కథ లేకుండా సినిమా నిర్మించడం సాధ్యమా?

కథ లేకుండా సినిమా నిర్మించడం సాధ్యమా? - Sakshi


చెన్నై: కథ లేకుండా చిత్రాన్ని రూపొందించడం సాధ్యమా? ఈ విషయంపై 20 మందికి పైగా సీనియర్ దర్శకులతో చర్చ జరిగింది. దీనికి పార్తిపన్ తాజా చిత్రం కథై తిరైకథై వసనం ఇయక్కం చిత్ర ఆడియో కార్యక్రమంలో భాగంగా చెన్నై నగరంలోని సత్యం థియేటర్ వేదికయ్యింది. దర్శక నటుడు ఆర్.పార్తిపన్ తెరకెక్కిస్తున్న చిత్రం కథై తిరైకథై వసనం ఇయక్కం. రివల్స్ క్రియేషన్స్, బయాస్కోప్ ఫేమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూతన తారలు సంతోష్, విజయ్‌రాం, దినేష్, లల్లు, అఖిలా కిషోర్, మహా లక్ష్మి, సాహిత్య జగన్నాథన్ ముఖ్య పాత్రలు పోషించగా ఒక కీలక పాత్రలో తంబిరామయ్య నటించారు. అతిథి పాత్రల్లో విశాల్, ఆర్య, విజయ్ సేతుపతి, చేరన్, ప్రకాష్‌రాజ్, కలైజ్ఞానం, ధనుంజయన్, అమలాపాల్, తాప్సీ వంటి ప్రముఖులు నటించడం విశేషం.



ఈ చిత్రానికి శరత్, విజయ్ ఆంటోని, ఆల్ఫోన్స్ జోసఫ్, నేపథ్య సంగీతం సత్య అంటూ మొత్తం ఐదుగురు సంగీతాన్ని అందించడం మరో విశేషం. ఈ చిత్రానికి కథే లేదంటున్న దర్శకుడు పార్తిపన్ ఒక పెద్ద అకేలా క్రేన్‌పై అమర్చిన కెమెరాతో ఆడియోను ఆవిష్కరించారు. కాగా కథ లేకుండా కథై తిరైకథై వసనం ఇయక్కం చిత్రాన్ని తెరకెక్కించినట్లు పార్తిపన్ పేర్కొనడంతో దర్శకుడు కలైంజన్ నేతృత్వంలో దర్శకుడు కె.భాగ్యరాజ్, విక్రమన్, వెట్రిమారన్, సముద్రకని, లింగుసామి, ప్రకాష్‌రాజ్, సుశీంద్రన్, తంబిరామయ్య, ఎ.ఎల్.విజయ్, జె.ఎస్.నందిని మొదలగు 20 మందికి పైగా సీనియర్ దర్శకులతో కథ లేకుండా చిత్ర రూపకల్పన సాధ్యమా అనే విషయంపై చర్చావేదిక ఆసక్తికరంగా జరిగింది.



అనంతరం దర్శకుడు పార్తిపన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ చిత్రం ఒక సరి కొత్త ప్రయోగంగా పేర్కొనవచ్చన్నారు. ఇందులో హీరోహీరోయిన్లు అంటూ ఎవరూ ఉండరన్నారు. అసలు చిత్రంలో డ్యూయెట్లు కూడా ఉండరాదని తొలుత అనుకున్నానని, ఆ తర్వాత నాలుగు పాటలు చేర్చాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు. కథ లేని చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న ప్రశ్నకు ఇదో గొప్ప కథ అని చెప్పి తీరా ప్రేక్షకులు చిత్రం చూసి నిరాశ పరచడం కంటే, ఏమీలేదంటూ వారికో మంచి చిత్రాన్ని అందించడం ఉన్నతం కదా అంటూ పార్తిపన్ బదులిచ్చారు.



చిత్రంలో పలువురు సినిమా తారలు అతిథి పాత్రల్లో నటించారు. ఇది  సినిమాగా భావించవచ్చా? అన్న ప్రశ్నకు కథ గురించి ప్రస్తుతానికి సస్పెన్స్ అని మరో నెలలో చిత్రం తెరపైకి రానుందని అప్పు డు ప్రేక్షకులకే ఇది ఎలాంటి సినిమా అన్నది అర్థం అవుతుందని పార్తిపన్ పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top