నేను నీరులాంటివాడిని

Posani Krishna Murali Exclusive Interview - Sakshi

కొడుకుని లోఫర్‌గా తయారు చేయగలడు... సూటిగా, సుత్తి లేకుండా గొంతులు కోయగలడు పంచ్‌ డైలాగ్‌లతో నవ్వించగలడు... కూతురి మీద పంచ ప్రాణాలు పెట్టగలడు...కొడుకుకి కొండంత అండగా నిలవగలడు...గ్లాస్‌లో పోస్తే గ్లాస్‌... బిందెలో పోస్తే.. ఆ షేప్‌... ఆర్టిస్ట్‌ పోసాని అచ్చంగా అంతే.. ఎలా అయినా మౌల్డ్‌ అయిపోతాడు. రండి.. ఆయన మాటల్లో ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం.

► ఆర్టిస్ట్‌గా పరభాషల్లోకి వెళ్లాలనుకుంటున్నారా?
తమిళం, హిందీ, కన్నడంలో అడిగారు. నేను తెలుగులోనే ఉంటాను. ఓపిక ఉన్నంతవరకూ, నాకు అవకాశాలు వచ్చినంతకాలం చేస్తూనే ఉంటాను. నా గురువులు, శిష్యులు, శిష్యుల శిష్యులతో పని చేస్తున్నాను. అది నా అదృష్టం. ఇండస్ట్రీకు కృతజ్ఞతగా ఉండాలి. ఉంటాను.

► వారం వ్యవధిలో రెండు మంచి పాత్రల్లో (మజిలీ, చిత్రలహరి) కనిపించారు. ఎలా అనిపిస్తోంది ?
నేను ఏ పాత్ర అయినా చేయగలను అనే నమ్మకం నాకుంది. స్కూల్‌ డేస్‌లోనే ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాను. కానీ యాక్టర్‌ అవ్వాలనుకోలేదు. యాక్సిడెంటల్‌గా ఆర్టిస్ట్‌ అయ్యాను. రైటర్‌గా, డైరెక్టర్‌గా, యాక్టర్‌గా చేశాను. అంతకముందు మంచి సినిమాలు చేశాను. హిట్‌ అయ్యాయి, మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇద్దరు మంచి దర్శకులు రెండు మంచి కథల్లో తండ్రి వేషాలు ఇచ్చారు. ఈ రెండూ స్పెషల్‌గా ఉన్నాయని చూసినవాళ్లు అనుకుంటున్నారంటే.. నేను కొత్తగా, స్పెషల్‌గా చేసిందేమీ లేదు. ‘చిత్రలహరి’ సినిమాలో కొడుకుని సపోర్ట్‌ చేసే తండ్రి పాత్ర. దానికి నేను యాక్ట్‌ చేయవసరం లేదు. రియల్‌ లైఫ్‌లో నేను అలాంటి ఫాదర్‌నే. మా అబ్బాయిల్ని అలానే సపోర్ట్‌ చేస్తాను. ఆ సినిమాలో సాయిధరమ్‌ పాత్రకు దగ్గరగా మా పెద్దబ్బాయి ఉజ్వల్‌ ప్రవర్తిస్తాడు. కోపం వస్తే గట్టిగా అరవడం, వస్తువులు విసిరేయడం లాంటివి చేస్తాడు. ‘మజిలీ’లో నేను చేసిన తండ్రి పాత్రలా ప్రవర్తించే తండ్రులు సొసైటీలో చాలామందిని చూసే ఉంటారు.

► ‘నేను కొత్తగా చేసిందేం లేదు’ అన్నారు. మరి మీ పాత్రలకు అంత స్పందన లభించడానికి కారణం వాటిని ప్రేక్షకులు రిలేట్‌ చేసుకోవడం వల్లే అంటారా?
ఇవి రియల్‌ క్యారెక్టర్స్‌.  శివ నిర్వాణ (‘మజిలీ’ దర్శకుడు), కిశోర్‌ తిరుమల (‘చిత్రలహరి’ దర్శకుడు) సొసైటీలో తిరిగారు. చిన్నస్థాయి నుంచి పైకి వచ్చారు ఇద్దరూ. అందర్నీ గమనిస్తూ రావడం వల్లే ఇలాంటి తండ్రీ–కూతురు, తండ్రీ–కొడుకు పాత్రలు వారి నుంచి వచ్చాయి. ఈ తండ్రి పాత్రకి ఎవరు బావుంటారు? పోసాని బావుంటాడు. పోసాని ఎందుకు బావుంటాడు? అన్ని రకాల పాత్రలు చేయగలడు. కామెడీ, ట్రాజెడీ, ఎమోషన్స్, విలనిజమ్, వెకిలి... ఇలా ఏదైనా చేయగలడు. వీడిని ఎలా అయినా మార్చుకోవచ్చు. నేను నీరు లాంటి వాడిని. గ్లాస్‌లో పోస్తే గ్లాస్, బిందెలో పోస్తే బిందె షేప్‌లోకి వెళ్లగలను. అందులోకి వెళ్లడానికి నాకు హక్కులున్నాయి. వాటిని నేను అనుభవించాను. అనుభవించకుండా టక్కున వచ్చి డైలాగ్‌ చెప్పను. కథ చదువుతా. సీన్‌ చూసుకుంటాను. నాకు ఇలా జరిగిందని గుర్తొస్తుంటాయి.

