మేమిద్దరం ప్రేమికులం కాదు

Rakul preet singh Given Clarity on Relation With Rana  - Sakshi

సినిమా: అక్కడాలేడు ఇక్కడాలేడు ఎక్కడైనా ఉంటే చెప్పంటే ప్లీజ్‌ ప్లీజ్‌ అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఇంతకీ ఏమీటీ జాణ సొద అని అనుకుంటున్నారా? ఇంకేముంటుందండీ జీవితాంతం తోడు ఉండేవాడి కోసమే రకుల్‌ రచ్చ. ఇప్పుడు బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి కనిసిస్తోంది కదా! ఈ అమ్మడి పెళ్లిపై దృష్టి మళ్లినట్టుంది. అయితే ఆ విషయాన్ని తాను డైరెక్ట్‌గా వెలిబుచ్చకుండా అంతా అమ్మేనంటూ అమ్మ పాట పాడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ అంటూ వరస పెట్టి చిత్రాలు చేసుకుంటూ పోతున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌కు ఇప్పుడు తెలుగులో కాస్త మార్కెట్‌ డౌన్‌ అయ్యింది. అయితే కోలీవుడ్‌లో మూడు, బాలీవుడ్‌లో రెండు అంటూ నటిగా బిజీగానే ఉంది. అయితే ఈ అమ్మడికి పెళ్లి చేసేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారట.

దీని గురించి రకుల్‌ చెప్పేదేంటో చూద్దాం. కెరీర్‌పై చూపే శ్రద్ధను జీవితంపైకూడా పెట్టు అని అమ్మ ఒత్తిడి చేస్తోంది. ఎప్పుడూ పని పని అంటూ ఉండొద్దు. త్వరలో పెళ్లి చేసుకుని సెటిలవు అని అమ్మ ఒత్తిడి చేస్తోంది. ఇలా సమయం దొరికినప్పుడల్లా అమ్మ క్లాస్‌ పీకుతూనే ఉంది. ఇంకా ఎన్ని రోజులు సింగిల్‌గా ఉంటావు అని అమ్మ అడుగుతోంది. అయితే అమ్మ చెప్పినట్లు పెళ్లి చేసుకోవడానికి నాకు ప్రేమికుడనేవాడు ముంబైలోనూ లేడు, హైదరాబాద్‌లోనూ లేడు. అందుకే ఎవరినైనా చూసి పెట్టమని స్నేహితులను అడుగుతున్నాను. అయితే ఇంతకు ముందు తనను పెళ్లి చేసుకునేవాడు ఆరు అడుగులుండాలి. ముఖ్యంగా తెలుగు వాడై ఉండాలి అని ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పేర్కొంది. అంతేకాదు ఈ అమ్మడు టాలీవుడ్‌ నటుడు రానాతో చెట్టాపట్టాల్‌ అనే ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే మేమిద్దరం ఫ్రెండ్స్, ప్రేమికులం కాదు అని రకుల్‌ స్పష్టం చేసిందనుకోండి. మొత్తం మీద రకుల్‌ తాజా ఇంటర్వ్యూ చూసిన ఆమె అభిమానులు పెళ్లికి సిద్ధం అవుతుందనే అభిప్రాయాలకు వచ్చేశారు. అయితే ఈ జాణకు స్నేహితులు పెళ్లి కొడుకును చూడాలి. అతగాడు ఈమెకు నచ్చాలి. అప్పుడే కదా రకుల్‌ తన అమ్మ ఆశ నెరవేర్చేది. ఆ ఘడియలు ఎప్పుడు వస్తాయో? వేచి చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top