ఆ తీర్పు కాపీరైట్స్‌కు సంబంధించింది కాదు!

High Court Judgement On Ilayaraja Songs - Sakshi

చెన్నై, పెరంబూరు: ప్రస్తుత హైకోర్టు తీర్పునకు తన కాపీరైట్స్‌ హెచ్చరికకు సంబంధం లేదని, తన పాటలపై నిషేధం కొనసాగుతుందని సంగీతదర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. ఇళయరాజా ఎకో రికార్డింగ్‌ సంస్థపై మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్‌కు ఆ సంస్థ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు ఎకో రికా ర్డింగ్‌కు అనుకూలంగా మంగళవారం తీర్పును వెళ్లడించింది.ఈ విషయమై సంగీతదర్శకుడు ఇళయరాజా బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను 2014లో పాటల కాపీరైట్‌ వ్యవహారంలో తన పాటలను ఎవరూ ఉపయోగించరాదని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

తన పాటలను ఎవరూ ఉపయోగించరాదన్న నిషేధం కోర్టు తీర్పు వచ్చే వరకూ కొనసాగుతుందన్నారు. మంగళవారం మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు ఎకో రికార్డింగ్‌ సంస్థకు సంబందించిందని వివరించారు. తాను 2010లో ఆ సంస్థపై వేసిన కేసుపై ఎకో రికార్డింగ్‌ సంస్థ రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేసిందని, ఆ కేసులో వారికి అనుకూలంగా మంగళవారం తీర్పు వచ్చిందని తెలిపారు. అయితే ఒక వర్గం మీడియా తన కాపీరైట్‌ పిటిషన్‌ను కొట్టివేసినట్లు ప్రసారం చేయడం కరెక్ట్‌ కాదన్నారు. తాను 2014లో హైకోర్టులో కాపీరైట్‌ వ్యవహారంలో వేసిన కేసు ఇంకా విచారణలోనే ఉందని చెప్పారు. నాలుగేళ్లుగా ఆ కేసు విషయంలో తీర్పు కోసం ఎదురుచూస్తున్నానన్నారు. ఇలాంటి సమయంలో కాపీరైట్స్‌ పిటిషన్‌ను కొట్టివేసినట్లు తప్పుడు ప్రచారం చేసేవారిపైనా చర్యలు తీసుకుంటానని ఇళయరాజా పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top