నన్ను నేను తయారు చేసుకుంటా!

Sakshi Special Chit Chat with Vikram

సాక్షి, చెన్నై : పాత్రకు తగ్గట్టుగా తనను తాను తయారు చేసుకుంటాని అని అన్నారు నటుడు విక్రమ్‌. సేతు చిత్రంతో నటుడిగా తానేంటో నిరూపించుకున్న ఈ వెర్సటైల్‌ నటుడు తాజా చిత్రం కడారం కొండాన్‌ వరకూ తన నట ప్రస్థానాన్ని దిగ్విజయంగా సాగిస్తూ స్టార్‌గా నాటౌట్‌గా నిలిచారు. ఒక పక్క వారసుడు దృవ్‌ హీరోగా పరిచయం అవుతున్నా, తన మార్కెట్‌ను మాత్రం చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ, ఇంకా చెప్పాలంటే పెంచుకుంటూనే ఉన్నారు. విక్రమ్‌ చిత్రం చేస్తున్నారంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందనే భావన ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ కలుగుతుంది.  పాత్రకు జీవం పోయడానికి ఎంతదాకా అయినా వెళ్లే అతి కొద్ది మంది నటుల్లో విక్రమ్‌ ఒకరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. సేతు, అన్నియన్‌ (తెలుగులో అపరిచితుడు), ఐ లాంటి చిత్రాలే అందుకు చిన్న ఉదాహరణ. తాజాగా కడారం కొండాన్‌ చిత్రం కోసం అదే కృషి, అదే శ్రమ. అబ్బా ఏం మనిషండీ ఈయన పాత్ర కోసం ఇంతగా తపిస్తారా అని విస్మయం చెందేంతగా ఎఫర్ట్‌ పెడతారు. విశ్వనటుడు కమలహాసనే తాను పోషించాల్సిన పాత్రను విక్రమ్‌తో చేయించారంటే నటుడిగా ఈయనకు ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్‌ ఉండదేమో.అవును తాను పోíషించాల్సిన కడారం కొండాన్‌ చిత్రంలో విక్రమ్‌ను నటింపజేసి, నిర్మాత బాధ్యతను తీసుకుని కమలహాసన్‌ ఆనందించారు. కమలహాసన్‌ రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ, ట్రైడెంట్స్‌ ఆర్ట్స్‌ రవీంద్రన్‌ కలిసి నిర్మించిన కడారం కొండాన్‌ చిత్రంలో విక్రమ్, అక్షరహాసన్, అభిసరవణన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం  విక్రమ్‌ ఫిట్‌నెస్‌ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గుండెలపై సగభాగం టాటూలతో నింపి, పెప్పర్‌స్టాల్ట్‌ గెటప్‌ చాలా కొత్తగా కనిపిస్తారు. రాజేశ్‌.ఎం.సెల్వ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 19వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విక్రమ్‌తో సాక్షి చిట్‌చాట్‌.

ప్ర: కడారం కొండాన్‌ చిత్రం గురించి?
జ: ఇది అండర్‌ కవర్‌ ఏజెంట్‌ ఇతివృత్తంతో సాగే కథా చిత్రం. మలేషియా నేపథ్యంగా సాగే కథలో ఆ ఏజెంట్‌ విజయ సాహసాలే కథనం. నాది గ్రే షేడ్స్‌ కలిగిన పాత్రలా ఉంటుంది.

ప్ర: మీ చిత్రాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ చిత్రంలో స్పెషల్‌?
జ: నా గెటప్‌నే ఇందులో ప్రత్యేకత. ఇది ఒక్క రోజులో జరిగే కథ కాబట్టి చిత్రంలో చాలా వేగం ఉంటుంది.

ప్ర: మీ గెటప్‌లు కొత్తగా ఉంటాయి. వాటికి ఇన్‌స్పిరేషన్‌లాంటివేవైనా ఉంటాయా?
జ: అలాంటిదేమీలేదు. ఖాళీ సమయాల్లో గుండు కొట్టించుకోవడం వంటివి కొత్తదనం కోసం ఏదో ఒకటి  ప్రయత్నిస్తుంటాను. కొత్త చిత్రాల్లో పాత్రలకు వాటిని ఉపయోగిస్తుంటాను. అలా ఈ చిత్రంలో గెటప్‌ను నాకు నేను తయారు చేసుకున్నదే. ఈ గెటప్‌ను చూసిన కమలహాసన్‌ సూపర్‌గా ఉందని దర్శకుడు రాజేశ్‌తో చెప్పారు.

