పద్మావతి ఎవరు..?



న్యూఢిల్లీ: ‘పద్మావతి’ బాలివుడ్‌ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీపై రాజ్‌పుత్‌ కర్ణి సేన కార్యకర్తలు దాడి జరపడంపై నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  వారెందుకు దాడి చేశారు? అసలు పద్మావతి ఎవరు? ఆమెపై బన్సాలీ తీస్తున్న సినిమా ఏమిటీ? అది చారిత్రక సినిమానా, చరిత్రను వక్రీకరించే సినిమానా? అసలు వివాదం ఏమిటీ?



నిజానికి సమస్త చరిత్రలు సైతం వివాదాస్పదమే. చరిత్రలో నిలిచిపోయేటివి ఎక్కువగా విజేతలు రాసిన లేదా రాయించిన చరిత్రలవడమే అందుకు కారణం. రాజ్‌పుత్‌ రాజకుటుంబానికి చెందిన ‘పద్మావతి’ క్యారెక్టర్‌ కేవలం కల్పిత గాధనేది మెజారిటీ చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు  శకం 13–14 శతాబ్దానికి చెందిన శక్తివంతమైన ముస్లిం రాజు అల్లావుద్దీన్‌ ఖిల్జీ,  చిత్తార్‌ నేటి చిత్తార్‌గఢ్‌ రాజు రావల్‌ రతన్‌ సింగ్‌ భార్య పద్మావతి అందచందాల గురించి కథకథలుగా విని ఆమెను మోహిస్తారు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసమే 1303లో చిత్తార్‌గఢ్‌ రాజ్యంపై దాడి చేసి రాజ్యాన్ని కైవసం చేసుకుంటారు. తన భర్తతో సహా తన రాజకుటుంబీకులు మరణించారన్న వార్త తెలిసి, తోటి అంత:పుర స్త్రీలతో కలసి రాణి పద్మావతి సామూహిక ఆత్మాహుతికి (నాడు సతి, జవహర్‌గా వ్యవహరించేవారు) పాల్పడుతుంది.





పద్మావతి తెల్సిందిలా...

ఈ కథ ముహమ్మద్‌ జయసీ 1540లో రాసిన కవిత్వం ద్వారా మొదటి సారి ప్రపంచానికి తెల్సింది. ఆ తర్వాత ఆమె గీతా చిత్రాలు కూడా వెలువడ్డాయి. రమ్య శ్రీనివాస్‌ రాసిన ‘ది మెనీ లైవ్స్‌ ఆఫ్‌ రాజ్‌పుత్‌ క్వీన్‌: హిరాయిక్‌ పార్ట్స్‌ ఆఫ్‌ ఇండియా’ అన్న పుస్తకంలో కూడా పద్మావతి గురించి కొంత ప్రస్తావన ఉంటుంది. అయితే పద్మావతి కథ నిజమైనదనడానికి చారిత్రక ఆధారాలేవి దొరకలేదు. ఖిల్జీ లాంటి ముస్లిం రాజును దిక్కరించిన ధీరవనితగా ఆమె కథ మాత్రం ప్రచారంలో ఉంది. రాజ్‌పుత్‌లు బయటి కులాల వారికి పిల్లనివ్వరు, తెచ్చుకోరు. ఆ కుల కట్టుబాటుకు కట్టుబడే పద్మావతి సామూహిక ఆత్మాహుతికి పాల్పడిందన్నది రాజ్‌పుత్‌ల విశ్వాసం. తెగింపు, ధైర్య సాహసాలకు రాజ్‌పుత్‌లు మారుపేరని ‘అమర్‌ చిత్ర కథలు’ కూడా తెలియజేస్తాయి.

అయినా మొగల్‌ రాజులకు లొంగారు...

