నేను మణిరత్నంను కలిసుండకపోతే..

నేను మణిరత్నంను కలిసుండకపోతే.. - Sakshi


నేను దర్శకుడు మణిరత్నంను కలిసుండకపోతే ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు అని పేర్కొన్నారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌.రెహ్మాన్ . సోమవారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినిమాస్‌ థియేటర్‌లో జరిగిన కాట్రువెలియిడై చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రెహ్మాన్ పై విధంగా వ్యాఖ్యానించారు. మణిరత్నం తాజా చిత్రం కాట్రువెలియిడై. కార్తీ, అదితిరావు జంటగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్‌.రెహ్మాన్ సంగీతభాణీలు అందించారు.


ఈ చిత్ర ఆడియోను ఆయన ఆవిష్కరించగా నటుడు సూర్య తొలి ప్రతిని అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ తాను ఏఆర్‌.రెహ్మాన్  కలిసి 25 ఏళ్లుగా పని చేస్తున్నామన్నారు. ఏఆర్‌.రెహ్మాన్ తో కలిసి పని చేయడం ఎప్పుడూ ఒక కొత్త అనుభవమేనని పేర్కొన్నారు. కాట్రువెలియిడై భారతీయ విమానదళం నేపధ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని తెలిపారు. తాను కార్తీను మూడు రోజుల క్రితం కలిసినప్పుడు షూటింగ్‌ సమీపంలో యుద్ధ విమాన అధికారులను చూసినప్పుడు లేచి నిలబడి వారికి గౌరవాన్ని ఇస్తానని అన్నారన్నారు. అలా వారి గౌరవాన్ని ఆవిష్కరించే చిత్రమే కాట్రు వెలియిడై అని పేర్కొన్నారు.


ఏఆర్‌.రెహ్మాన్  మాట్లాడుతూ మణిరత్నం తనకు లభించిన వరప్రసాదం అన్నారు. తాను ఆయన్ను  కలిసుండకపోతే ఈ స్థాయిలో ఉండేవాడినే కాదన్నారు. సూర్య మాట్లాడుతూ తాను, తన భార్య మణిరత్నంను చాలా కాలంగా అడగాలనుకుంటున్న ప్రశ్న ఆయన ఇప్పటికీ ఇంత అందమైన ప్రేమ కథా చిత్రాలను ఎలా తెరకెక్కించగలుగుతున్నారన్నారు.


కార్తీ మాట్లాడుతూ తాను మణిరత్నం వద్ద మోస్ట్‌ అసిస్టెంట్‌గా ఉండి కథానాయకుడిని అయ్యానన్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని, పనిలో ఇంత సిన్సియర్‌గా ఉంటున్నానంటే ఆయనే కారణం అన్నారు. మణిరత్నం తనను నటించమని ఈ చిత్ర స్క్రిప్ట్‌ ఇచ్చినప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనన్నారు. కాట్రువెలియిడై చిత్రం లో నటించడం ఒక మధురమైన అనుభవంగా కార్తీ పేర్కొన్నారు. ఈ చిత్రంతో తన కల నిజమైందని నటి అదితిరావు పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top