► ఏదైనా పాత్ర చేసేటప్పుడు మీలో ఉన్న రైటర్‌ బయటకొస్తాడా?
రానివ్వను. ఫస్ట్‌ నుంచి కూడా. ‘ఇక్కడ ఇంకో మాట పడితే బావుండు గురువుగారు’ అని వాళ్లంతట వాళ్లు అడిగితే తప్ప నేను జోక్యం చేసుకోను. ఎలా యాక్ట్‌ చేయాలని మాత్రమే ఆలోచిస్తా అంతే. వాళ్ల ఆలోచనలేంటో? ఆ డైలాగ్‌ను సినిమాలో ఇంకోచోట లింక్‌ పెట్టాడేమో? మనకు తెలియదు కదా. అందుకే ముట్టుకోను. నాకు రాఘవేంద్రరావు అయినా కొత్త కుర్రాడైనా ఒకటే. అడిగారు కదా అని ఏది పడితే అది చెప్పేయను. ఒకవేళ నేను చెప్పాలనుకున్నది ఆ సీన్‌కి సూట్‌ అయితే, అతను రాసిందానికన్నా బావుందనిపిస్తే అప్పుడు చెబుతా. బాగుంటే ఇంకెందుకు కెలకటం. ‘నువ్వు ఆరు లైన్లు రాశావు. లాస్ట్‌ 2 లైన్లు కట్‌ చేసినా అదే అర్థం వస్తుంది’ అని చెప్పి తగ్గిస్తా.

► రాయడం తగ్గించారు ఎందుకని?
1986 ఆగస్ట్‌ 17 నుంచి కలం పట్టుకొని పరుచూరి బ్రదర్స్‌ దగ్గర రాస్తూనే ఉన్నాను. 2016 వరకూ రాస్తూనే ఉన్నాను. 20 ఏళ్ల పాటు 100 సినిమాలు సోలో కార్డ్‌. అవకాశం వచ్చింది దర్శకుడిగా మారాను. ఫ్లాప్‌ తీశా, సూపర్‌ హిట్స్‌ తీశా. ‘మెంటల్‌ కృష్ణ’ వేషం మీరే వేయండి అన్నారు నా నిర్మాత. హిట్‌ అయింది. నా లైఫ్‌లోకి ఆర్టిస్ట్‌ వచ్చాడు. వీడికి ఏ వేషం అయినా ఇవ్వొచు అని అందరూ ఫీల్‌ అయ్యారు. చాలా తక్కువ సమయంలో 300 సినిమాల్లో యాక్ట్‌ చేశాను. ఆర్టిస్ట్‌ అయిన తర్వాత కంఫర్ట్‌లు పెరిగాయి. అంతకు ముందు గవర్నమెంట్‌ ఎంప్లాయ్‌లా పని చేశాను. టైమ్‌ టు టైమ్‌. రైటర్‌గా ఉన్నప్పుడు 24 గంటలు పనిలో ఉన్నట్టే. డౌట్‌ వస్తే సెట్‌కు వెళ్లాలి. అది టెన్షన్‌తో కూడిన జాబ్‌. మైండ్‌ని ఎప్పుడూ గ్రైండ్‌ చేస్తుండాలి.

ఆర్టిస్ట్‌గా ప్రస్తుతం పని లిమిట్‌ అయింది, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఫ్యామిలీతో టైమ్‌ ఎక్కువ స్పెండ్‌ చేయగలుగుతున్నాను. బిజీ ఆర్టిస్ట్‌ అయిన తర్వాత దాన్ని వదులుకునేంత అమాయకుడిని కాదు. కానీ నాకు రైటర్‌ అంటే బాగా ఇష్టం. ఆర్టిస్ట్‌గా ఆ ఉత్సాహం ఉండదు. ఎందుకంటే నటనలో నాకు పాస్‌ మార్కులు గ్యారెంటీ. కానీ రైటర్‌ జాబ్‌ అలాంటిది కాదు. ప్రతిసారి డెలివరీ లాంటిదే. ఆల్రెడీ ఒకసారి నొప్పులు పడ్డాం కదా.. ఈసారి ఈజీ అనుకోలేం. మళ్లీ అవే నొప్పులు. సిన్సియర్‌గా స్ట్రగుల్‌ అవ్వాల్సిందే. ఆర్టిస్ట్‌గా నొప్పులు లేవు. ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉంది. ఇక పని గట్టుకుని నొప్పులు కొని తెచ్చుకోవడం ఎందుకు? మళ్లీ కావాల్సినప్పుడు నేనే నొప్పులు తెచ్చుకుంటాను.

► ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు?
 ‘మహేశ్‌బాబు ‘మహర్షి’, నిఖిల్‌ ‘అర్జున్‌ సురవరం’, ఓ 2  వెబ్‌సిరీస్‌లు, చిన్న సినిమాలు నాలుగైదు చేస్తున్నాను.

