ఆ అబ్బో... అనేది ఇంటర్‌నేషనల్‌ లెవల్లో వినిపించింది – కృష్ణంరాజు

Rebel Star Krishnam Raju Speech At Saaho Pre Release Event - Sakshi

‘‘హాలీవుడ్‌ సినిమాలతో పోటీ పడగల గొప్ప సినిమా ‘సాహో’ అని చాలామంది ఫోన్లు చేశారు. ప్రభాస్‌తో ఈ సినిమా గురించి ‘ఏం కంగారు పడొద్దు. నీ కష్టానికి తగ్గట్టు ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది’ అని చెప్పాను. ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అని కృష్ణంరాజు అన్నారు. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మించారు. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటించారు.ఈ నెల 30న రిలీజ్‌ కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘సాహో’ ఫస్ట్‌ టీజర్‌ రిలీజ్‌ అయినప్పుడు చాలా ఫోన్లు వచ్చాయి. ప్రభాస్‌ ఇంకా కనిపించాలన్నారు. ఆ తర్వాత విడుదల చేసిన పోస్టర్లు బాగున్నాయన్నారు. టీజర్‌కు ఆహో.. ఓహో అన్నారు. ట్రైలర్‌ విడుదల తర్వాత అబ్బో అన్నారు. ఆ అబ్బో అనేది ఇంటర్‌నేషనల్‌ లెవల్‌కి వెళ్లింది. ఇంటర్‌నేషనల్‌  స్టంట్‌ మాస్టర్‌ కెన్నీ బెట్స్‌.. ‘కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ లేకుండా కొన్ని ఫైట్స్‌ని ప్రభాస్‌ బాగా చేశాడు’ అన్నారు. చాలా హ్యాపీ. ప్రభాస్‌ చాలా కష్టపడ్డాడు. నా అనుభవంతో చెబుతున్నా.. 150 పర్సెంట్‌ ఏం తేడా ఉండదు. సినిమా విడుదల తర్వాత సుజిత్‌ ఇంటర్‌నేషనల్‌ డైరెక్టర్‌ అవ్వాలని రాజమౌళిగారు ఆశీర్వదించారు. నేను తథాస్తు అంటున్నాను. వంశీ, ప్రమోద్‌లు చాలా కష్టపడ్డారు’’ అన్నారు కృష్ణంరాజు.

ప్రభాస్‌ మాట్లాడుతూ – ‘‘ఫ్యాన్స్‌.. డై హార్డ్‌ ఫ్యాన్స్‌..’ డైలాగ్‌ రాసింది సుజితే. తనకి మాస్‌ పల్స్‌ తెలుసు. కెమెరామేన్‌ మదిగారు యూవీ ఫ్యామిలీలో ఒకరు అయిపోయారు. సాబు సిరిల్‌గారిని ఈ సినిమా చేయమని నేనే అడిగాను. నన్ను ఎగై్జట్‌ చేస్తేనే చేస్తాను అన్నారు. నచ్చింది.. చేశారు. టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌. అనిల్‌ ఠాడానీగారే ‘బాహుబలి’ సినిమాను హిందీలో డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ‘సాహో’కు ఫస్ట్‌ డే నుంచి సపోర్ట్‌ చేశారు. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌గారు రావడానికి కుదర్లేదు. సుజిత్‌ 22 ఏళ్లకి ‘రన్‌ రాజా రన్‌’ చేశాడు. 24 ఏళ్లకి ‘సాహో’ కథ చెప్పాడు.  కథ చెప్పడం కూడా 40 ఏళ్ల అనుభవం ఉన్నవాడిలా చెప్పాడు.  ప్రీ– ప్రొడక్షన్‌ కోసం ఏడాది కష్టపడ్డాడు. షూటింగ్‌ స్టార్ట్‌ అయినప్పుడు ఎలా హ్యాండిల్‌ చేస్తాడని కంగారు పడ్డాం. తను హ్యాండిల్‌ చేసిన విధానానికే గ్రేటెస్ట్‌ డైరెక్టర్‌ అయిపోతాడనుకుంటున్నాను. ఇంత పెద్ద సినిమా చేయడం జోక్‌ కాదు. సుజిత్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌కి వెళ్లిపోతాడని అనుకుంటున్నాను. శ్రద్ధా రెండేళ్లుగా ఈ సినిమా కోసం పని చేశారు. ఒక్క రోజు కూడా ప్రొడక్షన్‌కి ప్రాబ్లమ్‌ రాలేదు. తను సూపర్‌ పెర్ఫార్మర్‌. యాక్షన్‌ సీన్లు ఇరగదీసింది. ఏడాదికి రెండు సినిమాలు చేసి మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తాను’ అని ‘బాహుబలి’ అప్పుడు చెప్పాను. మిస్‌ అయ్యాను. ఈసారి మాట ఇవ్వకుండా చేయాలనుకుంటున్నాను. అనుకున్నదానికంటే యూవీ వాళ్లు పెద్దగా చేశారు. 100 కోట్లు లాభం వచ్చేది జాగ్రత్తగా చేసుకుంటే. దాన్ని  వదిలేసుకొని ఈ సినిమాను ఇలా ఖర్చుపెట్టి చేశారు. వాళ్లు నా ఫ్రెండ్సే. ఫ్రెండ్స్‌ అందరం కలసి పెరిగాం. వాళ్ల గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అందరికీ అలాంటి ఫ్రెండ్స్‌ ఉండాలి’’ అన్నారు.

 రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఏ హీరో ఫ్యాన్స్‌ అయినా వాళ్ల హీరో సినిమా హిట్‌ అవ్వాలనుకుంటారు. అందరి హీరోల ఫ్యాన్స్‌ ప్రభాస్‌ సినిమా హిట్‌ అవ్వాలనుకుంటారు. ప్రభాస్‌ ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడడు. తన చుట్టూ ఎప్పుడూ పాజిటివిటి ఉంటుంది. అదే అంత మంది ఫ్యాన్స్‌ని తెచ్చిపెట్టింది. ప్రభాస్‌కి దూరదృష్టి ఎక్కువ. ‘బాహుబలి’ తర్వాత ఏ సినిమా చేయాలి అని చాలా తపన పడ్డాడు. ఒకరోజు ఎగై్జటింగ్‌గా వచ్చి సుజిత్‌ సూపర్‌ కథ చెప్పాడు అన్నాడు. కథని నమ్మి సినిమా చేశాడు. సుజిత్‌ చిన్న కుర్రాడు. చాలామంది చాలా సందేహించారు. ఫస్ట్‌ లుక్, టీజర్, ట్రైలర్‌కి అందరికీ అర్థం అయిపోయింది. సుజిత్‌ కంగ్రాట్స్‌. ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌లా చేశావు. అతని భుజాల మీదే సినిమా నిలబడింది. వంశీ, ప్రమోద్‌కి సింహాలకి ఉండే గుండె ఉన్నట్టుంది. ప్రభాస్‌ ఏం అడిగినా కళ్లు మూసుకొని ఖర్చుపెడతారు. అందరూ సుజిత్‌ కథను నమ్మారు. అందుకే నాకు సినిమా మీద నమ్మకం. చాలా పెద్ద రేంజ్, రికార్డ్‌ క్రియేట్‌ చేస్తుంది. పెట్టిన డబ్బులకు డబుల్‌ ట్రిపుల్‌ రావాలి. సెట్లు, వీఎఫ్‌ఎక్స్, అన్నీ బాగా కుదిరాయి. సూపర్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అన్నారు. 

‘‘ప్రభాస్‌లాంటి మిత్రుడు మన జీవితంలో ఉంటే ఇంకేం అక్కర్లేదు... ప్రభాస్‌ బాలీవుడ్‌లోనూ∙పెద్ద స్టార్‌ అయినందుకు సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీని ప్రభాస్‌ ఇంకా.. వెయ్యికోట్లు, 2 వేల కోట్ల బడ్జెట్‌ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్‌. 

