సీనియర్ నటి షకీలా కన్నుమూత
సాక్షి, ముంబై: సీనియర్ నటి షకీలా (82) కన్నుమూశారు. బుధవారం ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు నేడు (గురువారం) ప్రకటించారు. షకీలా బంధువు, నటి నాజిర్ ఖాన్ ఫేస్బుక్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
బాబూజీ ధీరే చల్నా...బార్ బార్ దేఖో.. హజార్ బార్ దేఖో అంటూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న షకీలా...రాజ్‌కపూర్, షమ్మీ కపూర్, గురుదత్ లాంటి బాలీవుడ్లో హీరోలతో కలసి నటించారు. ముఖ్యంగా గురుదత్ క్లాసిక్ మూవీలు ఆర్‌పార్(1954) సీఐడీ(1956)లతో పాటు చైనా టౌన్, శ్రీమన్ సత్యవాది ,ఆలీ బాబా ఔర్ చాలీస్ చోర్ ,పోస్ట్ బాక్స్ 999 లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. షకీలా మృతిపై పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు, నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.