అజిత్‌తో యాక్షన్‌కింగ్‌ ఢీ?

Arjun teams up with Ajith Kumar in Viswasam - Sakshi

తమిళసినిమా: అజిత్‌ నటించిన వివేగం చిత్రం విడుదలై చాలా కాలం అవుతోంది. దీంతో ఆయన తాజా చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే అజిత్‌ తాజా చిత్రం గురించి చాలా వివరాలు వెలువడ్డాయి. శివ దర్శకత్వంలోనే అజిత్‌ మరోసారి నటించడానికి డిసైడ్‌ అయ్యారు. ఈ సారి ఆయన ఉత్తర చెన్నై రౌడీగా కనిపించడానికి తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి విశ్వాసం అనే టైటిల్‌ నిర్ణయించారు. వివేగం వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన సత్యజ్యోతి ఫిలింస్‌ అధినేత త్యాగరాజన్‌నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అగ్ర నటి నయనతార కథానాయకిగా నటిస్తున్నారు. చిత్ర యూనిట్‌ షూటింగ్‌ను మార్చిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో మరో ముఖ్యమైన పాత్రను యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పోషించనున్నారనే వార్త తాజాగా వినబడుతోంది. అజిత్, అర్జున్‌ ఇంతకు ముందు మంగాత్తా చిత్రంలో నటించారు. ఆ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. తాజాగా విశ్వాసం చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరగడంతో చిత్రంపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో అర్జున్‌ విలన్‌గా నటించనున్నారనే ప్రచారం జరుగుతుండటం విశేషం. ఇటీవల ఎలాంటి ప్రాత అయినా ప్రాముఖ్యత ఉంటే నటించడానికి రెడీ అంటున్న అర్జున్‌ ఆ మధ్య ఒక తెలుగు చిత్రంలోనూ విలన్‌గా నటించారు. మరి విశ్వాసం చిత్రంలో అజిత్‌కు ఎలాంటి పోటీ ఇస్తారో వేచి చూడాలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top