రెండూ కష్టమైన పాత్రలే!

రెండూ కష్టమైన పాత్రలే!


‘‘ఇప్పుడు పరిస్థితులు, కథలు మారాయి. కథలు రాసే విధానం మారింది. ప్రేక్షకులు కథలో కొత్తదనం ఉంటేనే ఆదరిస్తున్నారు. పక్కా కమర్షియల్, ఊర మాస్‌ సినిమాలు చేస్తే క్రెడిబిలిటీ దొరకడం లేదు. కథలో ఏదైనా నావల్టీ ఉంటేనే ముందుకు వెళ్లాలని నా ఆలోచన’’ అన్నారు దర్శకుడు సంపత్‌ నంది.ఈ రోజు ఆయన బర్త్‌డే. ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా ‘గౌతమ్‌నంద’ తెరకెక్కిస్తున్న సంపత్‌ నంది ఈ సందర్భంగా చెప్పిన ముచ్చట్లు....ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటి?

చెన్నైలో ‘గౌతమ్‌నంద’ చిత్రీకరణలో పుట్టినరోజు జరుపుకుంటున్నా. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ను ఇప్పటివరకు 25 లక్షలమంది చూశారు. దీన్ని ప్రేక్షకులు నాకు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నా.► తొలిసారి గోపీచంద్‌ గడ్డంతో కనిపిస్తున్నారు. ఈ ఐడియా ఎవరిది?

ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌లో స్థానం సంపాదించిన బిలియనీర్‌ కొడుకు పాత్ర గోపీచంద్‌గారిది. ప్రపంచవ్యాప్తంగా ఫోర్బ్స్‌లో స్థానం సంపాదించిన వ్యక్తులు, వాళ్ల పిల్లల లైఫ్‌ సై్టల్‌ ఎలా ఉంది? అని రీసెర్చ్‌ చేసి ఈ లుక్‌ ఫైనలైజ్‌ చేశాం. కథ, క్యారెక్టర్‌ ప్రకారం చేసింది తప్ప... ఏదో సై్టల్‌ కోసం పెట్టలేదు. హీరోను నేను ఎలా ఊహించుకున్నానో... గోపీచంద్‌గారు అంతకంటే బాగున్నారు. సినిమా కోసం ఆయన స్కైడైవ్, వింగ్‌ వాక్‌ (ఫ్లైట్‌పై నుంచుని నడిచే షాట్స్‌), ఎడారిలో బైక్‌ రైడింగ్‌ వంటి వైల్డ్‌ అడ్వంచర్స్‌ అన్నీ చేశారు. దర్శకుడిగా నేను ఏదైనా రాసుకోవచ్చు. కానీ, హీరో నుంచి సహకారం లేకుంటే ఏదీ చేయలేను. గోపీచంద్‌గారు ఎంత కష్టపడ్డారంటే ఒక్కో షాట్‌కు 200 కిలోమీటర్లు జర్నీ చేసిన రోజులున్నాయి.

 


► ఇందులో గోపీచంద్‌ హీరోగా, విలన్‌గా నటిస్తున్నారట! నిజమేనా?

కాదు. హీరో క్యారెక్టర్‌లో రెండు షేడ్స్‌ ఉంటాయి. హిందీ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో తంగబలిగా నటించిన నికితిన్‌ ధీర్, ముఖేష్‌ రుషి... ఇద్దరూ విలన్లుగా నటిస్తున్నారు. అలాగే, పవన్‌కల్యాణ్‌గారి కోసం రాసిన కథ కాదిది. ఎవరి దగ్గరో మార్కులు కొట్టేయడానికి ‘గౌతమ్‌నంద’ టైటిల్‌ పెట్టలేదు. సినిమా చూస్తే టైటిల్‌ జస్టిఫికేషన్‌ తెలుస్తుంది.► రమణ మహర్షి ‘హూ యామ్‌ ఐ’ పుస్తకం స్ఫూర్తితో ‘గౌతమ్‌నంద’ తీస్తున్నట్టు చెప్పారు. అంత ఫిలాసఫీ ప్రేక్షకులకు బోర్‌ కొడుతుందేమో?

ప్రజలకు లేదా ఊరికి కష్టం వస్తే హీరో ఆదుకున్నాడనే అంశాల చుట్టూ ఇంతకు ముందు నేను చేసిన కమర్షియల్‌ సినిమాలు తిరిగాయి. కానీ, తొలిసారి ప్రజల కోసమో, ఇంకెవరి కోసమో కాకుండా... తన కోసం తాను ప్రయాణించే వ్యక్తి (హీరో) కథను తెరపై చూపించబోతున్నా. ‘నువ్వు ప్రపంచానికి పరిచయం చేసుకో’ అని కుమారుణ్ణి బయటకు పంపిస్తాడు ఓ తండ్రి. అప్పుడు వేమనగారిని వాళ్ల వదినగారు తిట్టినప్పుడు, రైల్వే కంపార్ట్‌మెంట్‌ నుంచి గాంధీగారిని తోసేసినప్పుడు మన విలువ ఏంటి? అని వాళ్లు తెలుసుకున్నట్టు... హీరో సోషల్‌ రెస్పాన్సిబిలిటీని ఎలా క్రియేట్‌ చేశాడు? అనేదాన్ని చూపిస్తున్నాం. ఆర్ట్‌ ఫిల్మ్‌లా ఉండదు. పక్కా కమర్షియల్‌ సినిమా.

 


► దర్శకుడిగా, నిర్మాతగా డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారు. రెండిటిలో ఏ రోల్‌ బాగుంది?

రెండూ కష్టమైన పాత్రలే. నిర్మాతగా చేయడానికి కారణం ఏంటంటే... అప్పుడప్పుడూ ఓ ప్రేమకథ ఐడియా వస్తుంది. దాన్ని రాసుకుని ఎక్కడో లోపల పెట్టుకోవడం కంటే... బయటకు పంపిస్తే పదిమందికి నచ్చొచ్చు. అందుకే, క్యూట్‌ లవ్‌స్టోరీ ఐడియా వస్తే నిర్మాతగా మారుతున్నా.► స్టార్స్‌తో సినిమాలు చేశాక మీలాంటి దర్శకులు మళ్లీ చిన్నవాళ్లతో సినిమా చేయరెందుకు?

నిజం చెప్పాలంటే... ఎక్కడో ఇన్‌సెక్యూరిటీ! సడన్‌గా చిన్నవాళ్లతో సినిమా చేస్తే అదేమైనా అయితే ప్రాబ్లెమ్‌ అవుతుందేమోనని! భారీ సినిమా ఛాన్స్‌ ఉన్నప్పుడు ఎవరూ చిన్న సినిమా చేయరేమోనని నా ఫీలింగ్‌.► ‘గౌతమ్‌నంద’ తర్వాత ఏంటి?

ఏ కథతో తర్వాత సినిమా చేస్తున్నారని అడిగితే చెప్పగలను. కానీ, ఎవరితో అనేది చెప్పలేను. ఈ సినిమా తర్వాత మంచి కథ రాసి, అది ఎవరికి నచ్చితే ఆ హీరోతో సినిమా చేద్దామనేది నా ఆశ.

Back to Top