‘నాలో భాగమైన నీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’

Samantha Wishes Hubby On Wedding Anniversary - Sakshi

స్క్రీన్‌పై ఇంత క్యూట్‌గా ఉన్న ఓ జంట... రియల్‌ లైఫ్‌లోనూ జోడీ కడితే ఎంత బాగుంటుందో కదా అంటూ ఆశపడని అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. అవును మీ ఆశ త్వరలోనే నెరవేరుతుందంటూ ఎన్నోసార్లు హింట్‌ ఇచ్చింది ఆ హిట్‌ పెయిర్‌.

హింట్‌ అయితే ఇచ్చింది కానీ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామనే కదా.. సో వీరి బంధం ఎంత కాలం నిలుస్తుందిలే అనే అనుమానాలు రేకెత్తిన సమయంలో.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ... ప్రాణ స్నేహితులైన తాము.. దంపతులుగా మారి జీవితాన్ని పంచుకోబోతున్నామంటూ శుభవార్త చెప్పింది. గతేడాది సరిగ్గా ఇదే రోజున వివాహ బంధంతో ఒక్కటైంది. ప్రేమకు కులం, మతం అడ్డుకాదు... మనసులు కలిస్తే చాలు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే కలిసి జీవించాలనే కోరిక బలంగా ఉంటే చాలు నిరూపించింది ‘చైసామ్‌’  జంట.

పర్సనల్‌ లైఫ్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ ఈక్వల్‌గా..
హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి పెళ్లైన తర్వాత తెరకు దూరమైన తారలు ఎంతో మంది ఉన్నారు. అయితే ముందు నుంచీ చెబుతున్నట్లుగానే సమంత.. పెళ్లి తర్వాత కెరీర్‌ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. అంతేకాదు నటిగానూ ఇంకో మెట్టు ఎక్కారంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. రంగస్థలం, అభిమన్యుడు, మహానటి, యూటర్న్‌ సినిమాల విజయాలే ఇందుకు నిదర్శనం. సెలెక్టివ్‌గా పాత్రలు ఎంపిక చేసుకుంటూ వస్తోన్న సామ్‌.. నెక్ట్స్ భర్త చైతన్యతో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు.

అయితే వీటన్నింటిలో ‘చై’ ఇచ్చిన ప్రోత్సాహం కూడా ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఎంత బిజీగా ఉన్నా భర్త కోసం టైమ్‌ కేటాయిస్తున్నారు సామ్‌. వీలు చిక్కినప్పుడల్లా హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తూ ఇటు పర్సనల్‌ లైఫ్‌ను,  అటు ప్రొఫెషనల్‌ లైఫ్‌నూ సక్సెస్‌ఫుల్‌గా లీడ్‌ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చైసామ్‌లు.

క్యూట్‌ కపుల్‌కి వార్మ్‌ విషెస్‌..
ఈరోజు(అక్టోబరు 6) మొదటి పెళ్లిరోజు జరుపుకొంటున్న ఈ క్యూట్‌ కపుల్‌కి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురుస్తుంది. హాలిడే ట్రిప్‌ పూర్తి చేసుకున్న అనంతరం ఇంటికి చేరుకున్న సామ్‌...‘నా జీవితంలో గొప్ప విషయమేంటంటే నిన్ను చేరడమే. నాలో భాగమైన నా చైకి పెళ్లిరోజు శుభాకాంక్షలు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది చై. శుభాకాంక్షలతో మాపై ప్రేమ కురిపించిన మీ అందరికీ ధన్యవాదాలు. మాపై ఇంతగా ప్రేమానురాగాలు చూపిస్తున్న మీకు ఎల్లప్పుడూ కృతఙ్ఞులుగా ఉంటాము. ఇలాంటి ప్రేమను పొందటాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నాం’  అంటూ పెళ్లి రోజున తమకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top