ఊరూ వాడా ఉయ్యాలవాడ

ఊరూ వాడా ఉయ్యాలవాడ


ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు?... ఇప్పటి యూత్‌ ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే వెంటనే గూగుల్‌ హెల్ప్‌ తీసుకుంటారు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అని పేరు టైప్‌ చేయగానే స్క్రీన్‌పై కనిపిస్తున్న బొమ్మ ఎవరిదో తెలుసా? చిరంజీవిది! స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఆయన సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు గూగుల్‌ సెర్చ్‌లో నరసింహారెడ్డి చరిత్ర తెలుసుకునే ప్రయత్నంలో చాలామంది ఉన్నారు.కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామంలో పుట్టారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటీషు అరాచక పరిపాలనపై తిరుగుబాటు చేసిన వీరుడు. 1847లో వీరమరణం పొందిన ఈ స్వాతంత్య్ర సమర యోధుడి జీవితాన్ని సిల్వర్‌ స్క్రీన్‌పై ఆవిష్కరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.  సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్‌ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రీ–ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయి. ఇప్పడు ఊరూ వాడా ఈ సినిమా గురించే చర్చ. అక్కడక్కడా ఈ చిత్రం గురించి చక్కర్లు కొడుతున్న ఆసక్తికరమైన వార్తలు తెలుసుకుందాం.తెలుగులో వంద కోట్ల బడ్జెట్‌ అంటేనే కష్టం. అలాంటిది ‘బాహుబలి–2’ని 250 కోట్లతో తీస్తున్నారని తెలియగానే ‘వర్కవుట్‌ అవుతుందా?’ అని సందేహించినవాళ్లు ఉన్నారు. కానీ, ఈ సినిమా 1,500 కోట్లు కలెక్ట్‌ చేసి, టాలీవుడ్‌ మార్కెట్‌ని పెంచింది. పెద్ద బడ్జెట్‌ చిత్రాలకు ‘బాహుబలి’ రూట్‌ వేసింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు 100, 200 కోట్లు. ఆ పైన కూడా ఖర్చు పెట్టి, సినిమాలు తీయడానికి తెలుగు నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని కూడా ఖర్చుకు వెనకాడకుండా తీయాలనుకుంటున్నారు. 150 నుంచి 200 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారట. ∙తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తీయాలన్నది యూనిట్‌ ప్లాన్‌ అట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్‌ అంటే తెలుగువాళ్లకు మాత్రమే కనెక్ట్‌ అవుతుంది కాబట్టి, ఇతర భాషలకు కూడా తగ్గట్టు టైటిల్‌ పెట్టాలనుకుంటున్నారట. ప్రస్తుతానికి ఇది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే అని భోగట్టా.మిగతా భాషల్లో పేరు పొందిన నటీనటులను తీసుకుంటే, మార్కెట్‌ పరిధి పెరుగుతుందనే ఆలోచన కూడా చిత్రబృందానికి ఉంది. ఈ నేపథ్యంలోనే కథానాయికగా ఐశ్వర్యా రాయ్‌ పేరు సీన్లోకొచ్చింది. ఇందులో ఉన్న అత్యంత కీలక పాత్ర కోసం అమితాబ్‌ బచ్చన్‌ని తీసుకోవాలను కుంటున్నారని టాక్‌. అలాగే తమిళ, కన్నడ.. ఇలా ఇతర సౌత్‌ లాంగ్వేజెస్‌ ఆర్టిస్టులు కూడా నటిస్తారట.  ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ హిందీ మార్కెట్‌కి వెళ్లాలంటే కరణ్‌ జోహారే సరైనోడని భావించి, రామ్‌చరణ్‌ ఆయనతో మాట్లాడారనే వార్త షికారు చేస్తోంది.∙కథా కథనాలు, నటీనటుల కాస్ట్యూమ్స్, నాటి రాయలసీమను తలపించే సెట్స్, లొకేషన్స్‌.. ఇలా ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌కి ఎక్కువ రోజులు పడుతుందట. అలాగే వీఎఫ్‌ఎక్స్‌ ఉంటాయి కాబట్టి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలకు కూడా ఎక్కువ రోజులు పడుతుందని సమాచారం. గ్రాఫిక్స్‌కి ఇక్కడివారితో పాటు హాలీవుడ్‌ నిపుణులు కూడా పని చేస్తారట. ఆగస్ట్‌లో సినిమాని ప్రారంభించి, వచ్చే సమ్మర్‌కి రిలీజ్‌ చేస్తారట. ∙ఈ చిత్రంలో చిరంజీవి గుబురు గడ్డంతో కనిపిస్తారట. ఆ గడ్డాన్ని రకరకాలుగా ట్రిమ్‌ చేసి, ఫైనల్లీ ఒకటి ఫిక్స్‌ చేస్తారట. త్వరలో కాస్ట్యూమ్స్‌ ట్రైల్స్‌ కూడా మొదలవుతాయట.

Back to Top