కొన్ని నిబంధనలను సడలించాలి

IMPPA writes to Maharashtra CM requesting change in guidelines - Sakshi

టీవీ, ఫిల్మ్‌ షూటింగ్‌లకు కొన్ని షరతులతో కూడిన నియమ, నిబంధనలతో ముంబై ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ షరతుల్లో ‘65ఏళ్లకు పై బడినవారిని షూటింగ్స్‌కు అనుమతించవద్దు’, ‘షూటింగ్‌ లొకేషన్‌లో తప్పనిసరిగా ఒక డాక్టర్, ఓ నర్స్, ఓ అంబులెన్స్‌ ఉండాలి’ అనే నిబంధనలను పునఃపరిశీలించాలని ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (ఐఎఫ్‌టీడీఏ) ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా ‘ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌’ కూడా ఈ రెండు నిబంధనలపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. ఇవి కాకుండా  ప్రభుత్వం సూచించిన నిబంధనల్లో మరికొన్నింటిని తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖ సారాంశం ఈ విధంగా...

‘‘స్టూడియోలో లేదా లొకేషన్‌కి దగ్గర్లోని హాస్పటల్స్, అపార్ట్‌మెంట్స్‌లో చిత్రబృందం బస చేసేలా నిర్మాతలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం సూచన సాధ్యమైంది కాదు. ఇప్పటికే హోటల్స్, అపార్ట్‌మెంట్స్‌ను కోవిడ్‌ 19 బాధితుల కోసం వినియోగిస్తున్నారు. కేవలం చిత్రబృందం కోసమే ఓ అపార్ట్‌మెంట్‌ను ఈ క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోవడం కుదరకపోవచ్చు. అలాగే సినిమాల్లోని కుటుంబ సన్నివేశాల కోసం నిజమైన కుటుంబాన్నే ఎంపిక చేసుకుని షూటింగ్‌ చేయాలన్న సూచన అర్థరహితమైనది. ఎందుకంటే ఒకే కుటుంబంలో అందరూ  యాక్టర్స్‌ ఉండరు. షూటింగ్‌ లొకేషన్స్‌లో ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఎలా అమలు అవుతున్నాయని పరిశీలించడానికి ఓ ఇన్‌స్పెక్టర్‌ ఉండాలని కొన్ని వర్కర్స్‌ అసోసియేషన్స్‌ వారు కోరుతున్నారు (ప్రభుత్వం సూచించకపోయినా). కానీ ఇది సరైంది కాదు. షూటింగ్స్‌ ఎలా జరుగుతున్నాయో ఓ వీడియో రూపంలో చిత్రీకరించి ప్రభుత్వ ప్రతినిధులకు నిర్మాతలు అందజేసే ఏర్పాటు జరుగుతుంది’’ అని ఆ లేఖలో పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top