నాన్నగారి కలలు నెరవేరుస్తా

నాన్నగారి కలలు నెరవేరుస్తా


‘‘నాన్నగారు ఈ లోకాన్ని విడిచి అప్పుడే రెండేళ్లు అయ్యిందంటే నమ్మలేకపోతున్నా. ఈ రెండేళ్లల్లో నాన్నగారిని తలచుకోని రోజు లేదు. ఇంట్లో, ఆఫీసులో, స్నేహితులతో, చుట్టాలతో నాన్న గురించి మాట్లాడని రోజు లేదు. ఆయనెప్పుడూ మా మనసుల్లోనే ఉన్నారు’’ అని ప్రముఖ నిర్మాత, స్వర్గీయ డి. రామానాయుడి పెద్ద కుమారుడు డి. సురేశ్‌బాబు అన్నారు.


నేడు రామానాయుడుగారి ద్వితీయ వర్ధంతి. ఈ సందర్భంగా డి. సురేశ్‌బాబు ‘సాక్షి’ సినిమాతో మాట్లాడారు. ‘‘నాన్నగారు చాలా మంచి మనిషి. జీవితంలో ఆయనకు ఒక్క శత్రువు కూడా లేరు. అందరూ స్నేహితులే. ప్రతి ఒక్కరితో బాగుండేవారు. ఒకవేళ ఎవరితోనైనా ఏదైనా ఉంటే... ‘ఫర్‌గివ్‌ అండ్‌ ఫర్‌గెట్‌’ అనేది ఆయన పాలసీ. ‘నేను వెళ్లిన తర్వాత నా గురించి తెలుస్తుంది రా’ అని అనేవారు. ఆయన మాటలు అక్షర సత్యాలు. ఇప్పుడు అచ్చంగా అలానే ఉందని చెప్పాలి.


మంచి విషయం ఏంటంటే... గతేడాది నాన్నగారి జ్ఞాపకంగా మా రామానాయుడు స్టూడియోలో మెమోరియల్‌ నిర్మించాం. ఈ ఏడాది ఆ మెమోరియల్‌కి ఇండియాలో స్టోన్‌ ఆర్కిటెక్చర్‌ విభాగంలో స్పెషల్‌ అవార్డు వచ్చింది. మరణించిన తర్వాత కూడా నాన్నకు అవార్డులు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ఈ ఏడాది నాన్నగారి జయంతి (జూన్‌ 6) లోపు మా మెదక్‌లో ‘డాక్టర్‌ డి. రామానాయుడు కృషి విజ్ఞాన కేంద్రం’ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని సురేశ్‌బాబు తెలిపారు. ‘‘ఆల్రెడీ ప్రభుత్వానికి అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. రాగానే కృషి విజ్ఞాన కేంద్రం ప్రారంభిస్తాం’’ అన్నారు. సినిమాల విషయానికి వస్తే... ‘రాముడు–భీముడు’ చిత్రాన్ని రంగుల్లోకి మార్చాలనేది నాయుడి గారి కల.


అలాగే, మీ ఫ్యామిలీ హీరోలు వెంకటేశ్, నాగచైతన్య, రానాలతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ఆయన కలలను నిజం చేస్తారా? అని సురేశ్‌బాబును అడిగితే... ‘‘తప్పకుండా. సరైన సమయంలో వెంకటేశ్‌– చైతు–రానా సినిమా ప్రకటిస్తాం. త్వరలో ‘రాముడు– భీముడు’ని రంగుల్లోకి మార్చే ప్రక్రియ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘రానా దగ్గర నాన్నగారు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు – ‘త్వరలో చేసుకుంటా తాతా’ అనేవాడు. ‘ఘాజీ’ సినిమా ఆయన చూస్తే మనవణ్ణి చూసి గర్వపడేవారు’’ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top