అంతకుమించి ఉండాలన్నా.. ప్రామిస్‌ అన్నాడు వర్మ! – నాగార్జున

Nagarjuna Akkineni, Ram Gopal Varma to collaborate again for upcoming film - Sakshi - Sakshi

‘‘నాన్నగారు (ఏయన్నార్‌) 28 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుందనేవారు. ‘శివ’ చేసేటప్పుడు నాకు 28 ఏళ్లు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత డబుల్‌ మెచ్యూరిటీతో మేమిద్దరం ఇప్పుడీ సినిమా చేస్తున్నాం. నా మీద తన (వర్మ)కు, తనపై నాకూ నమ్మకముంది’’ అన్నారు నాగార్జున. ఆయన హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్‌ చంద్రతో కలసి రామ్‌గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా సోమవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వర్మ తల్లి సూర్యావతి క్లాప్‌ ఇవ్వగా, యార్లగడ్డ సురేంద్ర కెమెరా స్విచాన్‌ చేశారు.

తెలుగులో ‘శివ’ సిన్మా ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ఇప్పుడీ సినిమా ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లోవేసిన సెట్, ‘శివ’లో నాగార్జున సైకిల్‌ చైన్‌ లాగే సీన్‌ను గుర్తుకు తెచ్చింది. నాగార్జున మాట్లాడుతూ–‘‘ఇక్కడికి వచ్చినప్పట్నుంచి ‘శివ’ జ్ఞాపకాలు మెదులుతున్నాయి. ఒక వ్యక్తి (పోలీసాఫీసర్‌) ఓ విషయాన్ని నమ్మితే... దాని కోసం ఎంత వరకైనా తెగిస్తాడనే పాయింట్‌తో రూపొందుతున్న చిత్రమిది. ఈ నెలాఖరు వరకూ చిత్రీకరణ చేసిన తర్వాత అఖిల్‌ ‘హలో!’ పనులపై దృష్టి పెడతా.

డిసెంబర్‌ 22 (‘హలో!’ రిలీజ్‌ డేట్‌) తర్వాత మళ్లీ చిత్రీకరణ ప్రారంభిస్తాం. టెక్నికల్‌గా ‘శివ’ ఓ స్టాండర్డ్‌లో ఉంటుంది. అంతకు మించి ఈ సినిమా ఉండాలని వర్మతో అంటే... అలాగేనని ప్రామిస్‌ చేశాడు’’ అన్నారు. వర్మ మాట్లాడుతూ– ‘‘మా అమ్మానాన్నలు నాకు జన్మనిస్తే.. అన్నపూర్ణ స్టూడియోస్‌ దర్శకుడిగా జన్మనిచ్చింది. నేను ఏమీ కాని రోజుల్లో వెంకట్, సురేంద్ర (‘శివ’ నిర్మాతలు) నన్ను నమ్మారు.

నాగార్జున కూడా నన్ను నమ్మి ‘శివ’కి దర్శకుడిగా అవకాశం ఇవ్వడంతో పాటు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందుకే, నేను దేవుణ్ణి నమ్మను. నాగార్జునను నమ్ముతా. ఈ సిన్మా కథ విన్న తర్వాత ‘మళ్లీ పాత వర్మ కనిపించాడు’ అని నాగార్జున చెప్పడంతో నాపై నా నమ్మకం ఇంకాస్త పెరిగింది. కొన్నేళ్లుగా ‘వర్మకు మైండ్‌ దొబ్బింది. జ్యూస్‌ అయిపోయింది’ అంటున్నారు కొందరు. నాకు మైండ్‌ దొబ్బిన మాట నిజమే గానీ... జ్యూస్‌ అయ్యిందో? లేదో? ఈ సిన్మా చూశాక తెలుస్తుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top