కథ కోల్‌కతాకు చేరింది

RRR Next Schedule In Kolkata - Sakshi

మొదలుపెట్టడం కొంచెం ఆలస్యం అయిందేమో కానీ, ఒక్కసారి స్టార్ట్‌ అయ్యాక నాన్‌స్టాప్‌ అంటోంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ఇది. ఈ చిత్రం షూటింగ్‌ షెడ్యూల్స్‌కు పెద్ద గ్యాప్‌ ఇవ్వడమే లేదు. హైదరాబాద్‌లో ఓ పెద్ద షెడ్యూల్‌ ముగించిన వెంటనే కోల్‌కత్తా షిప్ట్‌ అవ్వడానికి రెడీ అయ్యారట. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). డీవీవీ దానయ్య నిర్మాత.  ఈ చిత్రం షూటింగ్‌ మొన్నటి వరకూ హైదరాబాద్‌ నగరా శివార్లలో, ప్రముఖ స్టూడియోల్లో వేసిన సెట్లలో జరిపారు.

ప్రస్తుతం కోల్‌కత్తా షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. ఈ షెడ్యూల్‌ దాదాపు 40 రోజుల పాటు సాగనుందట. ఈ షెడ్యూల్‌లో మొదట ఎన్టీఆర్‌ జాయిన్‌ అవుతారని, ఎక్కువ శాతం తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణే ఉంటుందని సమాచారం. ఆ తర్వాత చరణ్‌ కూడా జాయిన్‌ అవుతారు. పీరియాడికల్‌ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ బందిపోటుగా, రామ్‌చరణ్‌ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారని బోగట్టా. సముద్రఖని ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్, పరణీతీ చోప్రా హీరోయిన్లుగా ఎంపికయ్యారట. 2020లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top