పుష్కరం దాటాక డబుల్‌ డోస్‌

పుష్కరం దాటాక డబుల్‌ డోస్‌


బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించిన మంచు మనోజ్‌ ‘దొంగ దొంగది’తో హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం విడుదలై పుష్కరం (పన్నెండేళ్లు) దాటింది. ఇప్పటి వరకూ చేసిన అన్ని సినిమాల్లోనూ సింగిల్‌ క్యారెక్టర్‌లో కనిపించారు మనోజ్‌. తొలిసారి ‘ఒక్కడు మిగిలాడు’లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. డబుల్‌ డోస్‌ అన్నమాట. ఈ చిత్రంలో ఆయన ఎల్‌.టి.టి.ఈ. మిలిటెంట్‌ చీఫ్‌ ప్రభాకరన్‌గా, స్టూడెంట్‌ లీడర్‌గా కనిపించనున్నారు. అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకత్వంలో పద్మజ ఫిలిమ్స్‌ పతాకంపై ఎస్‌.ఎన్‌.రెడ్డి–లక్ష్మీకాంత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనీషా ఆంబ్రోస్‌ కథానాయిక.ఈరోజు (మే 20) మనోజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆయన పోషిస్తున్న విద్యార్థి పాత్ర లుక్‌ను రిలీజ్‌ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మిలిటెంట్‌ లీడర్‌ పాత్ర కోసం భారీగా బరువు పెరిగిన మనోజ్‌ స్టూడెంట్‌ లుక్‌ కోసం దాదాపు 15 కేజీలు తగ్గారు. కేవలం నెలల వ్యవధిలో 15 కేజీల బరువు తగ్గడం మామూలు విషయం కాదు.  పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చివరి దశకొచ్చాయి. జూన్‌ మొదటివారంలో ఆడియో, నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి. కోదండ రామరాజు, సంగీతం: శివ నందిగామ.

Back to Top