హైకోర్టులో హీరోయిన్ల పిటిషన్‌

Malayalam Actresses Approaches Kerala HC in Bhavana Case - Sakshi

సాక్షి, తిరువనంతపురం: నటి భావన లైంగిక వేధింపుల కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. మళయాళ మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌(అమ్మ) సభ్యులు.. నటీమణులు హనీ రోజ్‌, రచనా నారాయణకుట్టీలు కేరళ హైకోర్టులో ఓ పిటీషన్‌ దాఖలు చేశారు. నటి లైంగిక వేధింపులు కేసులో వాదనలు వినేందుకు మహిళా జడ్జిని నియమించాలని వాళ్లు పిటీషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటీషన్‌తోపాటు ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న హీరో దిలీప్‌ అభ్యర్థనను కూడా బెంచ్‌ శుక్రవారం విచారణకు స్వీకరించింది. (అక్కినేని అమల కఠిన నిర్ణయం)

భావన వేధింపుల కేసును మహిళా జడ్జి పర్యవేక్షణలోనే విచారణ చేయిస్తామని కేరళ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో జాప్యం పైగా, ఆ మధ్య దిలీప్‌పై నిషేధం ఎత్తేస్తూ అమ్మ నిర్ణయం తీసుకోవటం  ‘వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’లోని నటీమణులకు ఆగ్రహావేశాలను రగిల్చింది. ఈ నేపథ్యంలోనే నటి లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు హీరోయిన్లు పిటీషన్‌ దాఖలు చేయటం విశేషం. ‘మహిళా జడ్జి ఉంటేనే ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతుందని, సత్వర న్యాయం కూడా జరగుతుందని భావిస్తున్నాం’ అని సదరు హీరోయిన్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.  

2017 ఫిబ్రవరిలో ఓ చిత్ర షూటింగ్‌ కోసం వెళ్తున్న ఆమెను అపహరించిన కొందరు దుండగులు.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వీడియోలు తీశారు. అనంతరం ఈ కేసులో అగ్రహీరో దిలీప్‌ హస్తం ఉందంటూ ప్రధాన నిందితుడు పల్సర్‌ సునీ పేర్కొనటం.. దిలీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయటం వెనువెంటనే జరిగిపోయాయి. ఎనిమిది నెలల తర్వాత బెయిల్‌పై దిలీప్‌ బయటకు రాగా.. ప్రస్తుతం కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top