9X3= 27 ఆణిముత్యాలు

9X3= 27 ఆణిముత్యాలు - Sakshi


రెడీ...యాక్షన్...టేక్. రఘుపతి వెంకయ్య నుంచీ రాజమౌళి దాకా.... ‘విజయా’ నాగిరెడ్డి నుంచి ‘దిల్’ రాజు దాకా... నాగయ్య గారి నుంచి నాని దాకా... తెలుగు సినిమా చరిత్రలో, ఎన్నో తళతళలు... మిలమిలలు... సూపర్‌హిట్లు.... బ్లాక్‌బస్టర్లు... ‘సాక్షి’ 8 వసంతాలుగా విజయవంతంగా సినీ ప్రేక్షకుల హృదయ కలెక్షన్లు కొల్లగొట్టి, 9వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, మన ఘనతను చాటే మూడు కోవల నుంచి తొమ్మిదేసి ఆణిముత్యాలను అందిస్తున్నాం.  ఈ వేసవి సెలవుల్లో పిల్లలకూ నచ్చే ఈ చిత్రాల్ని కుటుంబ సమేతంగా తిలకించండి. ఆస్వాదిస్తూ, ఆనందించండి.

 

 పౌరాణికాలు

 1.మాయాబజార్ (1957)

 ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్, గుమ్మడి ముఖ్యతారలు, కె.వి.రెడ్డి దర్శ కుడు, నాగిరెడ్డి-చక్ర పాణి నిర్మాతలు.  జగమెరిగిన సినిమా. భారతంలో లేని కథ. పాత్రలన్నీ పేరుకు పురాణమైనా, అచ్చంగా మేనమామ, మేనత్తల పిల్లల చుట్టూ తిరిగే కుటుంబకథ. ఆస్తులు, అంతస్తులు, అనుబంధాలు, అసూయ, పౌరుష ప్రతాపాల చుట్టూ నడిచే మన ఇళ్లలో కథ. రిలీజై 70 ఏళ్లవుతున్నా, ఎక్కడా బోర్ కొట్టని, ఆల్‌టైమ్ ఎంటర్ టైనర్. పెద్దలూ పిల్లలై ఆస్వాదించే అరుదైన మ్యూజికల్, స్క్రీన్ మ్యాజిక్.

 

 2.భూకైలాస్ (1958)

 ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, జమున ముఖ్యతారలు. కె.శంకర్ దర్శకుడు. ఏవీ మెయ్యప్పన్ నిర్మాత.  ఆ రోజుల్లోనే అరుదైన మల్టీస్టారర్. ఏయన్నార్ నారదుడైన సినిమా. ప్రసిద్ధ కన్నడ నాటకం. తెలుగు, తమిళాల్లో తెరపై ఎన్నిసార్లొచ్చినా సూపర్‌హిట్. సీనియర్ సముద్రాల ‘దేవదేవ ధవళాచల’ లాంటి గీతాలు నేటికీ హిట్టే. ప్రతి శివరాత్రికీ బుల్లితెరపై సినీ నైవేద్యం.  

 

 3.    లవకుశ (1963)

 ఎన్టీఆర్, అంజలీదేవి, కాంతారావు, నాగయ్య ముఖ్యతారలు. సి.పుల్లయ్య , ఆయన కుమారుడు సీఎస్.రావు దర్శకులు. శంకర్‌రెడ్డి నిర్మాత.  ఇదీ తెరపైకి నడిచొచ్చిన నాటకమే. 1934లో వచ్చిన ‘లవకుశ’ బళ్లు కట్టుకొని వచ్చి మరీ జనం చూసిన తొలి తెలుగు శతదినోత్సవ హిట్టయితే, ఈ ఎన్టీఆర్ ‘లవకుశ’ వజ్రోత్సవం జరుపుకొన్న తొలి మెగాహిట్. దక్షిణాదిలో తొలి కోటి రూపాయల వసూలు చిత్రమూ ఇదే. జనం మెచ్చే పాటలు, పిల్లలు మెచ్చే అంశాలెన్నో. తాజా బాపు -రమణల ‘శ్రీరామరాజ్యం’కి స్ఫూర్తి.

