ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

Kurukshethram 3D Movie Trailer launch - Sakshi

– మునిరత్న

‘‘మా ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని కొందరు ‘దానవీరశూరకర్ణ’ చిత్రంతో పోలుస్తున్నారు. ఆ సినిమా ఒకేసారి పుట్టింది. ఇక రాదు. కానీ ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేయొచ్చు’’ అన్నారు నిర్మాత మునిరత్న. మహాభారతాన్ని తొలిసారి ఇండియన్‌ స్క్రీన్‌ మీద త్రీడీలో ‘కురుక్షేత్రం’ పేరుతో తెరకెక్కించారు. ఇందులో దుర్యోధనుడిగా కన్నడ హీరో దర్శన్, కర్ణుడిగా అర్జున్, అర్జునుడిగా సోనూ సూద్, అభిమన్యుడిగా నిఖిల్‌ గౌడ, భీష్ముడిగా అంబరీష్‌ నటించారు. రాక్‌లైన్‌ వెంకటేశ్‌ సమర్పణలో కథను అందించడంతో పాటు మునిరత్న ఈ చిత్రాన్ని నిర్మించారు.

నాగన్న దర్శకుడు. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘భారతాన్ని త్రీడీలో తీయాలనుకున్నాను. ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రస్తుత తరానికి మహాభారతాన్ని తెలియజేయడానికి ఈ సినిమా చేశాం’’ అన్నారు మునిరత్న. ‘‘ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించినందుకు నిర్మాతలకు కృతజ్ఙతలు’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘దేశంలో మొట్టమొదటి త్రీడీ మైథాలజీ సినిమా ఇది. ‘కురుక్షేత్రం’ పండగలా ఉంటుంది’’ అన్నారు నాగన్న.

‘‘1970–2019 వరకూ ఉన్న గొప్ప యాక్టర్స్‌ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. ఈ చిత్రం తప్పకుండా భారతంలోని పాత్రలన్నీ పరిచయం చేస్తుంది’’ అన్నారు దర్శన్‌. ‘‘చారిత్రాత్మక చిత్రంలో నటించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు అర్జున్‌. ‘‘ఇలాంటి సినిమాకు సమర్పకుడిగా ఉండటం సంతోషం. తెలుగులో రిలీజ్‌ చేయడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు రాక్‌లైన్‌ వెంకటేశ్‌. ‘‘ఈ సినిమాలో మాటలు, పాట లు రాసే అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు వెన్నెలకంటి. ‘‘నటుడిగా ఈ సినిమా ఓ మంచి అనుభూతి’’ అన్నారు సోనూ సూద్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top