అప్పుడు సిగ్గుగా అనిపించింది : సుకుమార్‌ 

Rangasthalam is a Feel Good Movie : Sukumar - Sakshi

‘‘నేను దాదాపు 28ఏళ్లు పల్లెటూర్లోనే పెరగడంతో పల్లెతో మంచి అనుబంధం ఏర్పడింది. ‘రంగస్థలం’ సినిమా చేయడం వల్ల నా అనుబంధాన్ని మళ్లీ వెతుక్కున్నట్లు అయ్యింది’’ అని దర్శకుడు సుకుమార్‌ అన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్‌) నిర్మించిన ‘రంగస్థలం’ ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే కొన్ని పాటలు రిలీజ్‌ చేయగా, మిగిలిన పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేశాం. 1980 నేపథ్యంలో సాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, మోనికగారు 1980 బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ను చక్కగా వేయడంతో నేను పెద్దగా కష్టపడలేదు' అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ 'చంద్రబోస్‌గారు ప్రతి సాంగ్‌ను 10–15 నిమిషాల్లో రాసిచ్చేశారు. పాట రాసిన వెంటనే దేవిశ్రీప్రసాద్‌ ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. ‘1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చేస్తున్న టైమ్‌లో నేను అమెరికా వెళ్లినప్పుడు ఒకాయన వచ్చి ‘మీరు అర్బన్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు చక్కగా చేశారు. మన సంస్కృతిలో సినిమాలు ఎప్పుడు చేస్తారు’? అని అడిగినప్పుడు నాకే సిగ్గుగా అనిపించింది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది. ఈ చిత్రంలో ‘రంగమ్మ మంగమ్మ’ పాటలో వాడిన ‘గొల్లభామ’ అనే పదం ఓ కీటకానికి సంబంధించింది. ఎవర్నీ ఉద్దేశించింది కాదు’’ అన్నారు.

నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘ఈ నెల 18న వైజాగ్‌ ఆర్‌.కె. బీచ్‌లో ‘రంగస్థలం’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ చేస్తున్నాం. ముఖ్య అతిథిగా చిరంజీవిగారు వస్తున్నారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ అంతా కంఫర్ట్‌బుల్‌గా జరుగుతోంది. యూఎస్‌కు కూడా ముందుగానే ప్రింట్‌ పంపిస్తున్నాం’’ అన్నారు. ఆర్ట్‌ డైరెక్టర్స్‌ రామకృష్ణ, మోనిక, పాటల రచయిత చంద్రబోస్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top