ప్ర: తరచూ బరువు తగ్గడం, పెరగడం లాంటివి చేస్తుంటారు. ఎలా సాధ్యం?
జ: ఆహార నియమాలు, కసరత్తులు చేస్తుంటాను. సేతు చిత్రం సమయంలో అయితే వరి అన్నమే తినలేదు. రోజూ ఉదయం సగం గుడ్డు, అరటి జ్యూస్, మధ్యాహ్నం ఫ్రై చేసిన చేప ముక్కను కాయగూరలతో కలిసి తినేవాడిని. అంతే ఆహారం. నిత్యం 8 కిలోమీటర్లు నడక. ఉదయం 5 గంటలకు షూటింగ్‌కు సెట్‌కు వెళితే రాత్రి 11 గంటలకు తిరిగి వచ్చే వాడిని, అలా ముందుగా సెట్‌కు వెళ్లి చివరిగా తిరిగొచ్చే వ్యక్తిని నేనే. నా బరువెంతో తెలుసా? 52 కిలోలే. అసలు 50 కిలోలకు తగ్గాలనుకున్నాను కానీ, డాక్టర్‌ వద్దని సలహా ఇచ్చారు. ఈ కడారం కొండాన్‌ చిత్రం కోసం నెల రోజుల ముందు నుంచే ప్రిపేర్‌ అయ్యాను.

ప్ర: ఎవరి నటనను ప్రశంసించని కమలహాసన్‌ కడారం కొండాన్‌ చిత్రంలో మీ నటనను అభినందించడం గురించి మీ స్పందన?
జ: ఆశీర్వాదంగానే భావిస్తాను. కమలహాసన్‌ నా నటనను అభినంధించడం  నిజంగా గొప్ప అవార్డు కంటే మిన్న. నేను చదువుకునే రోజుల్లోనే కమలహాసన్‌ అభిమానిని. ఆ తరువాత కళాశాల చదువు స్థాయికి చేరిన తరువాత రజనీకాంత్‌ అంటే ఇష్టం ఏర్పడింది.

ప్ర: కమలహాసన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే నటిస్తారా?
జ: కచ్చితంగా. నిర్మాత,దర్శకుడు చిత్రంలో నటించే అవకాశం రావాలని కోరుకుంటాను.

ప్ర: తదుపరి చిత్రాల గురించి?
జ: ఆగస్ట్‌ నుంచి అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించనున్నాను. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటిస్తాను.

ప్ర: మణిరత్నం చిత్ర షూటింగ్‌ రెండేళ్ల పాటు జరగునుందంటున్నారు?
జ: లేదు లేదు. నేను నాలుగు నెలలు కాల్‌షీట్స్‌ కేటాయించాను. మొత్తం 8 నెలలో చిత్రం పూర్తి అవుతుంది.

ప్ర: మహావీర్‌ కర్ణ చిత్రం ఏమైంది?
జ: అది బ్రహ్మాండ చిత్రం. ఇప్పటికే ప్రారంభం కావలసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల జాప్యం జరుగుతోంది. ఈ చిత్రం కోసం ఆగస్ట్‌లో తన కాల్‌షీట్స్‌ అడిగారు. అయితే తాను అజయ్‌ జ్ఞానముత్తు చిత్రానికి ఆ కాల్‌షీట్స్‌ కేటాయించడంతో అది సాధ్యం కాలేదు. మణిరత్నం చిత్రం కూడా పూర్తి అయిన తరువాతనే మహావీర్‌ కర్ణ చిత్రం ఉంటుంది.

ప్ర: కడారం కొండాన్‌ చిత్రం ఆంగ్ల చిత్రం తరహాలో ఉంటుందంటున్నారు. హాలీవుడ్‌ చిత్రాల్లో నటించే అలోచన ఉందా?
జ: నిజం చెప్పాలాంటే ఇప్పుటికే రెండు మూడు హాలీవుడ్‌ చిత్రాల అవకాశాలు వచ్చాయి. అయితే ఆ కథలు నచ్చకపోవడంతో అంగీకరించలేదు. మంచి కథ అయితే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తా. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top