కాలమాన పరిణామాల్లో రాజ్‌పుత్‌లు కూడా మొగల్స్‌ రాజులకు లొంగిపోవాల్సి వచ్చింది. అక్బర్‌ నుంచి ఫారుక్‌సియర్, అంటే మధ్య 16వ శతాబ్దం నుంచి 18 శతాబ్దం వరకు వారు ఆడ పిల్లలను మొగల్‌ రాజులకు ఇచ్చారు. వారిచేత మామలు, బావలు అని పిలిపించుకున్నారు. మొగల్‌ చక్రవర్తులకు వియ్యంకులవడం ద్వారా తమ రాజ్యాలను రక్షించుకోవడమే కాకుండా ఇతర రాజులు తమమై దాడులు జరపకుండా కొంత కాలం నివారించుకోకలిగారు. చరిత్ర గమనంలో రాజ్‌పుత్‌లు టర్కీలు, మొగల్స్‌ రాజులే కాకుండా మరాఠీలు, పిండారీలు చేతుల్లో కూడా ఓడిపోయారు. ఎలాంటి యుద్ధం చేయకుండానే బ్రిటీష్‌ పాలకులకు లొంగిపోయారు. అయితే ముస్లింల రాజులకు లొంగకుంగా నిలబడింది తామేనని వారు చెప్పుకుంటారు.

పద్మావతంటే బన్సాలీకి ఎంతో ఇష్టం....

సంజయ్‌ లీలా బన్సాలీకి పద్మావతి కథంటే చచ్చేంత ఇష్టం. అందుకే ఆయన 2008లో పారిస్‌లోని ‘డూ చాట్‌లెట్‌’ థియేటర్‌లో ప్రదర్శించిన ఒపేరాకు దర్శకత్వం వహించారు. పద్మావతిపై 1923లో ప్రెంచ్‌ కంపోజర్‌ ఆల్బర్ట్‌ రసెల్‌  రూపొందిచన  ఒపెరాను బన్సాలీ దర్శకత్వం వహించి తనదైన శైలిలో ప్రదర్శించారు. 2002లో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివెల్‌లో బన్సాలీ తీసిన ‘దేవదాస్‌’ చిత్రాన్ని చూసి ముగ్ధుడైన పారిస్‌ ఒపేరా థియేటర్‌ యజమాని జీన్‌ లక్‌ చాప్లిన్‌ ఆహ్వానం మేరకు బన్సాలీ తొలిసారిగా ఒపేరాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది.

కరీనా కపూర్‌తో తీయాలకున్న బన్సాలీ...

స్థానిక నటీనటులతో పారిస్‌లో ప్రదర్శించిన పద్మావతి ఒపేరాకు మంచి పేరు రావడంతో నాడే హిందీలో పద్మావతి సినిమాను తీయాలనుకున్నారు బన్సాలీ. కరీనా కపూర్‌ను పద్మావతిగా పరిచయం చేయాలనుకున్నారు. గుజారిష్‌ లాంటి చారిత్రక సినిమాలు బాక్సాఫీసు వద్ద పల్టీకట్టడంతో సినిమాను వాయిదా వేసుకున్నారు. బాజీరావు మస్తాని, గోలియోంకి రాస్‌లీలా–రామ్‌లీలా సినిమాలు హిట్టవడంతో పద్మావతిని కూడా తెరపైకి ఎక్కించాలనుకున్నారు. చిత్ర నిర్మాణాన్ని ముగించి వచ్చే నవంబర్‌ 17వ తేదీన విడుదల చేయాలని కూడా నిర్ణయించారు.

ఇప్పటికే పద్మావతిపై  చిత్రాలు...

