నా వంతు విరాళం సేకరిస్తున్నాను

COVID-19: Donations to SPB Fans Charitable Trust - Sakshi

– ఎస్‌.పి. బాలు

‘కదలిరండి మనుషులైతే... కలసి రండి మమత ఉంటే’... ఇది ‘ఊరికి మొనగాడు’లో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఇప్పుడు ఆయన తన అభిమానులను అదే కోరుతున్నారు. ‘కరోనా’ మీద దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ‘ఎస్‌.పి.బి ఫ్యాన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌’కు విరాళాలు పంపమని కోరుతున్నారు. అయితే ఆయన ఇందుకు వినూత్నమైన మార్గం ఎంచుకున్నారు. వంద రూపాయల నుంచి ఎన్ని రూపాయలైనా విరాళం ఇచ్చి ఒక పాట కోరుకుంటే ఆ అభిమాని కోరిక మేరకు ఆ పాటను పాడి ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేస్తారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల అభిమానులకు బాలు ఈ పిలుపు ఇచ్చారు. విరాళాలు ఇస్తున్న అభిమానుల కోసం ఆ మూడు భాషల పాటలను కూడా పాడి ఆ వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పలకరిస్తే తాను చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడారు.

‘‘పన్నెండు సంవత్సరాలుగా మా ఎస్‌పిబి ఫాన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నడుస్తోంది.  ఆరోగ్యం, విద్య రంగాలలో మాకు తోచిన సాయం చేస్తున్నాం. ఇప్పుడు కరోనాతో బాధపడేవారికి మాత్రమే మా సేవలు పరిమితం కాలేదు. అన్ని విభాగాలలోను పనులు లేక ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు. వారికి కూడా తోచినంత సహాయం చేయాలనుకుంటున్నాను. ఇందుకోసం నేను పాటల ద్వారా విరాళాలు సేకరిస్తున్నాను. శ్రోతలు వాళ్లకు ఇష్టమైన భాషలోని పాట అడగొచ్చు. ఆ పాట నేను పాడతాను. ఇందుకోసం కనీసంగా వంద రూపాయలు పెట్టాం. ఎవరి ఇష్టం వచ్చినంత ఎంతైనా ఇవ్వచ్చు. వంద, ఐదొందలు, వెయ్యి, పదివేలు, యాభైవేలు, లక్ష వస్తున్నాయి. ఇప్పటికి మూడు రోజులు చేశాను.

మార్చి 31 నాటికి, నాలుగు లక్షల డెబ్బై వేల దాకా డబ్బులు పోగయ్యాయి. ఇలా ఎన్నాళ్లు నడుస్తుందో చూసి, మొత్తం వచ్చిన డబ్బుకి, నా సొంత చందా జత చేస్తాను. ఆ తరవాత ఎవరికి ఎలా పంచాలో నిర్ణయించుకుంటాను. కరోనా అవగాహన కోసం తెలుగు, కన్నడం, తమిళం మూడు భాషల్లో ఆర్కెస్ట్రా లేకుండా అవగాహన గీతాలు పాడాను. కన్నడంలో జయంత్‌ కాయికిన్, తెలుగులో వెన్నెలకంటి, తమిళంలో వైరుముత్తు పాటలు రాసి పంపారు. ఇప్పుడు మ్యుజీషియన్స్‌ను పెట్టి చేయలేను కనుక తంబురా పెట్టుకుని పాడాను. ఇవి ఫేస్‌బుక్‌లో బాగా వైరల్‌ అయ్యాయి. వీటికి చాలామంది ఆర్కెస్ట్రా జత చేసి ఫేస్‌బుక్‌లో పెడుతున్నారు. ఇది చాలా ముదావహం. పిల్లలు దీనికి నృత్యాభినయం చేసి పెడుతున్నారు. చాలా ఆనందం. రాంభొట్ల నృసింహశర్మగారు వైద్యులకు సంబందించి ఒక పాట రాశారు. ఆ పాటను కూడా అతి త్వరలో నా వెబ్‌ పేజీలో పెడతాను.
 
ఈ సందర్భంగా అందరికీ ఒక సలహా ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. కరోనా నాకేమి వస్తుందిలే అని అందరూ స్వేచ్ఛగా తిరగటం మానేయండి. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నుంచి మన ప్రభుత్వాల వరకు అందరూ దీని గురించిన ఒక అవగాహన కల్పిస్తున్నారు. వారి మాటలను మనమంతా అనుసరించి తీరాలి.  సమాజం బావుండాలంటే మనం బావుండాలి. అది ముఖ్యమైన విషయం. అత్యవసరమైన పరిస్థితి అయితే తప్ప లక్ష్మణ రేఖ దాటి రాకండి’’ అన్నారాయన.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top