ముగ్గురు ఫూల్స్‌ కథ ఇది

k ramakanth interview about Edaina Jaragocchu - Sakshi

‘‘ఏప్రిల్‌ 1న పుట్టిన ముగ్గురు ఫూల్స్‌ కథే ‘ఏదైనా జరగొచ్చు’ చిత్రం. తాము ఫూల్స్‌ కాదని నిరూపించుకునే క్రమంలో వారు ఇంకా వెధవ పనులు చేస్తుంటారు. వాటివల్ల ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారు? అన్నదే చిత్రకథ’’ అన్నారు కె. రమాకాంత్‌. శివాజీరాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా, పూజా సోలంకి, సాషా సింగ్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. సుదర్శన్‌ హనగోడు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. కె. రమాకాంత్‌ చెప్పిన విశేషాలు.

► దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటిగారి దగ్గర ‘అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం’ చిత్రాలకు పని చేశాను. ఆ తర్వాత ఓ ఫిలిం కోర్స్‌ చేయడానికి ఫ్రాన్స్‌ వెళ్లా. ఇప్పుడు సొంతంగా ‘ఏదైనా జరగొచ్చు’ సినిమా చేశా. థ్రిల్లర్, హారర్‌ నేపథ్యంలో తీసిన చిత్రమిది. మా సినిమాలోని మూడు ప్రధాన పాత్రలు చేసే ఒక్కొక్క పొరపాటు కారణంగా మరొక సమస్యలో వారికి తెలియకుండానే పడుతుంటారు.

► పేరున్న హీరో కొత్తవారికి చాన్స్‌ ఇవ్వాలంటే మనల్ని నిరూపించుకోవాలి. అందుకే ఆడిషన్స్‌ ద్వారా కొత్తవారిని తీసుకున్నాం. పైగా రెగ్యులర్‌ ఫార్మాట్‌ కాదు. కొత్తవారైతే అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై చూపించగలననిపించింది.

► క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడం వల్లే బడ్జెట్‌ కొంచెం పెరిగింది. బాబీ సింహా, ‘వెన్నెల’ కిషోర్, అజయ్‌ ఘోష్‌ వంటి నటులను ముందుగా అనుకోలేదు. ఒరిజినల్‌ దెయ్యంతో సినిమా చేస్తా అని పట్టుబట్టే క్రేజీ ఫిలిం డైరెక్టర్‌ పాత్రని ‘వెన్నెల’ కిషోర్‌ చేశారు.  దెయ్యాలు పట్టే వ్యక్తి పాత్రని అజయ్‌ ఘోష్‌ చేశారు. ఈ సినిమా ఫలితం వచ్చాక నా తర్వాతి చిత్రాల గురించి ఆలోచిస్తా. అయితే కథలు మాత్రం సిద్ధం చేశా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top