► ఇప్పుడు ప్రతీ సినిమాకు నలుగురైదుగురు రైటర్స్‌ పని చేస్తున్నారు. అప్పట్లో సింగిల్‌ కార్డ్‌తో సూపర్‌ హిట్స్‌ ఇచ్చారు. ఇప్సటి ఈ విధానం ఎలా అనిపిస్తోంది?
ఇంతమంది ఎందుకు అనడిగితే బెటర్‌మెంట్‌ కోసం అంటారు. ఒక్కొక్కరిది ఒక బ్రెయిన్, అవి వాడితే సినిమాకు ఉపయోగపడతాయి కదండీ అంటారు. నేను ఏమంటానంటే... ‘బెటర్‌మెంట్‌ కోసం పది మంది కెమెరామేన్‌లను పెట్టు, ఐదుగురు డైరెక్టర్లను పెట్టు. డ్రామా ఒకరితో, కామెడీ ఒకరితో తీయించండి. సినిమా బెటర్‌మెంట్‌ కోసమే కదా’ అని నేనంటే ఒప్పుకుంటారా? పోసాని పిచ్చోడు అంటారు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అంటారు. రచయితను డిమాండ్‌ చేయడం కమాండ్‌ చేయడం సులువు. రైటర్‌ రాసిందాంట్లో వేలు పెట్టడానికి నీకు క్వాలిఫికేషన్‌ అక్కర్లేదు. తెలుగు తెలిసుంటే చాలు. డైలాగ్‌ చెవులకి ఎక్కడం లేదండీ అనేస్తాం. సంగీత దర్శకుడు పాట విని బాలేదండీ అన్నప్పుడు ఏం బాలేదు అని ఆయన అడిగితే ఎదుటివాడికి రాగాలు తెలియదు. స్వరాలు మాకు తెలియదు. తాళాలు అయ్య బాబోయ్‌ అస్సలు చాన్సే లేదు. ఖండిస్తే ఎదురు మాట్లాడతాడా నాతో? అని ప్రాజెక్ట్‌ నుంచి తీపిస్తాం. స్పోర్టివ్‌గా తీసుకోలేం.

► అందుకే రచయితలు దర్శకులుగా మారుతున్నారా?
అవును. అవన్నీ భరించి భరించి ‘రాయడం నాకు వచ్చు కాదా? మరి తీయడం కూడా వస్తుంది’ అని డైరెక్టర్లు అవుతున్నారు. నువ్వు రచయితను నమ్మి అతనికి ఇవ్వాల్సిన క్రెడిట్‌ అతనికి ఇవ్వు. హీరోయిన్, వాళ్ల అసిస్టెంట్లను కూడా ఫ్లైట్‌లో బిజినెస్‌ క్లాస్‌లో తీసుకెళ్లడం, ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేయడం చేస్తాం. రైటర్‌కి చిన్న హోటల్‌ చాలదా? బిజినెస్‌క్లాసా? అమ్మ బాబోయ్‌ అంటారు. అసలు రైటర్‌ని నువ్వు ఎంత ప్రేమిస్తే నీ సినిమాకు అంత రాస్తాడు. ఇందాక ఎవరికెలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో చెప్పాను కదా.. వాళ్లకు ఎదురుపెట్టే బదులు రైటర్లను బాగా చూసుకో.

► ఆర్టిస్ట్‌గా ఫలానా రోల్‌ చేయాలని పర్టిక్యులర్‌గా ఏదైనా ఉందా?
ఏదీ లే దు. అన్నీ చేసేశాను అనే అనుకుంటున్నాను. పక్కా విలన్, సెంటిమెంట్‌ ఇలా అన్ని చేశాను. ఇది నా అదృష్టం. నా నిర్మాతలు, దర్శకులు, హీరోలు అందరూ నన్ను నమ్మి ఇచ్చారు.
– గౌతమ్‌ మల్లాది


ప్రవచనాలు చెప్పేవాళ్లను చూస్తే కోపం వస్తుంది. ఈ రోజుల్లో జనం చూసి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మన పుట్టుకే నేర్పుతుంది. ఏ ప్రవచనం చూసి పుట్టిన బిడ్డ ఏడవడం మొదలెడతాడు? ఎవరు చెబితే చనుబాలు దగ్గరకు వెళ్తాడు. అది ఎవరు నేర్పారు? సొసైటీలో ఎవ్వరూ ఎవ్వరికీ నేర్పాల్సింది ఏదీ లేదు. తెలుసుకోవాల్సిందే. ప్రవచనాలు కొత్తగా ఏం నేర్పుతాయి?  ఎవర్నీ ఎవరూ రెస్ట్రిక్‌ చేయకూడదంటున్నా. డబ్బులు తీసుకోకుండా ప్రవచనం చెప్పేవాళ్లు ఉన్నారా? మనిషికి ప్రవచనం అవసరం లేదు. క్యారెక్టర్‌ ఉంటే చాలు అన్నీ వచ్చేస్తాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top