ప్రభాస్‌కు ఆమాత్రం రెమ్యూనరేషన్‌ ఇస్తే తప్పేంటి?

is Prabhas too costly at Rs 20 crore?

అప్పట్లో ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ ప్రభాన్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈ ఆలోచనను కరణ్‌ మానుకున్నారు. 'బాహుబలి' సినిమాలతో జాతీయ స్థార్‌గా ఎదిగిన ప్రభాస్‌ను హిందీలో లాంచ్‌ చేసే అవకాశాన్ని కరణ్‌ ఎందుకు వదులుకున్నాడు? ఇప్పుడు ప్రభాస్‌ అంటే కరణ్‌కు గిట్టడం లేదా? అంటే బాలీవుడ్‌ వర్గాలు ఔననే అంటున్నాయి. హిందీలో సినిమా చేయడానికి ప్రభాస్‌ రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్‌ అడగడంతో కరణ్‌ బిత్తరపోయాడట. ఒక సౌతిండియన్‌ నటుడికి ఇంత భారీ రెమ్యూనరేషన్ ఇవ్వటమా? రజనీకాంత్‌కు కూడా హిందీలో ఇంత మార్కెట్‌ లేదంటూ.. ప్రభాస్‌తో సినిమా చేయాలన్న ఆలోచనను కరణ్‌ పక్కనబెట్టేశారని అంటున్నారు.

రూ. 20 కోట్లు అడిగితే తప్పేంటి?
'బాహుబలి' సినిమాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్‌ను ప్రభాస్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శక నిర్మాతల మీద నమ్మకంతో ఐదేళ్లు పూర్తిగా 'బాహుబలి' ప్రాజెక్ట్‌కు కేటాయించిన ప్రభాస్‌.. తన కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాపులర్‌ అయ్యారు. తన పాపులారిటీకి తగ్గట్టుగానే ప్రభాస్‌ పారితోషికం ఉందని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 'బాహుబలి' సినిమాల కోసం రూ. 25 కోట్లు పారితోషికం తీసుకున్న ప్రభాస్‌.. తన కొత్త సినిమా 'సాహో' కోసం రూ. 30 కోట్లు తీసుకున్నట్టు వినిపిస్తోంది. ప్రభాస్‌కు తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీలోనూ మార్కెట్‌ ఉంది. కాబట్టి ఆయన సినిమాకు ఎంత ఖర్చుపెట్టినా రాబట్టుకొనే సత్తా ఉంది కాబట్టి ఈ మాత్రం చార్జ్‌ చేయడంలో తప్పేమీ లేదని ట్రేడ్‌ పండితులు చెప్తున్నారు.

కరణ్‌ కినుక వహించాడా?
'బాహుబలి' సినిమాలను హిందీలో పంపిణీ చేసి కరణ్‌ బాగానే లాభాలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ఊపులోనే  ప్రభాస్‌తో హిందీలో సినిమా చేస్తానని ప్రకటించాడు. కానీ ఆ తర్వాత ప్రభాస్ అడిగిన రెమ్యూనరేషన్‌తో కళ్లుబైర్లు కమ్మిన కరణ్‌.. ఆయన పట్ల గుర్రుగా ఉన్నాడని బాలీవుడ్‌ వర్గాలు చెప్తున్నాయి. ఈ మధ్యకాలంలో కరణ్‌ పెట్టిన ఓ ట్వీట్‌లోనూ ప్రభాస్‌ తీరుపై పరోక్షంగా విమర్శలు ఉన్నాయని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ కరణ్‌ ట్వీట్‌ చేయకపోవడమూ దీనికి నిదర్శనమని అంటున్నారు.

వరుణ్‌ ధావన్‌కు రూ. 25 కోట్లు.. ప్రభాస్‌కు 20 కోట్లు ఎక్కవ?
వరుణ్‌ ధావన్‌ తాజా సినిమా 'జుడ్వా-2' బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 'జుడ్వా'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా 200 కోట్లకుపైగా వసూలు చేయడంతో.. యువహీరో ధావన్‌ తన రెమ్యూనరేషన్‌ను ఏకంగా రూ. 25 కోట్లకు పెంచేశాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్‌ సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ. 60 కోట్ల వరకు వసూలు చేస్తుండగా.. అమీర్ ఖాన్ రూ. 50 కోట్లు, షారుక్ రూ. 40-45 కోట్ల వరకు అందుకుంటున్నారు. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌కు రూ. 40 కోట్లకుపైగా రెమ్యూనరేషన్ అందుతోంది. ఈ క్రమంలో ప్రభాస్‌ రూ. 20కోట్లు కోరడం చాలా తక్కువేనని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top