లైటింగ్‌ + షాడో = సాహో

Cinematographer Madhi Talks about Prabhas Saaho - Sakshi

లార్జర్‌ దాన్‌ లైఫ్‌ సినిమాలను ‘విజువల్‌ వండర్‌’ అని సంబోధిస్తుంటారు. దర్శకుడు మెదడులో అనుకున్న కథను సినిమాటోగ్రాఫర్‌ తన కెమెరాతో స్క్రీన్‌ పై చూపిస్తాడు. మన కంటే ముందే తన లెన్స్‌తో సినిమా చూసేస్తాడు కెమెరామేన్‌. ‘సాహో’ లాంటి భారీ సినిమాని తన కెమెరా కన్నుతో ముందే చూసేశారు చిత్ర ఛాయాగ్రాహకుడు మది. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌ జంటగా సుజీత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 30న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’కి మది ప్రత్యేకంగా చెప్పిన ‘మేకింగ్‌ ఆఫ్‌ సాహో’ విశేషాలు.

► 350 కోట్ల భారీ బడ్జెట్‌ సినిమా చేసే చాన్స్‌ తరచు రాదు. ప్రభాస్‌తో గతంలో ‘మిర్చి’ చేశాను. స్వతహాగా ఆయన హ్యాండ్‌సమ్‌గా ఉంటారు. ‘మిర్చి’లో స్టైలిష్‌గా చూపించే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు ‘సాహో’లో మరిన్ని షేడ్స్‌లో ప్రభాస్‌ని చూపించాను. దర్శకుడు సుజీత్‌ తీసిన ‘రన్‌ రాజా రన్‌’కి వర్క్‌ చేశాను. యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌ నాకు మంచి స్నేహితులు. ‘సాహో’ లాంటి విజువల్‌ వండర్‌కి పని చేయడం అద్భుతమైన అవకాశం. విజువల్‌గా ఈ సినిమా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది.

► ఇలాంటి భారీ సినిమాకు హోమ్‌ వర్క్‌ లేకుండా డైరెక్ట్‌గా సెట్లో దిగలేం. ‘సాహో’ సినిమాకు ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్, ప్రీ–డిజైన్‌ వర్క్‌ చాలా ఎక్కువ చేశాం. అవుట్‌పుట్‌ ఎలా వస్తుందో? అని ముందే రఫ్‌గా చూసుకున్నాం. కెమెరామేన్, యాక్షన్‌ డైరెక్టర్, వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ అందరం కలిసి టీమ్‌గా వర్క్‌ చేశాం.

► ‘సాహో’ బహుభాషా చిత్రం. ఒక భాషలో ఓ సన్నివేశం తీయగానే అదే సన్నివేశాన్ని యాక్టర్స్‌ అందరూ వేరే భాషలో నటించాలి. దానికి లైటింగ్‌ చాలా ముఖ్యం. అందుకే సన్నివేశానికి సంబంధించిన వాతావరణాన్ని మొత్తం లైటింగ్‌తో సృష్టించాం. అప్పుడు కంటిన్యూటీ మొత్తం మా కంట్రోల్‌లోనే ఉంటుంది. కొన్ని సన్నివేశాలకు లైటింగ్‌ సృష్టించడానికి రెండు మూడు రోజులు పట్టేది.

► ఈ సినిమాలో ప్రభాస్‌ క్యారెక్టర్‌ పలు షేడ్స్‌లో ఉంటుంది. కథకు తగ్గట్టు క్యారెక్టర్‌ మారినప్పుడల్లా లైటింగ్‌ కూడా మార్చాలి. మామూలుగా ఏ సినిమాకైనా 4కెడబ్లు్య (కిలో వాట్స్‌), 6కెడబ్లు్య లేకపోతే 9కెడబ్లు్య లైటింగ్‌ వాడతాం. కానీ, ‘సాహో’కి మాత్రం హై ఇంటెన్సిటీ లైటింగ్‌ వాడాం. 16కెడబ్లు్య నుంచి 18కెడబ్లు్య లైటింగ్‌ వాడాం. దాన్నిబట్టి ఈ కథ మైలేజ్‌ని ఊహించుకోవచ్చు. చెప్పాలంటే సినిమా మొత్తం లైటింగ్, షాడో ఓరియంటెడ్‌గా ఉంటుంది. కథకు, సినిమాటోగ్రఫీకి వారధిలా లైటింగ్‌ నిలిచిందని చెప్పొచ్చు.

► ఈ సినిమాకు ఒకటి రెండు కాదు కొత్త కొత్త కెమెరా పరికరాలు చాలా ఉపయోగించాం. సుమారు 7–8 కెమెరా హెడ్స్‌ను వాడాం. ఈవో కార్, స్కార్పియో రిమోట్‌ హెడ్‌ కెమెరాలు, స్పెషల్‌ జీఎఫ్‌8 కెమెరాలు, 2 జిమ్మీ జిబ్స్, మాక్సిమస్‌ కెమెరా హెడ్‌ (అన్నింటి కంటే కొంచెం ఖరీదైన పరికరం ఇది). వెబ్రేషన్స్‌ను అదుపులో ఉంచే జింబల్‌ హ్యాండ్‌ కెమెరాలు, చాప్‌మ్యాన్‌ డాలీ, జీఎఫ్‌ఎమ్‌ క్రేన్‌ ఇవన్నీ ఉపయోగించాం. హాలీవుడ్‌ యాక్షన్‌ మాస్టర్‌ కెన్నీ బేట్స్‌తో సంభాషించి కొన్ని పరికరాలను జర్మనీ నుంచి తీసుకువచ్చాం. సన్నివేశానికి అనుగుణంగా, క్వాలిటీకి రాజీపడకుండా కెమెరాలు వాడాం.

