‘పాకెట్‌ మనీ కోసమే సినిమాలు చేశా’

Rakul Preet Singh NGK Movie Special Chit Chat - Sakshi

తాను నటినెందుకయ్యానో తెలుసా? అని అంటున్నారు నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. కథానాయకిగా రాణిస్తున్న ప్రతి నటి తానెందుకు నటినయ్యాను? ఎలా అయ్యాను? వంటి విషయాల గురించి ఏదో కారణం ఉందని చెబుతుంటారు. మనం వింటుంటాం. మరి రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఏం చెబుతున్నారో చూసేస్తే పోలా. ఈ అమ్మడికి కోలీవుడ్‌లో ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం అనే ఒక్క విజయం మినహా సరైన మరో సక్సెస్‌ లేదన్నది నిజం. అయితే టాలీవుడ్‌లో రెండు మూడు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారీ బ్యూటీ.

ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రమే రకుల్‌ప్రీత్‌సింగ్‌ చేతిలో ఉన్నాయి. ఇకపోతే కోలీవుడ్‌లో సూర్యతో నటించిన ఎన్‌జీకే చిత్రంపై ఈ భామ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. దీని గురించి రకుల్‌ప్రీత్‌సింగ్‌ తాను ఎన్‌జీకే చిత్రంలో నటించడానికి ప్రధాన కారణాలు రెండు అని చెప్పుకొచ్చారు. దర్శకుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటిస్తే నటనను మరింత మెరుగుపరుచుకోవచ్చునని, ఇక రెండో విషయం హీరో సూర్య కావడం అన్నారు.

దర్శకుడు సెల్వరాఘవన్‌ ఇంతకు ముందు తెరకెక్కించిన 7జీ.రెయిన్‌బో కాలనీ, కార్తీ హీరోగా నటించిన ఆయిరత్తిల్‌ ఒరువన్‌ చిత్రాలు తనను బాగా ఆకట్టుకున్నాయన్నారు. నిజంగానే సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించడం వినూత్న అనుభంగా పేర్కొన్నారు. తాను కార్తీ, సూర్య ఇద్దరితోనూ నటించానని, ఇద్దరూ చాలా భిన్నమైన వ్యక్తులని తెలిపారు. సూర్య, కార్తీ ఇద్దరూ కఠిన శ్రమజీవులు అన్నారు.

ఎలాంటి గర్వం లేకుండా చేసేపనిని ఇష్టపడి చేస్తారని అంది. తనకు తమిళం కంటే తెలుగు భాష బాగా తెలుసని, తెలుగులో సరళంగా మాట్లాడగలనన్నారు. తమిళ చిత్రాలకు అయితే సంభాషణలను హిందీలో రాసుకుని చెబుతానని, అది కాస్త కష్టతరం అయినా సవాల్‌గా తీసుకుని నటిస్తానని చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే తాను మొదట పాకెట్‌ మనీ కోసమే సినిమాల్లో నటించానని తెలిపారు.

ఆ తరువాత కెమెరా ముందు నిలబడి నటించడం చాలా నచ్చడంతో పూర్తిగా నటిగా మారిపోయానని రకుల్‌ప్రీత్‌సింగ్‌ చెప్పుకొచ్చారు. కోలీవుడ్‌లో ఈ అమ్మడికి రవికుమార్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్‌ చేస్తున్న చిత్రం  ఒక్కటే ఉంది. అదేవిధంగా తెలుగులో నాగార్జునతో మన్మథుడు 2, హిందీలో మర్జావాన్‌ అనే ఒక చిత్రంలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top