 

 4.నర్తనశాల (1963)

 ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్ తారలు. కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. శ్రీధర్‌రావు-లక్ష్మీరాజ్యం నిర్మాతలు.  భారతంలోని విరాటపర్వానికి అద్భుత దృశ్యరూపం. ‘బాషా’, ‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’ లాంటి అనేక చిత్రాల్లో హీరో అజ్ఞాతంలో గడిపే కాన్సెప్ట్ ఈ కథలోదే. కీచకుడిగా ఎస్వీఆర్ నటన అంతర్జాతీయంగానూ అదుర్స్. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పేడివాడిగా పూర్తి నిడివి పాత్ర చేసిన అపూర్వ సాహసం. అఖిల భారతస్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన ఏకైక తెలుగు సినిమా. ‘జననీ శివకామినీ’ గీతం ఇవాళ్టికీ మన ఇంటింటా పాడే హారతి పాట. మహామహులకైనా జీవితంలో కష్టాలు తప్పవనీ, నిరుత్సాహపడకుండా ముందుకు సాగితే విజయం తథ్యమనీ చెప్పే సినీ జీవితపాఠం.

 

 5.    భక్త ప్రహ్లాద (1967)

 ఎస్వీఆర్, అంజలీదేవి, బేబీ రోజారమణి తారలు. సీహెచ్.నారాయణమూర్తి దర్శకుడు. ఏవీ మెయ్యప్పన్ నిర్మాత.  తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932) నుంచి ముచ్చటగా మూడోసారి తెరపైకొచ్చిన కథ. ప్రతిసారీ జననీరాజనమే. తర్వాతి కాలంలో హీరోయినైన రోజారమణి ముద్దొచ్చే నటన, స్పష్టమైన డైలాగ్ డెలివరీ, పాటలు - ఇవాళ్టికీ పిల్లలకు మంచి అనుభవం. పట్టుదల, ఏకాగ్రత, దైవభక్తి, పాపభీతి లాంటివన్నీ పిల్లలకు నేర్పే సినీ చదువు.  

 

 6.సంపూర్ణ రామాయణం (1971)

 శోభన్‌బాబు, చంద్రకళ, ఎస్వీఆర్, అర్జా జనార్దనరావు తారలు, బాపు దర్శకుడు. నిర్మాత నిడమర్తి పద్మాక్షి.  రామాయణం పిల్ల్లలకు చెప్పాలనుకుం టున్నారా? చదవట్లేదని చింతపడుతున్నారా? హాయిగా ఈ సినిమా చూపిం చండి. అరటి పండు వలిచి మరీ, నోట్లో పెట్టినట్లుంటుంది. శివధనుర్భంగం, హనుమంతుడి లీలలు, కుంభకర్ణుణ్ణి నిద్రలేపడం, బాణాలు, యుద్ధాలు - ఇవన్నీ ఇవాళ్టి హ్యారీపోటర్ తరం చూసి ఆనందించే ట్రిక్ ఫోటోగ్రఫీ ఎఫెక్ట్స్. రాముడిగా శోభన్‌బాబు అందం వా..వ్.   

 

 7.బాల భారతం (1972)

 ఎస్వీఆర్, కాంతారావు, అంజలీదేవి, చంద్రకళ ముఖ్యతారలు. కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. సీహెచ్. ప్రకాశరావు నిర్మాత.  మీ పిల్లలకు భారతాన్ని పరిచయం చేయడానికి ఇంతకు మించి మార్గం ఇంకొకటి లేదు. పైగా చిన్ననాటి కౌరవ, పాండవ జీవిత ఘట్టాలన్నీ చూపే ఈ సిన్మాలో ఆ పాత్రలన్నీ పిల్లలే వేశారు.సిన్మా పౌరాణికమైనా, ‘మానవుడే మహనీయుడు’ పాట మనిషి శక్తినీ, యుక్తినీ గుర్తు చేసే అద్భుత అభ్యుదయ గీతం. మనపై మనకి నమ్మకం కల్గించే ఘట్టాలెన్నో.

