‘దొరసాని’ మూవీ రివ్యూ

Dorasani Telugu Movie Review - Sakshi

టైటిల్ : దొరసాని
జానర్ : లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, వినయ్‌ వర్మ, కిషోర్‌ తదితరులు
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాత : మధుర శ్రీధర్, యష్ రంగినేని
దర్శకత్వం : కె.వీ.ఆర్ మహేంద్ర

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా దొరసాని చిత్రంతో పరిచయం అవుతున్నారు. గడీలు, దొరల కాలం నేపధ్యంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్తో అంచనాలను పెంచేసి.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ దొరసాని చిత్రం.. ఆనంద్‌, శివాత్మికలకు మంచి బ్రేక్ ను ఇచ్చిందా? తొలి ప్రయత్నం లొనే విజయం సాధించి.. వీరిద్దరు మంచి నటులుగా గుర్తింపును తెచ్చుకున్నారా? అన్నది చూద్దాం.

కథ
అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో గడీల రాజ్యం నడిచేది. ఓ ఊరి దొర రాజారెడ్డి (వినయ్‌ వర్మ) కూతురు దొరసాని దేవకి(శివాత్మిక రాజశేఖర్‌)ని రాజు (ఆనంద్‌ దేవరకొండ) ప్రేమిస్తాడు. గడీ వైపు చూడాలంటే కూడా భయపడే ఊళ్లో.. రాజు మాత్రం ఏకంగా దొరసానిని ప్రేమిస్తాడు. దొరసాని కూడా రాజును ప్రేమిస్తూ ఉంటుంది. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన దొర ఏం చేశాడు? ఈ కథలో కామ్రేడ్‌ శంకరన్న(కిషోర్‌)కు ఉన్న సంబంధం ఏంటి? శంకరన్న వీరి ప్రేమకు ఎలాంటి సహాయం చేస్తాడు? రాజు-దొరసానిల ప్రేమ ఫలించి చివరకు ఒక్కటయ్యారా? లేదా అన్నదే మిగతా కథ.


నటీనటులు
రాజు పాత్రలో ఆనంద్‌ దేవరకొండ చక్కని నటనను కనబర్చాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెబుతూ ఉంటే.. ప్రేక్షకులకు విజయ్‌ దేవరకొండ గుర్తుకు వస్తుంటాడు. అతని గొంతులోనే కాకుండా లుక్స్‌ పరంగానూ అక్కడక్కడా విజయ్‌లా కనిపిస్తాడు. మొత్తానికి మొదటి ప్రయత్నంగా చేసిన ఈ రాజు పాత్ర ఆనంద్‌కు కలిసి వచ్చేలా ఉంది. ఇక దొరసానిగా నటించిన శివాత్మికకు ఉన్నవి ఐదారు డైలాగ్‌లే అయినా.. లుక్స్‌తో ఆకట్టుకుంది. దొరసానిగా హావభావాలతోనే నటించి మెప్పించింది. ఈ చిత్రంలో ఇద్దరికీ మంచి గుర్తింపు లభిస్తుంది. ‘దొరసాని’ని వీరిద్దరే నడిపించారు. దొర పాత్రలో వినయ్‌ వర్మ, నక్సలైట్‌గా కిషోర్‌, రాజు స్నేహితులు తమ పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నారు.

విశ్లేషణ
పేదింటి అబ్బాయి, పెద్దింటి అమ్మాయి మధ్య ప్రేమ.. ఇలాంటి కథలు మన టాలీవుడ్‌లో ఎన్నోం చూశాం. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో ప్రేమ అనేది లేకుండా మనవాళ్లు తెరకెక్కించిన దాఖాలాలు లేవు. ప్రేమే ఇతివృత్తంగా లేదంటే.. ప్రేమను ఓ భాగంగా గానీ చేసి కథ రాసి మనవాళ్లు సినిమాలను తీస్తుంటారు. అయితే ఎన్నోసార్లు చూసిన ప్రేమ కథే అయినా.. తెరకెక్కించడంలో కొత్తదనం చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. హీరోహీరోయిన్లు తమ నటనతో తెరపై ఫ్రెష్‌నెస్‌ను తీసుకొస్తే అందరూ ఆ కథలో లీనమౌతారు. దొరసాని కూడా అలాంటి కథే.

ఈ కథకు తెలంగాణ గడీల నేపథ్యాన్ని, యాసను జోడించడమే దర్శకుడి మొదటి విజయం. ఇప్పటికే ఎస్టాబ్లిష్‌ అయి.. స్టార్‌ స్టేటస్‌ ఉన్న వాళ్లను తీసుకుంటే ఆ పాత్రకు సరైన న్యాయం జరిగేది కాదేమో అని అనిపించేలా ఆ పాత్రలను మలిచాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని కమర్షియల్‌ బాట పట్టించకుండా తాను నమ్మిన సిద్దాంతానికే కట్టుబడి.. ‘దొరసాని’ని ఓ కళాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే నిదానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల  ప్రేక్షకులను ఆకర్షిస్తుందా అన్నది తెలియాలి. ఎక్కడా బోర్‌ కొట్టించకపోయినా.. తరువాతి సీన్ ఏంటో అన్నది ప్రేక్షకుడికి ఇట్టే తెలిసిపోతుంది. నిదానంగా సాగుతూ ఉండటంతో.. ప్రేక్షకులు కొంత అసహనానికి ఫీలయ్యే అవకాశం ఉంది. చివరగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ ఊహించిందే అయినా.. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టే ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన ప్రశాంత్‌ ఆర్‌. విహారి తన పాటలతో ఆకట్టుకోగా, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సన్నీ కూరపాటి తన కెమెరాతో అప్పటి తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించాడు. ఎడిటర్‌ నవీన్‌ నూలి ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. చక్కటి ఫీల్‌ ఉన్నా.. నెమ్మదిగా సాగే ఈ ‘దొరసాని’ని ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి. 

ప్లస్‌ పాయింట్స్‌
నటీనటులు
సంగీతం

మైనస్‌ పాయింట్స్‌
స్లోనెరేషన్‌
ఊహకందేలా సాగే కథనం

బండ కళ్యాణ్‌, సాక్షి వెబ్‌డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top