బాదుతా.. జీరో కాదు!
షారుక్ ఖాన్.. బాలీవుడ్ బాద్షా. సూపర్‌స్టార్. ఒక రెండు, మూడు తరాలను తన వైపుకు తిప్పేసుకున్నపాపులర్ ఫిగర్. అంతకుమించి.. ఇండియన్ సినిమాలో షారుక్ అంటే అదొక బ్రాండ్. చెప్పుకోవడానికి ఇదంతా బాగానే ఉందికానీ షారుక్ ఖాన్‌తో సరితూగే స్టార్డమ్ ఉన్న ఆమిర్ ఖాన్,సల్మాన్ ఖాన్ ఇప్పటికే చెరో రెండేసి 300కోట్ల క్లబ్లో చేరిపోయేసినిమాలనిచ్చారు. సల్మాన్ అయితే మరో వారంలో మూడో 300కోట్ల సినిమా (‘టైగర్ జిందా హై’) కూడా ఇస్తున్నాడు. షారుక్ మాత్రం 200కోట్ల క్లబ్ దగ్గరే ఆగిపోయాడు. ఎప్పటికైనా ఆయన 300కోట్ల క్లబ్లో చేరకపోతాడా అని అభిమానులంతా వెయిటింగ్!!
ఎప్పుడు మొదలైందీ 300కోట్ల క్లబ్..
ఆమిర్ ఖాన్ ‘పీకే’ సినిమాతో మొదలైందీ 300కోట్ల క్లబ్. 2014లో విడుదలైందీ సినిమా. ఆ తర్వాత వెంటనే ‘భజరంగీ భాయ్‌జాన్’తో 300కోట్ల క్లబ్లో ఆమిర్ సరసన చేరిపోయాడు సల్మాన్ ఖాన్. ఇది 2015లో విడుదలైంది. 2016లో ‘దంగల్’, ‘సుల్తాన్’లతో చెరో 300కోట్ల సినిమాలు ఖాతాలో వేసుకున్నారు ఆమిర్, సల్మాన్. 2017లో ‘బాహుబలి 2’ వచ్చేసి ఈ 300కోట్ల క్లబ్‌ను చాలా చిన్న విషయం చేసేసి 500కోట్ల క్లబ్‌ను సృష్టించింది. సరే, ‘బాహుబలి 2’ ఇండియన్ సినిమా ఐకాన్ అనుకుంటే, తాజాగా ‘టైగర్ జిందా హై’తో మరో వారం రోజుల్లో సల్మాన్ మూడో 300కోట్ల సినిమా కొడుతున్నాడు. అంటే, 300కోట్ల క్లబ్ అనేది ఒకటి బాలీవుడ్లో మొదలై మూడేళ్లు అయింది. ఈ గ్యాప్‌లో షారుక్ నటించిన ఐదు సినిమాలొచ్చాయి. అందులో ఒక్కటీ ఈ 300కోట్ల క్లబ్‌కు దగ్గరకు కూడా రాలేకపోయింది. దీంతో షారుక్ పనైపోయింది అంటున్నారంతా! గతేడాది వచ్చిన ‘జబ్ హ్యారీ మెట్ సాజల్’ అయితే ఘోరంగా ఫ్లాప్ అయింది. కనీసం షారుక్ ఫ్లాప్ సినిమా అనే స్థాయిలో కూడా ఆ సినిమా ఆడలేదు. దీంతో అభిమానులు సైతం షారుక్ 300కోట్లు కొడతాడన్న ఆశలు వదిలేసుకున్నారు.
‘జీరో’ ఆశలు.. :
షారుక్ అభిమానుల ఆశలు జీరో అయిపోతే, మళ్లీ ‘జీరో’ వచ్చి కొత్త ఆశలు పుట్టిస్తున్నాడు. ఇక్కడ జీరో షారుక్ కొత్త సినిమా పేరు. ఆ ఆశలకు కారణం, షారుక్ మళ్లీ ప్రయోగం చేయడమే! ఈసారి మరుగుజ్జు పాత్రలో కనిపిస్తూ షారుక్ మెప్పిస్తున్నాడు. కమర్షియల్ సినిమా కమర్షియల్ సినిమా అని ఫార్మాట్‌ను పట్టుకున్న బాలీవుడ్లో, షారుక్‌లాంటి స్టార్ ఇలా ఒక ప్రయోగం చేయడం విశేషమే! మరి ఆ ‘జీరో’ నిలబడతాడా? 300కోట్లు కొడతాడా?
‘జీరో’ జోక్స్..:
జీరో టీజర్ మొన్న విడుదలైంది. దీని మీద వచ్చిన జోక్స్ నంబర్ కాదు జీరో. జీరో మీద వచ్చిన జోక్సే ఇప్పుడు ట్రెండింగ్! ‘షారుక్ సినిమా విడుదలైతే థియేటర్లో ఉండే జనాల సంఖ్య’, ‘షారుక్ సినిమా బాక్సాఫీస్ వసూళ్లివి.’ ఇలాంటి జోక్స్ లెక్కలేనన్ని వినిపిస్తున్నాయి ‘జీరో’ టైటిల్‌నే ఉద్దేశిస్తూ. ఆ జోక్స్ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. దీనంతటికీ కారణం, బాద్షా తన రేంజ్లో ఒక సాలిడ్ బాక్సాఫీస్ హిట్ ఇవ్వకపోవడమే!
మరి ఇన్ని సవాళ్ల మధ్య, ఇన్ని జోక్స్ మధ్య, ఇంత ట్రోలింగ్ మధ్య బాద్షా ‘జీరో’తో అయినా 300కోట్ల క్లబ్లో చేరతాడా? తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించుకుంటాడా? జోక్స్ చేస్తే చేసుకోవచ్చుగాక, కానీ అక్కడ ఉన్నది షారుక్ ఖాన్ అన్నది మరచిపోవద్దు. తన రేంజ్‌కి తగ్గ హిట్ కొడితే షారుక్‌కి ఇదేం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ టైమ్ రావాలి. ‘జీరో’తో ఆ టైమ్ వస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. షారుక్ కూడా నమ్ముతున్నట్లే కనిపిస్తున్నారు. ఈ బాద్షా 300 కోట్లు బాదేట్లే ఉన్నాడు. డిసెంబర్ 21, 2018న విడుదలవుతుంది ‘జీరో’. ఆనంద్.ఎల్ రాయ్ దర్శకుడు. ఆరోజు బాద్షా టైమ్ వస్తుందా? చూడాలి!!