పద్మావతిపై జస్వంత్‌ జావరి 1961లో జై చితోడ్‌ను, మహారాణి పద్మావతి సినిమాను 1964లో తీసి విడుదల చేశారు. పద్మావతిపై మొహమ్మద్‌ జయసీ రాసిన కవిత్వాన్నే జై చితోడ్‌లో పాటలుగా ఉపయోగించారు. తొలి చిత్రంలో పద్మావతిగా నిరుపమా రాయ్‌ నటించగా, తర్వాత చిత్రంలో అనితా గుహ నటించారు. పద్మావతిగా వైజయంతిమాల, ఖిల్జీగా శివాజీ గణేష్‌ నటించిన ‘చిత్తోర్‌ రాణి పద్మిణి’ అనే తమిళ చిత్రం 1963లో విడుదలైంది. దీనికి చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించారు. అంతకుముందు 2009లో ‘చిత్తోడ్‌కీ రాణి పద్మినీ కా జోహుర్‌’ పేరుతో సోనీ టీవీలో సీరియల్‌ కూడా వచ్చింది. తమిళ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిల్‌కాగా, జస్వంత్‌ జావరి దర్శకత్వం వహించిన మహారాణి పద్మావతి సక్సెస్‌ అయింది.

అప్పుడు ప్రభుత్వం సహకరించింది...

జస్వంత్‌ జావరి తీసిన ‘మహారాణి పద్మావతి’ చిత్రానికి నాడు రాజస్థాన్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. రాజ్‌పుత్‌ల ధైర్య సాహసాలను, తెగింపుకు ఆ సినిమా అద్దం పట్టిదంటూ రాజ్‌పుత్‌లు కూడా సినిమాను ఎంతో ఆదరించారు. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ‘జోద్‌ అక్బర్‌’లో కూడా చరిత్రను వక్రీకరించారని, పద్మావతిలో కూడా బన్సాలీ చరిత్రను వక్రీకరిస్తారన్నది రాజ్‌పుత్‌ల అనుమానం. అందుబాటులోవున్న చరిత్ర ప్రకారం పద్మావతి, ఖిల్జీలు ఒకరినొకరు చూసుకోరు. మహారాణి పద్మావతి సినిమాలో మాత్రం చివరలో పద్మావతిని చూసి ఆమె అందానికి ఖిల్జీ మరింత ముగ్ధుడవుతారు. ఇలాంటి కథల మధ్య ఖిల్జీలు, పద్మావతి కలలో కలసుకొని పాటలు పాడుకున్నట్లు బన్సీలీ సినిమా తీస్తున్నారన్నది రాజ్‌పుత్‌ల అనుమానం. అందుకే దాడి చేశారు.

అసలు బాధ వేరేనేమో.....

ఖిల్జీ, పద్మావతి మధ్య ఎలాంటి డ్రీమ్‌ సీక్వెన్సీలు లేవంటూ బన్సాలీ బహిరంగంగా ప్రకటించారు. పైగా తాను తీస్తున్నది విషాదాంత చిత్రం కాదని, రాజ్‌పుత్‌లకు చెందిన ఓ ధీరవనిత మనోధైర్యాన్ని స్ఫూర్తిగా చూపిస్తున్నానని చెప్పారు. ‘నేను చనిపోయేంత పిరికిదాన్ని కాదు. నేను శత్రువలకు చిక్కకుండా మంటల్లోకి నడిచిపోయే మరింత ధైర్యం కావాలి. రాజ్‌పుత్‌ల పరువు, ప్రతిష్టలు చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోవాలి’ అంటూ పద్మావతి అగ్నికి ఆహుతవుతూ చెప్పేమాటలను కూడా కొన్నేళ్ల క్రితమే ఒపేరా ప్రదర్శన సందర్భంలో బన్సాలీ వినిపించడం ఆయన స్ఫూర్తిని తెలియజేస్తోంది. చరిత్రలో పద్మావతి ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆమెపై చిత్రం తీస్తే రాజ్‌పుత్‌ల పరువు ఎందుకు పోతుందో అర్థం కాదు. వారి పేరుతో వచ్చిన రాజస్థాన్‌ ఉన్నంతకాలం చరిత్రలో వారు మిగిలే ఉంటుంది కదా, ముస్లిం రాజుల చేతుల్లో ఓడిపోయామన్న బాధ!
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top