నెటిజన్‌కు మాధవన్‌ సూపర్‌ కౌంటర్‌

R Madhavan Strong Reply To A Twitter User Who Questions His Faith - Sakshi

సోషల్‌ మీడియాలో కొందరు నెటిజన్లు ప్రముఖల వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ, మనోభావాలను కించపరిచేలా.. వారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తారు. తాజాగా ఇలాంటి అనుభవమే ప్రముఖ నటుడు మాధవన్‌కు ఎదురైంది. మాధవన్‌ సోషల్‌ మీడియాలో సామాజిక అంశాలపై తన భావాలను వ్యక్తికరిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఎప్పడూ అభిమానులతో టచ్‌లో ఉండే మాధవన్‌ తన ఇన్‌స్టాలో రాఖీ పండగ సందర్భంగా దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు. అందులో మాధవన్‌ తండ్రితో పాటు, కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఆ ఫొటోకు సంబంధించి ఓ నెటిజన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో మాధవన్‌పై విమర్శలు గుప్పించారు. ఆవిమర్శలపైన స్పందించిన మాధవన్‌ నెటిజన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఆమె ఆలోచన విధానం ఎంతో తప్పో చిన్న ఊదాహరణ ద్వారా వివరించారు. అలాగే తన మనసులోని భావాలను నిర్భయంగా వ్యక్తికరించి సదురు నెటిజన్‌ చెంప చెళ్లుమనిపించేలా చేశాడు.

వివరాల్లోకి వెళితే.. మాధవన్‌ షేర్‌ చేసిన ఫొటోలో అతని వెనకభాగంలో శిలువ ఉండటాన్ని గుర్తించి.. ఓ నెటిజన్‌ అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘శిలువ అక్కడ ఎందుకుంది?.. అది పూజ గదేనా? మీపై నాకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారు. చర్చిల్లో ఎప్పుడైనా హిందు దేవుళ్ల ఫొటోలు చూశారా?. మీరు ఈ రోజు ఏదైతే చేశారో అదంతా ఫేక్‌’ అని సదరు నెటిజన్‌ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై మాధవన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ప్రతి మతాన్ని గౌరవిస్తానని తెలిపారు. నేను ఏ మతంలోనైనా శాంతిని చూస్తానని అన్నారు.

‘మీలాంటి వారి నుంచి గౌరవం కోల్పోయినందుకు నాకు ఎలాంటి బాధ లేదు. మీరు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న మీరు అక్కడే ఉన్న గోల్డెన్‌ టెంపుల్‌ ఫొటోను గుర్తించకపోవడం  చూసి ఆశ్చర్యమేసింది. గోల్డెన్‌ టెంపుల్‌ ఫొటో ఉంది కాబట్టి నేను సిక్కిజమ్‌ను స్వీకరించినట్టేనా?. నేను దర్గాలను, అలాగే ప్రపంచంలోని చాలా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాను. ఆయా సందర్భాల్లో కొన్ని వస్తువులు బహుమతిగా వచ్చినవి. మరికొన్ని కొని తెచ్చుకున్నవి. మా ఇంట్లో అన్ని విశ్వాసాలను గౌరవిస్తారు. అన్ని మతాల వారికి మా ఇంట్లోకి ప్రవేశం ఉంది. నేను నా చిన్నతనం నుంచి గర్వంగా బతకడంతో పాటు ప్రతి ఒక్కరికి, మతానికి, నమ్మకానికి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నాను. ప్రతి మతం నాకు చెందిందిగానే భావిస్తాను. నా కుమారుడు కూడా అలాగే భావిస్తాడని నమ్ముతాను. నాకు సమీపంలో వెళ్లడానికి దేవాలయం లేనప్పుడూ.. దర్గాకు కానీ, గురుద్వార్‌, చర్చికి వెళ్లడం అదృష్టంగా భావిస్తాను. నేను ఒక హిందూ అని తెలిసి అక్కడి వారు కూడా నన్ను గౌరవిస్తార’ని పేర్కొన్నారు. కాగా, మాధవన్‌ సదరు నెటిజన్‌కు ఇచ్చిన సమాధానంపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top