అప్పట్లో చాలా మదనపడ్డా!

Samantha May Fix Date For Baby - Sakshi

అందులోంచి బయటపడలేక అప్పట్లో చాలా మదనపడ్డాను అని చెప్పుకొచ్చింది నటి సమంత. ఒకప్పటి చెన్నై చిన్నది అయిన ఈ హైదరాబాద్‌ బ్యూటీకి కాస్త ధైర్యం ఎక్కువ. తాను చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఆ తెగువే ఆమెను ఒక పెద్ద కుటుంబంలో కోడల్ని చేసిందని భావించవచ్చు. సమంత నటన జీవితమే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే. కోలీవుడ్‌లో నటిగా పరిచయమై టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి ఈ సుందరి. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న సమంత వివాహానికి ముందు గ్లామర్‌ డాల్‌ పాత్రల్లో నటించినా, ఇప్పుడు నటనకు అవకాశం ఉన్న పాత్రలకే ప్రాధాన్యతనిస్తోంది. ఈమె ఇటీవల నటించిన ఓ బేబీ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది. ప్రస్తుతం తమిళ చిత్రం 96 తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఆదిలో త్రిష నటించిన విన్నైతాండి వరువాయా చిత్ర తెలుగు రీమేక్‌ ఏమాయచేసావేలో నటించి ప్రాచుర్యం పొందిన సమంత. ఇన్నాల్టికి మళ్లీ అదే త్రిష నటించిన 96 చిత్రం తెలుగు రీమేక్‌ చిత్రంలో నటించడం విశేషమే. ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసింది.

కాగా కొత్తగా చిత్రం ఏదీ ఒప్పుకోకపోయినా, ఇక వెబ్‌ సిరీస్‌లో నటించడానికి పచ్చజెండా ఊపింది. కాగా ఇటీవల ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా రంగం మనకు ప్రయోజనకరమైన పాఠాలనే నేర్పిస్తుందని అంది. మొద ట్లో తనకు చాలా అవకాశాలు వచ్చాయని, దాంతో విశ్రాంతి లేకుండా నటించానని చెప్పింది. అలాంటిది వివాహానంతరం కుటుంబమే జీవితంగా మారిందంది. అయినా సినిమాను వదులుకోకూడదని నటిస్తున్నానని చెప్పింది. ఎన్ని సక్సెస్‌లు వచ్చినా ఎదో భారం మోస్తున్నట్లు అనిపించేదని చెప్పింది. ఈ రంగంలోకి వచ్చిన కొత్తలో హీరోయిన్లు అంటే ఇలానే ఉండాలి, ఇలానే నటించాలి లాంటి నిబంధనలు ఉండేవని అంది. అలాంటి ఒక చట్రంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పింది. అయితే అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బయటపడ్డానని చెప్పింది. అందువల్ల ఇంతకు ముందున్న భారం, ఒత్తిడి వంటివంతా పోయాయని చెప్పింది.

సినిమా రంగంలో వచ్చిన మార్పు, తనకు ఏర్పడ్డ అనుభవాలే ఇందుకు కారణం అని సమంత చెప్పింది. మరో విషయం ఏమిటంటే ఈ అమ్మడు వివాహ జీవితంలోకి అడుగుపెట్టి రెండేళ్లు అవుతోంది. దీంతో మీడియా వాళ్లు కలిసినప్పుడల్లా పిల్లలను ఎప్పుడు కంటారు అని ప్రశ్నిస్తున్నారట. అలాంటి ప్రశ్నలు వినీ వినీ విసిగెత్తిపోయిన ఈ చిన్నది ఎట్టకేలకు తను తల్లినవడానికి తేదీని ఫిక్స్‌ అయ్యినట్లుంది. 2022 ఆగస్ట్‌ 7న ఉదయం 7 గంటలకు బిడ్డను కంటానని చెప్పేసింది. అలా పరిహాసంగా చెప్పిందో, లేక తను నిజంగానే అలాంటి నిర్ణయానికి వచ్చిందో తెలియదు గానీ, ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అన్నట్టు ఈ బ్యూటీ ఇటీవల తన పెట్‌ డాగ్‌ పుట్టినరోజును ఆడంబరంగా జరిపింది. భర్త నాగచైతన్యతో పాటు తన మిత్ర సపరివారం ఈ వేడుకలో పాల్గొన్నారు. సమంతానా మజాకా!

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top