 

 8.యశోద కృష్ణ (1975)

 ఎస్వీఆర్, జమున, రామకృష్ణ, శ్రీధర్, కృష్ణకుమారి, వరలక్ష్మితారలు, సీఎస్.రావు దర్శకుడు. సీహెచ్ ప్రకాశరావు నిర్మాత.   తల్లీ బిడ్డల ప్రేమ తత్వాన్ని చాటిచెప్పే సిన్మా. పూర్తిగా భాగవతం మీద వచ్చిన మంచి చిత్రాల్లో ఒకటి. పిల్లలిష్టపడే శ్రీ కృష్ణ లీలలన్నీ తెరపై చూపిం చవచ్చు. యశోదగా జమున, కంసుడిగా ఎస్వీఆర్, కృష్ణుడిగా రామకృష్ణ నటన మర్చిపోలేం.  

 

 9.దానవీర శూరకర్ణ (1977)

 ఎన్టీఆర్, బి.సరోజ, సత్యనారాయణ, ధూళిపాళ తారలు. కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం ఎన్టీఆర్‌వే.  ఇప్పటికీ దేశంలోకెల్లా అత్యధిక నిడివితో ప్రదర్శితమైన, అవుతున్న సినిమా ఇదొక్కటే (4గంటల 7 నిమిషాలు). కర్ణుడు, సుయోధనుడు, కృష్ణుడు - 3 పాత్రలతో సినిమా అంతా ఎన్టీఆరే. అయినా, నోరప్పగించి చూస్తాం. కొండవీటి వెంకటకవి రాసిన సంభాషణల్ని ఎన్టీఆర్ అపూర్వ వాచికాభినయ విన్యాసంతో చెవులప్పగించి వింటూనే ఉంటాం. ఎల్పీలు, క్యాసెట్స్, సీడీలు, ఇవాళ ఆన్‌లైన్‌లోనూ ఈ డైలాగ్స్‌ను జనం కొంటూనే ఉన్నారు. ‘ఏమంటి వేమంటి వేమంటివీ...’ ఇవాళ్టికీ మొబైల్స్‌లో పాపులర్ డయలర్ టోన్. చరిత మరువని సూపర్‌హిట్ విన్యాస చాతుర్యం ఈ సినిమా. తెలుగు సినీ పౌరాణిక యుగానికి ఒక ఘనమైన వీడ్కోలు.

 

 జానపదాలు

 1.కీలుగుర్రం (1949)

 ఏయన్నార్, అంజలీ దేవి తారలు.నిర్మాత, దర్శకుడు మీర్జాపురం రాజా. గుర్రంపై గాలిలో ఎగరడం లాంటి కథల్ని ఆనాడే చూపిన సూపర్‌హిట్.

 

 2.గుణసుందరి కథ (1949)

 కస్తూరి శివరావు, జూనియర్ శ్రీ రంజని, రేలంగి. నిర్మాణం, దర్శకత్వం కె.వి.రెడ్డి. షేక్‌స్పియర్ నాటకం ఆధారంగా అల్లుకున్న ఈ సూపర్‌హిట్ కథ కమెడియ న్ శివరావును హీరోను చేసింది.

 

 3.పాతాళ భైరవి (1951)

 ఎన్టీఆర్, ఎస్వీఆర్, మాలతి, సీఎస్సార్ తారలు. కె.వి.రెడ్డి దర్శ కుడు. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలు. తెలుగు, తమిళ, హిందీ 3 భాషల్లో తీశారు. హిట్. ‘సాహసం సేయరా డింభకా’ అన్నది డైలాగ్ కాదు... జీవితసూత్రంగా మార్చేసిన సినిమా.

 

 4. జగదేకవీరుని కథ (1961)

  ఎన్టీఆర్, బి. సరోజాదేవి తారలు. నిర్మాత, దర్శకుడు: కె.వి. రెడ్డి. తమిళ హిట్ ‘జగదల ప్రతాపన్’ను ఆధారంగా చేసుకొన్నా, అద్భుతంగా అల్లుకున్న తెలుగు కాశీమజిలీ కథ. ఈ తెలుగు సూపర్‌హిట్ 6 భాషల్లో (బెంగాలీ, ఒరియా, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ) అనువాదమై, అక్కడా విజయవంతమైన సూపర్‌హిట్ కథ.

