త్వరలో నా డ్రీమ్‌ గురించి చెబుతా

Sakshi Special Interview With Manchu Manoj About His Lockdown Moments

మంచు మనోజ్‌ అంటేనే ఎనర్జీ. అది ఆయన సినిమాలు, పాటలలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. మనోజ్‌ అంటేనే సహాయం. ఇబ్బందులు ఉన్న ప్రతీసారి ఎవరో ఒకరికి చేయందిస్తూ కనిపిస్తారు. ఇవాళ మనోజ్‌ పుట్టిన రోజు. బర్త్‌ డేకి స్పెషల్‌ ప్లాన్స్‌ ఏవీ లేవట. కానీ ఈ ఏడాది మొత్తం సూపర్‌ ప్లాన్డ్‌ అంటున్నారు మనోజ్‌. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ప్యాన్‌ ఇండియా సినిమా ‘అహం బ్రహ్మాస్మి’తో తిరిగొస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మనోజ్‌ పంచుకున్న విశేషాలు.

లాక్‌ డౌన్‌లో ఏం చేస్తున్నారు?
చాలా చేస్తున్నాను. లాక్‌ డౌన్‌లో బిజీ అయిపోతానని అనుకోలేదు. తినడం, నిద్రపోవడం కాకుండా మా ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా స్క్రిప్ట్‌కి ఫినిషింగ్‌ టచ్‌లు ఇస్తున్నాం. మ్యూజిక్‌ డిస్కషన్స్‌ చేస్తున్నాం. నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మీద పని చేస్తున్నాను. అది సినిమా కాదు. బయటి ప్రాజెక్ట్‌. హైదరాబాద్‌లోనే ప్రపంచ స్థాయిలో ఒకటి సృష్టించబోతున్నాం. ఈ పనులు కాకుండా మిగతా సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎంత సహాయం చేయగలనో అంతా చేస్తున్నాను.

డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అన్నారు.. ఆ విశేషాలు?
ప్రస్తుతం పని నడుస్తోంది. ఇంకో రెండు మూడు వారాలు, లేదంటే నెలలోపు మీ అందరికీ చెబుతాను.

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ‘అహం బ్రహ్మాస్మి’తో వస్తున్నారు. మనోజ్‌ అంటే ఎనర్జీ. టైటిల్‌ చూస్తుంటే కొంచెం ఆధ్యాత్మికంగా ఉంది.
100% ఆ ఎనర్జీ ఉంటుంది. నువ్వు ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడే నీకు ఆ ఎనర్జీ వస్తుంది. నేను శివుడి భక్తుడిని. ఈ సినిమాలో కుడా శివ భక్తుడి పాత్రలో నటిస్తున్నాను. చాలా స్ట్రాంగ్‌ కథాంశం ఉంటుంది. టైటిల్‌ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థం అవుతుంది.

మనోజ్‌ కేవలం హీరో మాత్రమే కాదు. పాడతారు. రాస్తారు. యాక్షన్‌ కొరియోగ్రఫీ చేస్తారు. ఈ సినిమాకు ఏమేం చేయబోతున్నారు?  
(నవ్వుతూ) ఈ సినిమాకు చాలా తగ్గించుకున్నాను. ఓ పాట పాడాను. అంతే.. అలాగే యాక్షన్‌ నేను, పీటర్‌ హైన్స్‌ మాస్టర్‌ కలసి చేస్తున్నాం. ఇప్పటివరకు నటుడిగా నేనేం చేశానో అందరికీ తెలుసు. ఇంకా ఏం చేయగలమో ఈ సినిమాలో చూపిద్దాం అంటున్నారు పీటర్‌. ఒకే ఒక్క స్టంట్‌కి 6 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆయుధాలు ఏం ఉండవు. చేత్తో కొట్టేసుకోవడమే. ఆ ఫైట్‌ మామూ లుగా ఉండదు.

కరోనా వల్ల సినిమా భవిష్యత్తు ఎలా మారబోతోంది?
మనం మనుషులం. దేన్నైనా అలవాటు చేసుకోగలం. కరోనా తర్వాతి పరిస్థితులకు అనుగుణంగా బతకడం నేర్చుకుంటాం. చిన్న చిన్న రూల్స్‌ అన్నీ పాటిస్తూ బతుకుతాం. మెల్లిగా థియేటర్స్‌ కూడా ఓపెన్‌ అవుతాయి. ఎందుకంటే థియేటర్‌ లేని లోకం ఉండదు. ‘అహం బ్రహ్మాస్మి’ థియేటర్‌లోనే వస్తుంది.

ప్రస్తుతం ఓటీటీలలో సినిమాలు విదుదల చేస్తున్నారు. థియేట్రికల్‌ బిజినెస్‌ని ఏమైనా దెబ్బ తీస్తుంది అంటారా?
అది పక్కన పెడితే, థియేటర్ల పరంగా మోనోపోలీ ఉంది. దీనివల్ల చిన్న సినిమాలవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సమస్య మోనోపోలీ చేస్తున్నవాళ్లకే వచ్చింది. ఇప్పటికైనా అన్నీ సక్రమంగా చేసుకుంటే అందరికీ బావుంటుంది. అయితే చిన్న సినిమాలకు ఓటీటీ అనేది ఓ వరం. పెద్ద హీరో సినిమాలు, మాస్‌ సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. ఆ కిక్కే వేరు.

లాక్‌ డౌన్‌లో మీరు పర్సనల్‌గా నేర్చుకున్నది ఏమైనా ఉందా?
చాలా సహనం వచ్చింది. నా ఫ్రెండ్స్, ఇంకా అందరితో మళ్లీ కనెక్ట్‌ అయ్యే వీలు దొరికింది.

బర్త్‌ డే ప్లాన్స్‌ ఏంటి?
ఏమీ లేవు. ఈ సమయంలో పుట్టినరోజు జరుపుకున్నానంటే నాకంటే మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు. లాక్‌ డౌన్‌ లో కష్టంగా ఉందని చాలామంది అంటున్న సంగతి తెలిసిందే. నాకు ఏం కష్టం ఉంది. ఉండటానికి ఇల్లుంది. హాయిగా తింటున్నా. కానీ మనకు ఇల్లు కట్టిన మేస్త్రి అన్న, నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలు, వాళ్ల కష్టాలు, వాళ్ల పిల్లల కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. సరే కావాల్సిన వాళ్లకు భోజనం పంచుతున్నాం, శానిటైజర్లు పంచుతున్నాం, మనకు తెలిసిన స్నేహితులు, ఫ్యాన్స్‌ అందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. ఇంకేం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి కొన్ని సంస్థలతో కలసి మన వలస కూలీలను సొంత ఊరు పంపేందుకు బస్సులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దేశ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లాలో అవన్నీ ప్లాన్‌ చేసి, అందరి పర్మిషన్లు తీసుకొని వాళ్లకు భోజనం సమకూర్చి, వాళ్లు వాళ్ల సొంత ప్రాంతానికి చేర్చే బాధ్యత నాది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top