని చిత్రబృందం పేర్కొంది.  సల్మాన్‌ ఫేవరెట్‌ సీజన్‌ ఈద్‌ స్పెషల్‌గా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్, దిశా కథానాయికలు. ‘‘నా తల మీద ఉన్న తెల్ల జుత్తుకంటే నా జీవితంలో నేను చూసి అనుభవాల రంగులు ఇంకా ఎక్కువ’’ అంటూ రిలీజ్‌ చేసిన సల్మాన్‌ లుక్‌ ఆకట్టుకుంది.

ఎన్‌.టి.ఆర్‌ ‘బడి పంతులు’లో ముసలి వేషం కట్టారు. అది హిట్‌ అయింది. జనం ఇదేమిటి అనుకోలేదు. ఏ.ఎన్‌.ఆర్‌ ‘సుడిగుండాలు’లో వృద్ధ పాత్ర పోషించారు. కలెక్షన్లు రాకపోయినా ఆ పాత్రకు పేరొచ్చింది. శోభన్‌బాబు కూడా తన కెరీర్‌ ఊపు మీద ఉన్నప్పుడు ‘ధర్మపీఠం దద్దరిల్లింది’, ‘జీవనజ్యోతి’ వంటి సినిమాలలో తెల్లజుట్టు పాత్రలలో నటించడానికి సిద్ధమయ్యారు. కృష్ణంరాజుకు భారీ హిట్‌గా నిలిచిన చిత్రం ఆ పెద్ద వయసు పాత్ర చేసిన ‘బొబ్బిలి బ్రహ్మన్నే’. చిరంజీవి కూడా ‘సింహపురి సింహం’లో ముసలి పాత్ర తొలిసారిగా పోషించి పాత్ర డిమాండ్‌ చేస్తే నటించక తప్పదు అని నిరూపించారు. ఇక తమిళంలో కూడా కమల్‌హాసన్‌ ‘ఒరు ఖైదియిన్‌ డైరీ’ (ఖైదీ వేట) సినిమాలో ముసలి పాత్ర వేసి ఆ సినిమాను సూపర్‌ హిట్‌ చేశారు. ‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’లో ఆయన వృద్ధ పాత్రలు రాణించాయి. వెంకటేశ్‌ ‘సూర్య వంశం’, రాజశేఖర్‌ ‘మా అన్నయ్య’, బాలకృష్ణ ‘చెన్న కేశవ రెడ్డి’, రాజేంద్ర ప్రసాద్‌ ‘ఆ నలుగురు’ ఇవన్నీ వయసు మళ్లిన పాత్రల వల్ల హిట్‌ అయిన సినిమాలే. హిందీలో ఈ ధోరణి తక్కువే అయినా షారుక్‌ ఖాన్‌ ధైర్యం చేసి ‘వీర్‌ జారా’లో ముసలి పాత్ర పోషించారు. రణ్‌బీర్‌ కపూర్‌ ‘బర్ఫీ’లో ముసలి పాత్రలో కనిపిస్తారు. ఆమిర్‌ ఖాన్‌ ఏకంగా ‘దంగల్‌’లో ముసలి హీరోగా నటించారు. కనుక దర్శకులు, రచయితలు కథ ముఖ్యమనుకొని పాత్రలు రాస్తుంటే హీరో హీరోయిన్లు కూడా ధైర్యంగా తెల్ల వెంట్రుకల విగ్‌ను పెట్టుకోవడానికి అంగీకరిస్తున్నారు. 

మన హీరోయిన్లు... వయసు మళ్లిన పాత్రలు
హీరోలు వృద్ధ పాత్రలు చేయడం కంటే హీరోయిన్లు వృద్ధ పాత్రలు చేయడం ఇంకా రిస్క్‌. కాని తెలుగులో అలాంటి పాత్రలు చేసి మెప్పించినవారు ఉన్నారు. వాణిశ్రీ ‘జీవన జ్యోతి’లో, జయసుధ ‘కలికాలం’లో, జయప్రద ‘సాగర సంగమం’లో అలాంటి పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జయప్రద ‘సాగర సంగమం’ అంగీకరించినప్పుడు పెద్ద చర్చే జరిగింది. కెరీర్‌ పీక్‌లో ఉండగా తల్లి పాత్ర, ముసలి పాత్ర వేయడం ఏంటని అందరూ సందేహించారు. కాని ఆ సినిమా ఆమెకు ఎంతో ఖ్యాతి తెచ్చింది. ‘కమల్‌ హాసన్‌ ఆ పాత్ర వేస్తున్నప్పుడు నేను వేయడానికి ఏమి అని ధైర్యం వచ్చి చేశాను’ అన్నారు జయప్రద ఒక ఇంటర్వ్యూలో.

తమిళంలో ప్రస్తుతం టాప్‌ ఫామ్‌లో ఉన్న నటుడు విజయ్‌ సేతుపతి. తన 25వ సినిమాకే వృద్ధుడిగా నటించే రిస్క్‌ తీసుకున్నారు. ‘సీతకాత్తి’ టైటిల్‌తో  రూపొందిన ఈ చిత్రం గత డిసెంబర్‌లో విడుదలైంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top