‘‘మా అమ్మకు 80 ఏళ్లు. ‘సాహో’ ఫంక్షన్‌కి వెళ్తున్నాను అంటే.. ‘రేయ్‌ కుర్రాడు ఒడ్డూ పొడుగు బావుంటాడు.. మీ నాయనలాగా’ అన్నారు మా అమ్మ. ‘అవును.. ప్రభాస్‌ చూడటానికి భలే ఉంటాడు’ అని మా ఆవిడ చెప్పింది. ‘నాకు ఫస్ట్‌ డే టికెట్స్‌ కావాలిరా’ అని మా సిస్టర్, ‘నాకు 10–15 టికెట్స్‌ కావాలి. ప్రభాస్‌ కోసం కాలేజ్‌ ఎగ్గొట్టొచ్చు’ అంటుంది మా మేనకోడలు. నాలుగు జనరేషన్స్‌లో తనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. రెండేళ్ల క్రితం రాజమౌళితో కలసి మ్యాజిక్‌ చేశారు. ఈ సినిమా దానికంటే పెద్ద హిట్‌ అవ్వాలి’’ అన్నారు నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి. 

‘‘ప్రభాస్‌ ఇప్పుడు ఆల్‌ ఇండియా స్టార్స్‌ రేంజ్‌కి ఎదిగిన మన తెలుగువాడు. ఇంత పెద్ద హీరో అవ్వడం గర్వించదగ్గ విషయం. నిర్మాతలు భయం లేకుండా ఖర్చుపెట్టారు. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. 

‘‘నన్ను చూసి సినిమాల్లోకి వచ్చామని వంశీ, ప్రమోద్, విక్కీలు అంటుంటారు. కానీ ఇప్పుడు వారిని చూసి ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎలా తీయాలో నేను నేర్చుకుంటున్నాను. ‘బాహుబలి’ లాంటి సినిమాను ఆల్‌ ఇండియా స్థాయికి తీసుకుని వెళ్లడానికి రాజమౌళిగారికి 15 ఏళ్లు పట్టింది. సెకండ్‌ సినిమాతోనే ప్రభాస్‌తో సినిమా తీశాడు సుజీత్‌’’ అన్నారు ‘దిల్‌’ రాజు.‘సాహో’ టీమ్‌తో, ప్రభాస్‌తో వర్క్‌ చేయడం గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌’’ అన్నారు శ్రద్ధా కపూర్‌.

‘‘నేను షార్ట్‌ఫిల్మ్స్‌ చేస్తున్న రోజుల్లో నా దగ్గర ఉన్న ఓ డీవీడీ యువీ క్రియేషన్స్‌ వాళ్ల దగ్గరకు వెళ్లింది. స్క్రీన్‌ప్లే బాగా రాస్తున్నాడు పిలవండి అన్నారు ప్రభాస్‌. నేను వెళ్లలేదు. తర్వాత యువీ క్రియేషన్స్‌కి వెళ్లి ప్రభాస్‌ని కలిసినప్పుడు ‘ఏంటి డార్లింగ్‌ అప్పుడు రాలేదు’ అన్నారు. ప్రభాస్‌గారు 100 టీబీ హార్డ్‌డిస్క్‌.  మాట్లాడినవన్నీ ఆయనకు గుర్తుంటాయి. ‘బాహుబలి’ తర్వాత నాతో పని చేస్తున్నప్పుడు అంతే కష్టపడ్డారు. గౌరవించారు. ప్రభాస్‌ అన్నా మీకు ఎలా థ్యాంక్స్‌ చెప్పాలో కూడా నాకు తెలియదు. వీడు తీయగలడా అని కొందరు అడిగారు. ప్రతిసారీ నన్ను నమ్మారు. వంశీ, ప్రమోద్, విక్కీ.. నాకు ముగ్గురు అన్నలు.’’ అన్నారు సుజీత్‌.

 ఈ కార్యక్రమంలో  దర్శకుడు రాధాకృష్ణ, నిర్మాత విజయ్‌ చిల్లా, నటులు అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరిల్,  గేయ రచయిత కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. ‘సాహో’ సినిమా కోసం వాడిన గన్స్, కత్తులు, కార్లు, క్రేన్స్‌ అన్నింటినీ ఈ వేడుకలో ప్రేక్షకుల వీక్షించడం కోసం ఏర్పాటు చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top