లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు అరుదే!

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు అరుదే!

తమిళసినిమా: హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల రాక అరుదైపోయిందని నటి తాప్సీ అంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటున్న ఈ ఢిల్లీ బ్యూటీని ఇప్పుడు దక్షిణాదిలో దాదాపు మరిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్నంలో పడింది తాప్సీ. అయితే ఈ భామకు బాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ ఉంది. అక్కడ పింక్, నామ్‌ షబానా వంటి చిత్రాల్లో తాప్సీ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. దీంతో పాటు ఆ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడంతో బాలీవుడ్‌లోనే మకాం పెట్టేసింది. నామ్‌ షబానా చిత్ర కథ ఒక రకంగా చెప్పాలంటే తాప్సీ చుట్టూనే తిరుగుతుంది.అలాంటి మంచి కథా చిత్రాలు మరిన్ని రావాలని అంటున్న తాప్సీని హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటిస్తున్న నటీమణులు హీరోలకు సమానంగా పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తున్నారనే ప్రచారం గురించి ప్రశ్నించగా నిజం చెప్పాలంటే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు అరుదుగానే వస్తున్నాయని అన్నారు. వాటిలోనూ ఒకటీ అరా చిత్రాలే విజయం సాధిస్తున్నాయని పేర్కొంది. అదీ గాక హీరోల చిత్రాల స్థాయిలో హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్‌ రావడం లేదన్నది నిజం అని చెప్పింది. హీరోల చిత్రాలకు ధీటుగా హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్‌ వచ్చి సక్సెస్‌ అయితే సమాన పారితోషికం డిమాండ్‌ చేసే హక్కు ఉంటుందని ఆమె అన్నారు. ఏడాదిలో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో తాను నటించిన చిత్రం ఒక్కటే భారీ ఓపెనింగ్స్‌ సాధించిందని పేర్కొంది. అయితే హీరోల చిత్రాల ఓపెనింగ్స్‌తో తన చిత్రాన్ని పోల్చకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Back to Top