 

 5. గురువును మించిన శిష్యుడు (1963)

 కాంతారావు, కృష్ణకుమారి, ముక్కామల తారలు. నిర్మాణం, దర్శకత్వం బి.విఠలాచార్య. మాయలు, మంత్రాలతో సినిమాలు తీయడ మనే బాక్సాఫీస్ ఫార్ములాకు పేటెంట్ హక్కులంటే విఠలాచార్యవే. కత్తి కాంతారావుకు స్టార్ స్టేటస్ తెచ్చిన సిన్మా ఇప్పుడూ ఎంటర్‌టైనరే.   

 

 6. జ్వాలాద్వీప రహస్యం (1965)

 కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, ముక్కామల తారలు. బి. విఠలాచార్య దర్శకుడు.  .మల్లికార్జునరావు నిర్మాత. ఈ తరానికి చెప్పాలంటే, విఠలాచార్య ‘హాలీవుడ్ స్పీల్‌బర్గ్’. ఈ సినిమా అందుకో మచ్చుతునక.  

 

 7.జగన్మోహిని (1978)

 నరసింహరావు, ప్రభ, జయమాలిని తారలు. నిర్మాణం, దర్శకత్వం: బి.విఠలాచార్య. ఇప్పటి హారర్ కామెడీలకు మూలం ఇదేననాలి. భూతాలతో కామెడీ పండించిన దక్షిణాది సూపర్‌హిట్.

 

 8.సింహాసనం (1986)

 కృష్ణ, జయప్రద, మందాకిని, అమ్జాద్‌ఖాన్, తారలు. నిర్మాణం, దర్శకత్వం కృష్ణ. తెలుగులో తొలి 70 ఎం.ఎం. సిన్మా. దర్శకుడిగా కృష్ణకు తొలి సిన్మా. హిందీలో జితేంద్రతోనూ హిట్.

 

 9.భైరవద్వీపం (1994)

 బాలకృష్ణ, రోజా తారలు. సింగీతం శ్రీనివాస రావు దర్శకుడు. బి.వెంకట్రామ రెడ్డి నిర్మాత. తెలుగులో పూర్తిస్థాయి కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన ఆధునిక జానపదం. ఇవాళ్టి పిల్లలకు కూడా ఎంటర్‌టైనర్.   

 

   జీవితకథలు

 1. భక్త పోతన (1942)

 నాగయ్య, గౌరీనాథశాస్త్రి, లింగమూర్తి ముఖ్య తారలు. కె.వి. రెడ్డి దర్శకుడు. బి.ఎన్. రెడ్డి నిర్మాణ పర్యవేక్షకుడు. తేటతెలుగులో ప్రజలకు భాగవత సుధలందించిన సహజకవి బమ్మెర పోతన జీవితానికి తెర రూపం. దర్శక దిగ్గ జంగా ఎదిగిన కె.వి. రెడ్డికి ఇదే తొలి సినిమా. ఈ సినిమా చూసి, ముమ్ముడివరంలో ఓ పశువుల కాపరి ‘బాలయోగి’ అయ్యాడు.   

 

 2. త్యాగయ్య (1946)


 నాగయ్య, లింగమూర్తి, గుబ్బి జయమ్మ ముఖ్యతారలు. నిర్మాణం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం నాగయ్య.  నాగయ్య దర్శకత్వంలో తొలి సినిమా. దక్షిణాది అంతటా తన కీర్తనలతో సంగీతామృతం పంచిన తెలుగు బిడ్డ త్యాగయ్య జీవితానికి అద్భుత చిత్రీకరణ. త్యాగయ్య జీవిత పరిచయానికి మంచి పాఠం.

 

 3. యోగి వేమన (1947)

 నాగయ్య, లింగమూర్తి,రాజమ్మ తారలు. నిర్మాత, దర్శకుడు కేవి రెడ్డి. వేమన మాటవిననివారు, ఆయన పద్యం తెలియనివారు తెలుగునాట అరుదు. భోగలాలసత్వంతో మొదలై జీవిత వేదాంతాన్ని గ్రహిం చిన మారినమనిషి వేమన. తెలుగువాడైన ఈ అభ్యుదయవాది జీవితాన్ని తెరపై పరిచయం చేసిన సినిమా. భద్రాచల రామదాసుకు గుడి కట్టిన తెలుగువారి పుణ్యపేటి ‘భక్త రామదాసు’ జీవితచిత్రణకీ నాగయ్యను పురికొల్పింది. ‘కథానాయిక మొల్ల’, ‘తరిగొండ వెంగమాంబ’ లాంటి తెలుగు కవుల సినీ జీవితచిత్రణలకు ఇదో ప్రేరణ.