► అబుదాబిలో షూట్‌ చేసిన యాక్షన్‌ సన్నివేశాలకు ప్రతిరోజు సెట్లో 14 కెమెరాలు వరకూ ఉండేవి. మెయిన్‌ కెమెరాలు 7, ఇతర కెమెరాలు 7. సుమారు 25 రోజులు ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌ని చిత్రీకరించాం. నా టీమ్‌ మొత్తం 60 మంది. అబుదాబి షెడ్యూల్‌లో దాదాపు 80మంది కెమెరా డిపార్ట్‌మెంట్‌కే వర్క్‌ చేశారు. ఫోకస్‌ పుల్లర్స్, లైటింగ్‌ డిపార్ట్‌మెంట్, క్రేన్స్‌ ఇలా ఒక్కో విభాగం చూసుకున్నారు. అందులో 20 శాతం ఫారిన్‌ వాళ్లు కూడా పని చేశారు. ఫారిన్‌ వాళ్లతో పని చేసే సమయంలో ఓ ఇబ్బంది ఉంది. అదేంటంటే కమ్యూనికేషన్‌. ఒక్కో డిపార్ట్‌మెంట్‌కు టెక్నికల్‌ పదాలు ఒక్కోలా ఉంటాయి. యాక్షన్‌ వాళ్ల టెక్నికల్‌ పదాలు ఒకలా ఉంటాయి. కెమెరా వాళ్లవి ఒకలా ఉంటాయి. వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పడం కూడా చిన్న చాలెంజే (నవ్వుతూ).

► ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల్లో నలిగిపోయినవన్నీ ఒరిజినల్‌ ట్రక్కులు, కార్లు. ముందు డమ్మీలతో ప్రాక్టీస్‌ చేసి ఆ తర్వాత ఒరిజినల్‌ కార్స్, ట్రక్స్‌ని బద్దలు కొట్టారు.  సినిమాలో ఎంత మోతాదులో యాక్షన్‌ ఉందో.. అంతే ప్రాముఖ్యత లవ్‌స్టోరీకి కూడా ఉంటుంది. యాక్షన్‌ సన్నివేశాలకు ఒక మూడ్‌ ఉంటుంది. ప్రేమ సన్నివేశాలు ఒక మూడ్‌. ఈ వ్యత్యాసాన్ని స్క్రీన్‌ మీద చూపించడం చాలా ఎంజాయ్‌ చేశాను.

ప్రభాస్, శ్రద్ధాకపూర్‌

► అబుదాబి ఫైట్‌ ఎపిసోడ్‌ కాకుండా గన్‌ఫైట్స్‌ కూడా ఎక్కువ ఉన్నాయి. డమ్మీ బులెట్స్‌తో షూట్‌ చేసినప్పటికీ ఈ ఎఫెక్ట్‌ కొత్తగా ఉంటుంది. కెమెరా మూమెంట్స్‌ అన్నీ గన్‌ పాయింట్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. అటు కెమెరాకి ఇటు మాకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ ఫైట్‌ ఎపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

► భారీ యాక్షన్‌ సినిమా చేస్తున్నప్పుడు ప్రమాదాలు అనివార్యం. కానీ మే మాత్రం ఎవరి లైఫ్‌నీ రిస్క్‌ చేయదలచుకోలేదు. యాక్షన్‌ సన్నివేశాల్లో కారు 150 కి.మీ. ల వేగంతో వెళ్తుందంటే అంత స్పీడ్‌తో కెమెరా ఫాలో కానక్కర్లేదు. మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఉపయోగించుకున్నాం. అలా టెక్నాలజీ హెల్ప్‌తో ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. 225 రోజులు వర్కింగ్‌ డేస్‌ ఉన్నప్పటికీ ఒక్క కెమెరా పరికరానికి డ్యామేజ్‌ జరగలేదు. అదే పెద్ద విశేషం. పెద్ద పెద్ద ట్రక్కులను, కార్లను మాత్రమే డ్యామేజ్‌ చేశాం (నవ్వుతూ). టోటల్‌గా ‘సాహో’ మాకో మంచి అనుభూతి. రేపు ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి అవుతుంది.

► అబుదాబి వాతావరణం భిన్నంగా ఉంటుంది. అక్కడ ఎండ 45 డిగ్రీలు పైనే. అబుదాబి షెడ్యూల్‌లో చాలామంది వడదెబ్బకు గురయ్యారు. మాలో కొంతమందికి చర్మం ఊడొస్తుండేది. అనూహ్యంగా ఇసుక తుఫానులు కూడా వస్తుండేవి. అలాంటి సమయాల్లో మమ్మల్ని మేం కాపాడుకుంటూనే మా ఖరీదైన కెమెరాలను కూడా జాగ్రత్త చేసేవాళ్లం. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా కష్టపడతాం. అవుట్‌పుట్‌ చూశాక ఆ కష్టాలన్నీ మర్చిపోతాం.

► ఈ సినిమా చిత్రీకరణకు 230 రోజులు పట్టింది. అది కూడా 8 రోజులు టెస్ట్‌ షూట్, 50 రోజుల లైటింగ్‌ అరేంజ్‌మెంట్‌ను మినహాయించి.

► ‘సాహో’ కోసం సుమారు 60 సెట్లను ఏర్పాటు చేశారు. ఈ సెట్లన్నీ హైదరాబాద్, పూణే, ముంబై, అబుదాబి, యూరోప్‌లో వేశారు.

► 350 కోట్ల బడ్జెట్‌లో కెమెరా డిపార్ట్‌మెంట్‌కు కేటాయించిన బడ్జెట్‌ సుమారు 25 కోట్లు (కెమెరామేన్ల రెమ్యూనరేషన్లు మినహాయించి).

– గౌతమ్‌ మల్లాది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top