నేను వేధింపులకు గురయ్యాను : నటుడు

Saif Ali Khan Said He Also Facing Harassment - Sakshi

చిత్ర పరిశ్రమలో తానూ వేధింపులు ఎదుర్కొన్నానని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌. ‘మీటూ’ ఉద్యమం ఉధృతం అవుతున్న నేపథ్యంలో సైఫ్‌ తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో  వెల్లడించారు. ‘25 ఏళ్ల క్రితం చిత్ర పరిశ్రమలో నేనూ వేధింపులు ఎదుర్కొన్నాను. కానీ అవి లైంగిక పరమైనవి కావు. కానీ వాటి గురించి ఇప్పుడు తలుచుకున్నా నాకు ఒళ్లు మండిపోతుంది. పని చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడటం కోసం ప్రయత్నించే మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం నిజంగా సిగ్గు చేటు. ఇక నుంచైనా మహిళలను జాగ్రత్తగా చూసుకోవాలి’ అని తెలిపారు.

అంతేకాక ‘కేసులు పాతవే అయినా నిందితులకు శిక్ష పడాల్సిందే. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఏం జరిగినా అది మన మంచికే. ఎందుకంటే కేవలం మాటలే కాదు చేతలు కూడా కనిపిస్తున్నాయి. చేసిన తప్పులు బయట పడుతుండడంతో ఉద్యోగాలు పోతున్నాయ్‌. ఇతరుల పట్ల ఏం జరిగిందో నాకు తెలీదు కానీ నా ముందు ఎవరైనా ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తే ఊరుకోను. ఒక వేళ ఎవరైనా నా కూతరుతో ఇలా ప్రవర్తించాలని భావిస్తే అందుకు వారు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరైనా నా కూతుర్ని అవకాశాల పేరిట హోటల్‌ లాంటి చోట్లకు పిలిస్తే తోడుగా నేను వెళతాను. వారి ఉద్దేశం తప్పని తెలిస్తే వారి మొహం పగలగోడతాను. తరువాత విషయాలు కోర్టులో చూసుకుంటాను. ఇది మీకు తప్పుగా అనిపించినా నేను మాత్రం ఇలానే ప్రవర్తిస్తాను’ అన్నారు.

ప్రతి మహిళకు ఇలాంటి రక్షణే కల్పించాలి. ప్రస్తుతం వచ్చిన పరిణామం చాలా మంచిది. కనీసం ఇప్పటికైనా బాధితులు వారికి జరిగిన అన్యాయం గురించి తెలియజేస్తున్నారు అన్నారు. అంతేకాక ఇప్పటివరకు ‘మీటూ ఉద్యమం’లో ఎవరి పేర్లైతే బయటికి వచ్చాయో భవిష్యత్తులో వారితో కలిసి పనిచేయనని సైఫ్‌ వెల్లడించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top