నిసర్గ: 28 వేల మందికి సోనూసూద్‌ సాయం

Sonu Sood Helped 28000 Keep People Safe From Cyclone Nisarga - Sakshi

ఆయన ‘చేతికి ఎముక లేదు’.. సాటి మనుషుల కష్టాలను అర్థం చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.. అసలు ఆ  దాతృత్వ గుణం ముందు ఎవరూ నిలవలేరంటే అతిశయోక్తి కాదు.. ఎందుకంటే కోట్లాది రూపాయలు దానం చేసే మహానుభావులు ఎందరో ఉంటారు.. కానీ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు నేరుగా సాయం అందించే సోనూసూద్‌ లాంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు. లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికుల పట్ల నిజమైన హీరోగా నిలిచిన ఆయన.. తాజాగా తుపాను ప్రభావం నుంచి వేలాది మందిని కాపాడారు. నిసర్గ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. (సోనూసూద్‌పై సీఎం ప్రశంసల జల్లు)

ఈ విషయం గురించి సోనూసూద్‌ పీటీఐతో మాట్లాడుతూ... ‘‘ఈరోజు మనమంతా చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఒకరికొరం అండగా నిలబడి ధైర్యంగా పోరాడాలి. తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో నేను, నా బృందం తీర ప్రాంతాల్లోని దాదాపు 28 వేల మందికి ఆహారం అందించాం. వారిని సమీపంలోని స్కూళ్లు, కాలేజీలు తదితర పునరావాస కేంద్రాలకు తరలించాం. వారంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం’’అని చెప్పుకొచ్చారు. అదే విధంగా నిసర్గ కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన 200 మంది అస్సామీ వలస కార్మికులను షెల్టర్‌ హోంకు తరలించినట్లు వెల్లడించారు. కాగా వలస కార్మికుల తరలింపు విషయంలో చొరవ చూపిన సోనూసూద్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. (సోనూ మనసు బంగారం)

ఈ క్రమంలో సోనూసూద్‌ సాయం పొందిన వారు ఆయనను దేవుడిగా అభివర్ణిస్తున్నారు. ఇక నిసర్గ ప్రమాదం పొంచి ఉన్న తరుణంలోనూ.. ‘‘నిసర్గ కోసం సోనూసూద్‌ ఎదురుచూస్తున్నాడు. వెంటనే దానిని ఇంటికి పంపేస్తాడు’’ అంటూ నెటిజన్లు ఛలోక్తులు విసరగా.. ‘‘రానివ్వండి.. పంపేస్తాను’’ అంటూ అంతే చమత్కారంగా సోనూసూద్‌ బదులిచ్చారు. కాగా అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాను (నిసర్గ)గా మారిన సంగతి తెలిసిందే. ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలోని అలీబాగ్ వ‌ద్ద నిసర్గ తుఫాను బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తీరం దాటే సమయంలో సుమారు 120 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే కొన్ని గంటల్లోనే తుపాను ప్రభావం తగ్గిపోవడంతో ముంబై వాసులు ఊపిరిపీల్చుకున్నారు.(ఇక నుంచి అల‌వాటు చేసుకోండి: హీరో)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top