ప్రభాస్‌ ఇప్పుడిప్పుడే  నా మాట వింటున్నాడు

special  chit chat with krishnam raju - Sakshi

‘‘సినిమాలను కావాలనే తగ్గించాను. మనసుకు నచ్చినవి, కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తాను. ఈ ఏడాది రాజకీయాలకు 75 శాతం, సినిమాలకు 25 శాతం సమయాన్ని కేటాయించాలనుకున్నాను’’ అని కృష్ణంరాజు అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ రెబల్‌ స్టార్‌ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. 

నా తొలి సినిమా ‘చిలుకా గోరింకా’ 1966లో రిలీజ్‌ అయింది. ఈ ఏడాదితో నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నాను. ఈ సందర్భంగా చాలా గ్రాండ్‌గా  ఫంక్షన్‌ చేయాలనుకుంటున్నాం. దాదాపు 30 ఏళ్లుగా నాతో ఉన్న నా అభిమానులను వారి కుటుంబ సమేతంగా సత్కరించబోతున్నాను. ఆ తర్వాత సినిమా వాళ్ల సమక్షంలో కూడా మంచి కార్యక్రమం చేస్తాం. కేవలం తెలుగు పరిశ్రమకు చెందిన వ్యక్తులు మాత్రమే కాకుండా అన్ని పరిశ్రమలకు చెందిన పెద్దలతో ఫంక్షన్‌ నిర్వహించబోతున్నాం.

∙నేను వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ వేరు.. ఇప్పుడున్న ఇండస్ట్రీ వేరు. అప్పుడు తెలుగు సినిమా చాలా గౌరవప్రదంగా ఉండేది. నటీనటుల నటన సహజంగా ఉండేది. ఆ తర్వాత ఫైటింగ్‌ సినిమాలు వచ్చాయి. సినిమా అంటే ఫైట్సే అన్నట్లుగా పరిస్థితి మారింది. ఐదారేళ్లుగా మళ్లీ చక్కటి చిత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు సక్సెస్‌ రేట్‌ పెరిగింది. అలాగే ప్రొడక్షన్‌ కాస్ట్‌ కూడా పెరిగింది. 

∙తెలుగు సినిమాను ‘బాహుబలి’ గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లింది. హాలీవుడ్‌  దృష్టి మన ఇండియన్‌ సినిమా మీద పడింది. ‘బాహుబలి’ లాంటి సినిమా మనమూ తీద్దాం అని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఐ వెల్‌కమ్‌ ఇట్‌. ఆ స్పోర్టీవ్‌ స్పిరిట్‌ కావాలి. ఎవరో అన్నారు ‘ప్రతోడూ ‘బాహుబలి’ అంటున్నాడు అని’. ఏం తప్పేముంది? అనకూడదా? అది ఒక ఇన్‌స్పిరేషన్‌. ఒక పదిమంది ప్రయత్నిస్తే ఇద్దరైనా సాధిస్తారు కదా. దీని కోసం ఒక ఫోరమ్‌ (గ్లోబలైజేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ) ఏర్పాటు చేయదలుచుకున్నాము. డబ్బులుంటే సరిపోదు.. కొన్నిసార్లు టెక్నికల్‌ ఎక్విప్‌మెంట్‌ కూడా కావాల్సి వస్తుంది. దాన్ని వారికి సమకూర్చటం, వారికి సహాయం చేయటం కోసమే ఈ ఫోరమ్‌. ఇది  సినిమా పరిశ్రమకు ఉపయోగపడితే నాకు చాలా సంతోషం. ప్రస్తుతం దీనిపై వర్కవుట్‌ చేస్తున్నాం. ఇండియాలో పెద్ద పెద్ద దర్శకులు, ప్రొడ్యూసర్స్‌తో సమావేశాలు జరుపుతాం. 

∙నా ఫస్ట్‌ సినిమానే ఎస్వీ రంగారావుగారితో, స్టార్‌ హీరోయిన్‌ కృష్ణకుమారితో  చేశాను. ఆ సినిమాతో బాగా యాక్ట్‌ చేయగలడని నమ్మకం కలిగించాను. తర్వాత నెగటివ్‌ పాత్రలు వచ్చాయి అందులో కూడా మంచి పాత్రలు ఎన్నుకున్నాను. హీరోగా మారాక మంచి సినిమాలు చేయాలని సొంత బ్యానర్‌ స్టార్ట్‌ చేశాను. ‘అమరదీపం, భక్త కన్నప్ప, మన ఊరి పాండవులు’ తీస్తూ నన్ను నేను పెంచుకుంటూ, సినిమా ఇండస్ట్రీని ఒక కొత్త ఒరవడికి తీసుకురావటానికి ప్రయత్నం చేశాను. 

∙ప్రభాస్‌తో ‘ఒక్క అడుగు’ సినిమా లేదు. మా గోపీకృష్ణ బ్యానర్‌లో రాధా కృష్ణకుమార్‌ డైరెక్షన్‌లో చేయబోయే సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం అవుతుంది. ప్రభాస్‌ని పెళ్లి గురించి అడిగితే ఇంతకు ముందు ‘బాహుబలి’ సినిమా తర్వాత అనేవాడు. ఇప్పుడు కొంచెం మెత్తపడ్డాడు. పెళ్లి ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడిప్పుడే నా మాట వింటున్నాడు (నవ్వుతూ).

చరిత్రను వక్రీకరించకూడదు
హిందీ చిత్రం ‘పద్మావత్‌’ విషయానికి వస్తే చరిత్రను వక్రీకరించారని రాజ్‌పుత్‌లు ,  సెన్సార్‌ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్ర తీసేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని తీయాలి. ఒక పాపులర్‌ క్యారెక్టర్‌ పేరు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నేను ‘తాండ్రపాపారాయుడు’ తీశాను. అదీ చరిత్రే.. జాగ్రత్తగా తీశాం. వక్రీకరించలేదు. 

వర్మ తీస్తున్న ‘జీయస్టీ’ (గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌) చూసే ప్రేక్షకులు కొంతమంది ఉంటారు. అతని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కదా? సెన్సార్‌ ఉంటుంది. నా సినిమా చూడకపోతే చంపేస్తా అని ఆయనేం అనడం లేదు కదా. మీకు నచ్చితే చూడమంటున్నారు. వాళ్ల కోసం వాళ్లు సినిమా తీసుకునేవాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్ల కోసం సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ కోసం చేసే గోపీకృష్ణ మూవీస్‌ లాంటి బేనర్లూ ఉంటాయి. కేవలం ఇండస్ట్రీ కోసం సినిమా తీసేవాళ్లు ఎక్కువ కాలం ఉండరు. కనుమరుగైపోతారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top