 

 4. అల్లూరి సీతారామరాజు (1974)

 కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి ముఖ్య తారలు. వి. రామచంద్రరావు దర్శకుడు. జి. ఆదిశేషగిరిరావు, జి. హనుమంతరావు నిర్మాతలు.  బెంగాలీలకి ఒక సుభాష్ చంద్రబోస్. తెలుగువారికి ఒక మన్యం వీరుడు రామరాజు. ఇవాళ్టికీ మనం తలెత్తుకొని చూసే స్వాతంత్య్ర సమరయోధుల జీవితకథా చిత్రాల్లో మొదటి తెలుగు సినిమా ఇది. హీరో కృష్ణ సాహసకెరీర్‌లో మణిమాణిక్యం. కలర్‌లో తొలి తెలుగు సినిమాస్కోప్ చిత్రం. కృష్ణకి 100వ చిత్రంగా ఆల్‌టైమ్ హిట్.



 5. మహాకవి క్షేత్రయ్య (1976)

 ఏఎన్నార్, అంజలీదేవి, మంజుల తారలు. ఆదుర్తి సుబ్బారావు, సీఎస్.రావు దర్శకులు. ఆదినారాయణరావు నిర్మాత.  కృష్ణా తీరం నుంచి వెళ్ళి, తమిళదేశం దాకా కీర్తి ప్రతిష్ఠల్ని విస్తరించిన అచ్చతెలుగు పదకవితా పట్టభద్రుడు క్షేత్రయ్య. సంగీత, సాహిత్యాలతో నృత్యాభినయానికి అనువుగా క్షేత్రయ్య అల్లిన పదాలు, మన తెలుగువారి ఘనకీర్తి పిన్నపెద్దలకు తెలిపే సాధనమీ సిన్మా.

 

 6. ఆంధ్రకేసరి (1983)

 విజయ్‌చందర్, మురళీమోహన్ ముఖ్యతారలు. తిరుమలై- విజయ్‌చందర్ దర్శకులు. ఎస్. చిట్టిబాబు నిర్మాత.  జాతీయఖ్యాతి పొందిన తెలుగు రాజకీయ నేతలపై వచ్చిన ఏకైక సిన్మా. బ్రిటీష్‌వారి తూటాలకు రొమ్ము ఎదురొడ్డిన టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఇవాళ్టికీ స్ఫూర్తే. ఆయన జీవితాన్ని ఆయన మనుమడే నిర్మించి, నటించడం అరుదైన చరిత్ర.   

 

 7. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984)

 ఎన్టీఆర్, బాలకృష్ణ తారలు. ఎన్టీఆర్ దర్శకుడు. హరికృష్ణ నిర్మాత.   జనం బళ్ళు కట్టుకొని, తండోపతండాలుగా వచ్చి చూసిన సంచలన హిట్. భవిష్యత్తును ముందే చెప్పిన మన తెలుగు కాలజ్ఞాన రచయిత జీవితానికి అపూర్వ చిత్రరూపం. వసూళ్లలోనూ ఆల్‌టైమ్ హిట్.  

 

 8. కొమరం భీమ్ (1990)

 భూపాల్‌రెడ్డి, మౌనిక ముఖ్యతారలు. దర్శక, నిర్మాత అల్లాణి శ్రీధర్.  ఆదిలాబాద్ గిరిజన ప్రాంతంలో నిజామ్ పీడనకు వ్యతిరేకంగా పోరాడిన మన్యం వీరుడి జీవితానికి అల్లాణి అపురూప దృశ్యరూపం.

 

 9. అన్నమయ్య (1997)

 నాగా ర్జున, సుమన్, రమ్యకృష్ణ తారలు. కె. రాఘవేంద్రరావు దర్శకుడు. వి.దొరస్వామిరాజు నిర్మాత. భక్తిరస ప్రధానంగా తీసిన జీవిత కథ. తెలుగులో పదకవితా పితామహుడైన అన్నమయ్య గీతాల పట్ల తెలుగునాట మళ్లీ ఆసక్తి పెంచిన చిత్రం.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top